వచ్చే ఏడాదికి జోజిలా టన్నెల్‌ సిద్ధం : కేంద్రమంత్రి

Update: 2021-09-28 14:30 GMT
భారతదేశానికి కిరీటం వంటి జమ్ముకశ్మీర్‌లోని మంచుకొండల్లో సాంకేతిక అద్భుతం నిర్మాణమవుతున్నది. ప్రజావసరాలతోపాటు శత్రువుల నుంచి మన భూభాగాన్ని కాపాడుకొనేందుకు ఇది భవిష్యత్తుల్లో అత్యంత కీలకం కానున్నది. సోనామార్గ్‌-కార్గిల్‌-లేహ్‌- లఢక్‌ లను కలుపుతూ వ్యూహాత్మక రహదారి నిర్మాణం శరవేగంగా సాగుతున్నది. సముద్రమట్టానికి దాదాపు 11,500 కిలోమీటర్ల ఎత్తులో హిమాలయాలను తొలుస్తూ రెండు భారీ సొరంగాలను తవ్వి ఈ రహదారిని నిర్మిస్తున్నారు. శ్రీనగర్‌-లేహ్‌ మార్గం ఎత్తయిన మంచుకొండలు, అనిశ్చిత వాతావరణంతో ఏడాదిలో కొన్ని నెలలు మాత్రమే తెరిచి ఉంటుంది. నవంబర్‌ నుంచి ఏప్రిల్‌ వరకు మంచుతో కప్పివేయబడుతుంది. దీంతో రవాణా సేవలు నిలిచిపోతాయి.

దేశ రక్షణ దృష్ట్యా ఈ మార్గం అత్యంత ముఖ్యమైంది కావటంతో ఏడాది పొడవునా రాకపోకలు సాగించటంతోపాటు ప్రయాణ దూరాన్ని, కాలాన్ని తగ్గించేందుకు ఈ టన్నెళ్లను నిర్మిస్తున్నారు. ఇప్పుడు ప్రతిష్ఠాత్మకంగా నిర్మించే రహదారులు, టన్నెళ్లు భవిష్యత్తు అవసరాలకు ఎంతో ఉపయోగపడనున్నాయి. ఆధునిక టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో ఈ ప్రాజెక్టును 2012లో ప్రారంభించారు. ప్రతికూల పరిస్థితుల కారణంగా జోజిలా టన్నెల్‌లో తూర్పు వైపు నుంచి 120 మీటర్లు, మరోవైపు 380 మీటర్ల పనులే పూర్తిచేశారు. 2018లో జోజిలా, జడ్‌ మోర్‌ టన్నెల్‌ నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నది. దాంతో జాతీయ రహదారులు, మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఎన్‌హెచ్‌ఐడీఎల్‌)ఈ ప్రాజెక్టును మళ్లీ ప్రారంభించింది.

దేశ సరిహద్దుల్లో మేఘా ఇంజినీరింగ్ సంస్థ నిర్మిస్తున్న జోజిలా టన్నెల్ ప్రాజెక్టును కేంద్ర కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పరిశీలించారు. అనంతరం ఈ ప్రాజెక్టులపై అధికారులతో, మేఘా ప్రతినిధులతో సమీక్షించారు. జోజిలా టన్నెల్ జాతీయ భద్రత, సైనిక అవసరాలను తీర్చడానికి, జమ్మూ కాశ్మీర్, లఢఖ్ ప్రాంతాల అభివృద్ధికి, పర్యాటకరంగ అభివృద్దికి దోహదపడుతుందని నితిన్ గడ్కరీ వెల్లడించారు. టన్నెల్ లడఖ్ ప్రాంతం- కార్గిల్, లేహ్‌కి ఏడాది పొడవునా రహదారి కనెక్టివిటీగా ఉంటుందని, దీనివల్ల యువతకు ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు. దీంతో కేంద్ర పాలిత ప్రాంతాలైన లఢఖ్, జమ్మూకాశ్మీర్ కు నిరంతర కనెక్టివిటీ ఉంటుందని  రవాణా సమస్యలు తగ్గి అభివృద్ధి జరుగుతుందన్నారు. అయితే  జోజిలా టన్నెల్ వచ్చే ఏడాది నాటికి పూర్తవుతుందని  రవాణాకు కూడా అనుమతిస్తామని గడ్కరీ ఆశాభావం వ్యక్తంచేశారు.

జోజిలా సొరంగానికి సంబంధించిన అన్ని పనులు ప్రారంభమయ్యాయి. 300-400 మీటర్ల పనులను పూర్తి చేశాం. పనులు ఊపందుకుంటున్నాయని  మేఘా ఇంజనీరింగ్‌ డీజీఎం (ప్రాజెక్ట్స్‌) ప్రశాంత్‌ కుమార్‌ తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టులో ఇంజనీర్లతో సహా 1,500 మంది పని చేస్తున్నారని చెప్పారు. సొరంగం నిర్మాణంలో హైదరాబాద్‌ కు చెందిన కంపెనీలు కూడా పాలుపంచుకుంటున్నాయని, సొరంగం నిర్మాణానికి అవసరమైన పైప్‌ రూపింగ్‌లు, రాక్‌ టూల్స్‌ వంటివి సరఫరా చేస్తున్నాయని అన్నారు.  జోజిలా సొరంగాన్ని పూర్తి చేస్తే శ్రీనగర్‌, లద్దాఖ్‌ల మధ్య రహదారి మార్గంలో ఏడాది మొత్తం వాహనాలు ప్రయాణించడానికి వీలుంటుంది. బల్తాల్‌, మీనామార్గ్‌ మధ్య దూరం 40 కిలోమీటర్ల నుంచి 13 కిలోమీటర్లకు తగ్గుతుంది. ప్రయాణ సమయం కూడా 1.5 గంటలు తగ్గుతుందని ప్రశాంత్‌ తెలిపారు.
Tags:    

Similar News