నిన్న ఇండియాపై నేడు ఆసిస్ పై... ఇదేం ఏడుపు పాక్ రజా?

వన్డే వరల్డ్‌ కప్‌ లో టీమిండియా టాప్ గేర్‌ లో దూసుకుపోతోన్న సంగతి తెలిసిందే. లీగ్ దశలో ఇప్పటికే వరుసగా ఆడిన 8 మ్యాచ్ లలోనూ గెలిచి పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్ లో ఉంది.

Update: 2023-11-08 10:44 GMT

వన్డే వరల్డ్‌ కప్‌ లో టీమిండియా టాప్ గేర్‌ లో దూసుకుపోతోన్న సంగతి తెలిసిందే. లీగ్ దశలో ఇప్పటికే వరుసగా ఆడిన 8 మ్యాచ్ లలోనూ గెలిచి పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్ లో ఉంది. ఫలితంగా... సెమీస్ లోకి ప్రవేశించిన ఫస్ట్ జట్టుగా నిలిచింది. ఈ సమయంలో టీం ఇండియా సమిష్టి కృషి దీనికి కారణం. అయితే... భారత్ బౌలర్లు ఆ స్థాయిలో బెస్ట్ ఫెర్మార్మెన్స్ ఇవ్వడానికి కారణం వారు “వేరే బాల్స్” వాడుతున్నారని అంటున్నాడు పాక్ మాజీ ప్లేయర్ రజా!

అవును... ఏ వంకా లేనోడు డొంక పట్టుకు వేళాడాడని సామెత! ఈ వరల్డ్ కప్ లో పాకిస్థాన్ పేళవ ప్రదర్శనకు కారణాలు వెతుక్కునే పనికి పూనుకోకుండా... భారత్ బౌలర్లకు వేరే బంతులను ఇస్తున్నారని.. అందుకే వారు అంత అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారని. మిగిలిన దేశాలు చేయలేకపోతున్నాయని పిచ్చి స్టేట్ మెంట్ ఒకటి తెరపైకి తెచ్చాడు పాకిస్థాన్ మాజీ ప్లేయర్ హసన్ రజా!

భారత బౌలర్ల ఫాం ను జీర్ణించుకోలేక తీవ్రమైన అజీర్తితో బాదపడుతున్నాడో ఏమో కానీ... బుమ్రా, సిరాజ్, షమీ బౌలింగ్‌ పై వివాదాస్పద కామెంట్స్ చేశాడు. ఇందులో భాగంగా... భారత జట్టుకు ఐసీసీ స్పెషల్ బాల్స్ అందిస్తోందని ఆరోపించాడు. ఫలితంగా తన ఓర్వలేని తనాన్ని బయటపెట్టుకుంటున్నాడనే కామెంట్లు సంపాదించుకుంటున్నాడు.

ఈ క్రమంలో శ్రీలంకను భారత జట్టు 55 పరుగులకే ఆలౌట్ చేశాక హసన్ రజా రగిలిపోయాడు. భారత్ బౌలర్లు ఈ స్థాయిలో స్వింగ్, సీం తో బౌలింగ్ చేయడానికి ప్రత్యేకంగా తయారుచేసిన బంతులే కారణం అని చెప్పుకొచ్చాడు. అక్కడితో ఆగని ఆ పైత్యం... రివ్యూలు కూడా రోహిత్‌ సేనకు అనుకూలంగానే వస్తున్నాయనే వరకూ చేరింది. ఈ వ్యవహారంలో థర్డ్ అంపైర్, బీసీసీఐ పాత్ర కూడా ఉందని కూడా అనేశాడు!

ఈ స్థాయిలో భారత్ పై పడి ఏడ్చిన రజా... తాజాగా ఆసిస్ బ్యాటర్ మ్యాక్స్ వెల్ ఫెర్మార్మెన్స్ పైనా తన అక్కసు వెల్లగక్కుకున్నాడు. ఇందులో భాగంగా... తొలి ఓవర్లలో ఆఫ్గన్ బౌలర్లు బౌలింగ్ చేసేటప్పుడు బాల్ స్వింగ్ అయ్యిందని.. ఫలితంగా బాల్ ప్యాడ్ లను తాకిందని, వికెట్లు పడ్డాయని.. ఆ టైంలో ఇండియా బాల్ వాడటం వల్లే అది సాధ్యమైందని చెప్పుకొచ్చాడు.

అయితే 20 ఓవర్ల తర్వాత బాల్ మారిందని, అప్పుడు నార్మల్ బాల్ ఇచ్చారని, దీంతో ఆఫ్గన్ వికెట్లు తీయలేకపోయిందని రజా ఆరోపించారు. పాకిస్థాన్ లోని ఒక టీవీ షోలో పాల్గొంటూ అతడు ఈ టైపులో కామెంట్లు చేస్తున్నాడు. దీంతో మరోసారి వాయించి వదులుతున్నారు నెటిజన్లు. ఆడలేక మద్దెల ఓడ కబుర్లు కట్టిపెట్టి పాక్ ప్లేయర్లకు ఆట నేర్పమని ఎద్దేవా చేస్తున్నారు.

ఇదే అంశంపై టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా సైతం స్పందించాడు. హసన్ రజా కామెడీ షోలో పాల్గొన్నట్టున్నాడని అన్నాడు. ఇదే సమయంలో... వసీం అక్రం సైతం హసన్‌ రజా కామెంట్స్‌ ను ఖండించాడు. వీరిద్దరి ఖండన ఒకెత్తైతే ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మైకేల్ వాన్ ఇదే అంశంపై కాస్త బలంగానే స్పందించాడు. హసన్ రజా పై భారీ సెటైర్ వేశాడు.మానసిక పరిస్థితినీ ఒకసారి చెక్ చేయాలని సూచించాడు. ఈ సమయలో ఆసిస్ ఫ్యాన్స్ కూడా హసన్ రజాపై నిప్పులు చెరుగుతున్నారు. ఆస్ట్రేలియా వస్తే ఉచితంగా మానసిక వైద్యం ఇప్పిస్తామని అంటున్నారు!

Tags:    

Similar News