కేఏ పాల్ ఎంట్రీ.. బండికి వార్నింగ్ ఇచ్చి చిట్టా విప్పాడు

Update: 2021-01-05 10:57 GMT
తెలుగు ప్రజలకు ఏ మాత్రం పరిచయం చేయాల్సిన అవసరం లేని ప్రముఖుల్లో కేఏ పాల్. ఆయన ఎప్పుడు ఎలా మాట్లాడతారన్న విషయం మీదా క్లారిటీ ఉంది. గడిచిన కొద్దికాలంగా మీడియా ముందుకు రాని ఆయన.. ఏపీలో నెలకొన్న మతం రచ్చతో తాజాగా ఎంట్రీ ఇచ్చారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ.. భగవద్గీతకు.. బైబిల్ కు మధ్య పోటీ అంటూ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఘాటుగా రియాక్టు అయ్యారు. బండికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ఆయన.. ఎవరో ఒక తెలంగాణ బీజేపీ లోకల్ నాయకుడు ఏం మాట్లాడుతున్నారో తెలీదు.. పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడని మండిపడ్డారు.

‘బైబిల్ పట్టుకున్న వారికి ఓటు వేస్తారా? భగవద్గీత పట్టుకున్నవాళ్లకు ఓటు వేస్తారా? అని మాట్లాడుతున్నారు. ఇంత లో లెవల్ కు దిగిపోతారా? మాట్లాడే ముందే జాతీయ నేతలతో మాట్లాడాలి. భగవత్.. రామ్ లాల్ నాతో చక్కగా మాట్లాడతారు. సంఘ్ నాయకులు ఇంద్రస్.. బయాజోషి ఎన్నోసార్లు నా హోటల్ కు వచ్చారు. రామ్ లాల్ అయితే నా మోకాలు తాకి నా చేతికి కిస్ చేశారు. బీజేపీకి సపోర్టు చేయాలని కోరారు’’ అని పేర్కొన్నారు. ఇక్కడితో పాల్ మాటలు ఆగలేదు. ఇంకా ఎన్నో విషయాల్ని వెల్లడించారు. ఆవేమంటే..

- 200 దేశాల్లో నరేంద్రమోదీ బ్లాక్ లిస్టులో ఉన్నప్పుడు ఆయన కూడా ఎంతో గౌరవించారు. 120 రోజ్ ప్లవర్స్ ఇచ్చారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 25 ఫోటోలు తీసుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన నన్ను గౌరవంగా చూస్తారు.

- అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నడ్డా తదితరులు నా హోటల్‌కు వచ్చి కలిసారు. అభివృద్ధి చేద్దాం.. అందరిని కలుపుకుపోదామన్నారు.

- కుళ్లు, కుట్రతో కొందరు రాజకీయ నాయకులు ఏపీ, తెలంగాణను రెచ్చగొడితే ఊరుకునేది లేదు.. ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడండి.

- మోదీ ట్రంప్ చుట్టు తిరిగారు. ట్రంప్ నా చుట్టు 18 ఏళ్లు తిరిగారు. చిత్తు చిత్తుగా ఓడిస్తానని చెప్పా.. ఓడించా. దేవుడు నాతో, ప్రజలతో ఉన్నాడు. రెచ్చగొట్టవద్దు.. పరిశుద్ధ గ్రంథాలతో ఆటలాడవద్దు.

- చంద్రబాబు నాయుడికి సిగ్గులేదు. నిన్నమొన్న ఆయన చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలి. కొడుకును సీఎంను చేయాలని పగటికలలు కంటున్నారు. పాల్ గారూ ఏసుప్రభువు మహిమా, కృపా అని చెప్పి.. ఇప్పుడు క్తైస్తవులను తిడతారా?

- పవన్ కల్యాణ్ ఇప్పుడైనా మేలుకో. కరివేపాకును వాడుకుని ఎలా వదిలేస్తారో.. ఇప్పుడు తిరుపతిలో బీజేపీ అభ్యర్థిని పెట్టి నిన్ను వదిలేశారు.

- ఒక పెద్ద కాపు నాయకుడు నాతో మాట్లాడారు. నిజంగా రాజకీయం చేయాలంటే హైందవులు, మహ్మదీయులు, క్రైస్తవులను కలుపుకుని వెళదాం. అభివృద్ధి చేద్దాం.

- 32 ఏళ్లు నేను అమెరికాలో కష్టపడి 2 వందల దేశాల్లో ఇండియాను నెంబర్ 3గా చేశాను.. ఇప్పుడు ఇండియా 144కు పడిపోయింది. ఇండియాలో అభివృద్ధి లేదు, అప్పులపాలైంది.

- రైతులు ఢిల్లీలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అభివృద్ధి చేద్దామని మోదీ, అమిత్ షా, నడ్డా, అడ్వాణీ, వాజ్‌పేయి ఆనాడు నాకు ప్రామిస్ చేస్తే వాళ్లకు సపోర్టు చేశాను.

- ప్రపంచంలో ఒక్క హిందూ దేశమైనా ఉందా? భారత దేశం ఇప్పటికే నష్టపోయింది. ఇంకా నష్టపోకుండా కాపాడుకుంటూ వస్తున్నా. మానవత్వమున్న ఏ ఒక్కరు కూడా తిరుపతి ఉప ఎన్నికలో బీజేపీకి ఓటు వేయవద్దు.



Tags:    

Similar News