అస‌లు స‌వాల్‌ ఇప్పుడుంది జ‌గ‌న్...ఎలా గెలుస్తావు?

Update: 2020-01-21 04:33 GMT
ఆంధ్రప్రదేశ్‌ కు మూడు ప్రాంతాల్లోని నగరాలు రాజధానులుగా కొనసాగనుండే బిల్లుకు ఆమోదం ద‌క్కిన సంగ‌తి తెలిసిందే. సోమవారం ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో పాలనా వికేంద్రీకరణ బిల్లుకు చట్టసభ ఆమోదం తెలిపింది. శాసన రాజధానిగా అమరావతి, పరిపాలన రాజధాని గా విశాఖ, న్యాయ రాజధాని గా కర్నూలు ఏర్పాటుకానున్నాయి. అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లు పై సభలో వాడివేడి చర్చ జరిగింది. సుదీర్ఘ చర్చ తర్వాత అసెంబ్లీ ఆ బిల్లులను ఆమోదించింది. అయితే, ఇప్పుడు అధికార పార్టీకి అస‌లు ప‌రీక్ష ఎదురు కానుంద‌ని అంటున్నారు. శాస‌న‌ మండ‌లి లో ఈ బిల్లును ఆమోదించుకోవ‌డం అంత సుల‌భం కాద‌ని తెలుస్తోంది.

ప్ర‌స్తుత గణాంకాల ప్ర‌కారం, అధికార పక్షానికి మండలిలో మెజార్టీ లేకపోవడం స‌మ‌స్య‌గా మారింది. శాసనమండలిలో మొత్తం 58 మంది ఎమ్మెల్సీ ల ఉండగా.. టీడీపీ నుంచి 34 మంది, వైసీపీ నుంచి 09, పీడీఎఫ్‌ నుంచి 06, స్వతంత్రులు ముగ్గురు, బీజేపీ ఇద్దరు, కాంగ్రెస్ నుంచి ఒక్కరు ఉన్నారు. మరో మూడు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. దీంతో...తెలుగుదేశం పార్టీ ఈ బిల్లుల‌ను ఎట్టి ప‌రిస్థితుల్లో ఆమోదించ‌కుండా చూడాల‌ని ప్ర‌య‌త్నిస్తోంది.

మండలిలోని ప్రతి ఒక్క సభ్యునికి బిల్లుపై మాట్లాడే అవకాశమివ్వాలంటోంది టీడీపీ. ఈ మేరకు మండలి ఛైర్మన్‌ను ఇప్పటికే కలిసిన టీడీపీ ఎమ్మెల్సీలు. ఇక, టీడీపీ ఎమ్మెల్సీలకే కాకుండా.. ప్రతి సభ్యునికీ అవకాశం ఇవ్వాలంటోంది  టీడీపీ. చర్చను పూర్తి స్థాయి లో జరపడం ద్వారా జాప్యం చేయాలనే ఎత్తుగడలో టీడీపీ ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో పాటుగా, మరోవైపు బిల్లులను సెలెక్ట్ కమిటీ కి పంపే యోచన లో ప్రతిపక్ష టీడీపీ ఉన్నట్టు తెలుస్తోంది. సెలెక్ట్ కమిటీ కి పంపడం ద్వారా నెలల పాటు బిల్లును పెండింగులో పెట్టొచ్చనేది టీడీపీ వ్యూహంగా కనిపిస్తోంది. మొత్తంగా ప్రతిపక్షం వేస్తున్న ఈ ఎత్తుల‌ను అధికార పక్షం ఎలా చిత్తు చేస్తుందో చూడాలి.
Tags:    

Similar News