టీమిండియా అజేయంగా నిలుస్తాందా? ఆ రికార్డు దక్కుతుందా?

వన్డే ప్రపంచ కప్ 60 ఓవర్ల ఫార్మాట్లో 1975లో మొదలైంది. ఈ కప్ తో పాటు 1979 కప్ నూ సొంతం చేసుకుంది వెస్టిండీస్.

Update: 2023-11-06 23:30 GMT

మరొక్క మూడు విజయాలు.. టీమిండియా ప్రపంచ విజేతగా నిలిచేందుకు.. మరొక్క మూడు విజయాలు.. మన జట్టుకు రికార్డు దక్కేందుకు.. అజేయంగా నిలుస్తూ ఇప్పటివరకు ప్రపంచ కప్ గెలుచుకున్న జట్లు రెండే రెండు.. మరొక్క మూడు విజయాలు సాధిస్తే రోహిత్ శర్మ సేన ఆ ఘనత అందుకున్న మూడో జట్టుగా రికార్డులకెక్కుతుంది. మరి దీనికి దగ్గరగా ఉన్న భారత జట్టు శత కోటి అభిమానుల ఆశలను నెరవేరుస్తూ దూసుకెళ్తుందా? 12 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ ప్రపంచ చాంపియన్ గా ఆవిర్భవిస్తుందా? అనేది తెలియాలంటే మరొక్క 13 రోజులు ఆగాలి.

అప్పట్లో వెస్టిండీస్

వన్డే ప్రపంచ కప్ 60 ఓవర్ల ఫార్మాట్లో 1975లో మొదలైంది. ఈ కప్ తో పాటు 1979 కప్ నూ సొంతం చేసుకుంది వెస్టిండీస్. కానీ ఆ జట్టు చరిత్రకు ఫుల్ స్టాప్ పెడుతూ టీమిండియా 1983 నాటి కప్ ను నెగ్గింది. ఆ సంచలనంతో మన జట్టు కీర్తి ప్రతిష్ఠలు ఎక్కడికో వెళ్లిపోయాయి. మరో విశేషం ఏమంటే.. 1983 తర్వాత వెస్టిండీస్ వన్డేల్లో మరెప్పుడూ ప్రపంచ చాంపియన్ కాలేదు. భారత్ ఆతిథ్యం ఇస్తున్న ప్రపంచ కప్ నకు ఈసారి అర్హతనే సాధించలేదు. కాగా, 1975, 79 ప్రపంచ కప్ లను వెస్టిండీస్ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా గెలుచుకుంది. 1975లో లీగ్ దశలో మూడు మ్యాచ్ లు ఆపై సెమీస్ ఫైనల్స్ ,1979లో లీగ్ దశలో 2 (మూడోది రద్దు), సెమీ ఫైనల్, ఫైనల్ లో నెగ్గిన వెస్టిండీస్ చాంపియన్ గా నిలిచింది.

ఆ తర్వాత ఆస్ట్రేలియా

1979 తర్వాత వెస్టిండీస్ ప్రపంచ కప్ కొట్టలేకపోయింది. 1983, 1987, 1992, 1999లో ప్రపంచ కప్ లలో విజేతలుగా నిలిచిన భారత్, ఆస్ట్రేలియా, పాకిస్థాన్ లకూ అజేయ రికార్డు సాధ్యం కాలేదు. కానీ 2003, 2007లో మాత్రం ఆసీస్ ఈ ఘనతను అందుకుంది. 2003లో 11, 2007లో 12 మ్యాచ్ లలో ఒక్కటీ ఓడిపోలేదు. 1999 నుంచి చూస్తే.. మాత్రం 29 ప్రపంచ కప్ మ్యాచ్ లను వరుసగా గెలిచింది. అనంతరం 2015లో కప్ గెలిచినా, ఆసీస్ మాత్రం కొన్ని మ్యాచ్ లు ఓడిపోయింది.

మరిప్పుడు ఇండియా..

ప్రస్తుత ప్రపంచ కప్ లో భారత్ వరుసగా 8 మ్యాచ్ లలో విజయఢంకా మోగించింది. మరో లీగ్ మ్యాచ్ లో నెదర్లాండ్స్ వంటి పసికూనను ఎదుర్కొననుంది. ఆపై సెమీఫైనల్ లో న్యూజిలాండ్, పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్ లలో ఒకదానితో తలపడవచ్చు. నెదర్లాండ్స్ పై ఎలాగూ విజయం ఖాయం కాబట్టి వరుసగా తొమ్మిదో గెలుపు మన ఖాతాలో చేరనుంది. వాస్తవానికి ఇదీ రికార్డే. 2003లో భారత జట్టు వరుసగా 8 మ్యాచ్ లలో గెలుపొంది.. ఫైనల్లో ఆసీస్ చేతిలో ఓడింది. ఇప్పుడు దానిని సమం చేసింది. మరొక్క గెలుపుతో అధిగమించనుంది. సెమీస్ లోనూ గెలిస్తే 10 వరుస విజయాలు అవుతాయి. ఫైనల్లోనూ గెలిస్తే 11వ విజయంతో పాటు ప్రతిష్ఠాత్మక ప్రపంచ కప్ సొంతం అవుతుంది. అంతేకాదు.. 2003 నాటి ఆస్ట్రేలియా రికార్డును సమం చేస్తుంది. 12వ విజయం ఎలాగూ సాధ్యం కాదు.

కొసమెరుపు: ఒక ప్రపంచ కప్ లో వరుసగా సాధించిన అత్యధిక విజయాల సంఖ్య 12 (2007లో ఆస్ట్రేలియా). దీనిని అందుకోవడం కొంచెం కష్టమేనేమో? టోర్నీ రౌండ్ రాబిన్ లీగ్ లో జరిగినా.. జట్ల సంఖ్య ఎక్కువగా ఉంటేనే ఆసీస్ రికార్డును బద్దలు కొట్టడం సాధ్యం. ఒకవేళ ఫార్మాట్ మారితే అదీ వీలు కాదు. అంటే కొన్నేళ్ల పాటు కంగారూల రికార్డు భద్రంగా ఉండనుంది.

Tags:    

Similar News