చప్పటి ప్రపంచ కప్ లో అఫ్గాన్ మసాలా.. చాంపియన్ కు ఘాటు

కానీ, ఆదివారం నాటి మ్యాచ్ లో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లడ్ ను అఫ్ఘానిస్థాన్ ఓడించడంతో పెను సంచలనంగా మారింది.

Update: 2023-10-16 08:01 GMT

అత్యంత ఆదరణ ఉన్న భారత్ లో ప్రపంచ కప్ జరుగుతోందన్న మాటే గానీ.. స్టేడియాలు నిండడమూ గగనమవుతోంది. భారత్ –పాకిస్థాన్ మ్యాచ్ అయినా రంజుగా ఉంటుందని భావిస్తే రోహిత్ శర్మ దూకుడుతో అదీ ఏకపక్షమైంది.. ఐదుసార్లు చాంపియన్ ఆస్ట్రేలియా అదరగొడుతుందని భావిస్తే.. సెమీస్ కైనా చేరుతుందా? అనే సందేహం కలుగుతోంది.. ఇలాంటి సమయంలో నమోదైంది పెను సంచలనం..

ఇదే తొలి ఝలక్ వన్డే ప్రపంచ కప్ లో ఇప్పటివరకు పెద్దగా సంచనాలు నమోదు కాలేదు. ఇంగ్లండ్ ను న్యూజిలాండ్ ఓడించినా అదీ పెద్దగా లెక్కలోకి రాలేదు. ఆస్ట్రేలియాను దక్షిణాఫ్రికా దంచికొట్టినా సీరియస్ గా తీసుకోలేదు. కానీ, ఆదివారం నాటి మ్యాచ్ లో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లడ్ ను అఫ్ఘానిస్థాన్ ఓడించడంతో పెను సంచలనంగా మారింది. దీనిని ప్రపంచ కప్ లో తొలి ఝలక్ గా విశ్లేషకులు పేర్కొంటున్నారు.

స్పిన్ కోటలో అఫ్ఘాన్ తుఫాన్ ఈ ప్రపంచ కప్ లో అఫ్ఘానిస్థాన్ ఒకటి రెండైనా సంచలనాలు నమోదు చేస్తుందని అంచనాలున్నాయి. కానీ, అది పాకిస్థాన్, బంగ్లాదేశ్ వంటి జట్లను ఓడిస్తుందని భావించారు. ఏకంగా ఇంగ్లండ్ నే మట్టికరిపిస్తుందని ఎవరూ ఊహించలేదు.

అసలే ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం మైదానం స్పిన్ కు పెట్టింది పేరు. అనిల్ కుంబ్లే పదికి పది వికెట్లు తీసిన వేదిక ఇది. అందులోనూ రషీద్ ఖాన్, ముజిబుర్ రెహ్మాన్, మొహమ్మద్ నబీ వంటి స్పిన్నర్లున్న అఫ్ఘానిస్థాన్. ఇంకేముంది.. ఇంగ్లండ్ బ్యాటర్లు స్పిన్ సుడిలో చిక్కుకుపోయారు.

బ్యాటర్లు దంచారు.. స్పిన్నర్లు కూల్చారు ఇంగ్లండ్ తో మ్యాచ్ లో అఫ్ఘాన్ బ్యాటర్ల శ్రమను తక్కువ చేయలేం. ఢిల్లీ పిచ్ పై 284 పరుగులు అంటే పెద్ద స్కోరే. రహ్మానుల్లా గుర్బాబ్ (57 బంతుల్లో 80, 8 ఫోర్లు, 4 సిక్స్ లు) విధ్వంసక బ్యాటింగ్ కు ఇక్రమ్ అల్ఖిల్ (66 బంతుల్లో 58, 3 ఫోర్లు, 2 సిక్స్ లు) బాధ్యతాయుత ఇన్నింగ్స్ తోడవడంతో పెద్ద లక్షాన్ని నిర్దేశించింది. దీనిని సద్వినియోగం చేస్తూ అఫ్ఘాన్ స్పిన్నర్లు ముజీబ్ (3/51), రషీద్‌ ఖాన్‌ (3/37), నబి (2/16) ఇంగ్లండ్ ను కుప్పకూల్చారు. దీంతో డిఫెండింగ్ చాంపియన్ 215 పరుగులకే ఆలౌటైంది. ఫలితంగా వన్డే చరిత్రలో ఇంగ్లండ్ పై తొలిసారిగా అఫ్ఘాన్ విజయం సాధించింది.

మరిన్ని సంచలనాలు ముందుముందు ప్రపంచ కప్ లో సోమవారం తో 14 మ్యాచ్ లు పూర్తవుతాయి. మంచి జోరుమీదున్న అఫ్ఘాన్ స్పిన్ పిచ్ లు ఎదురైతే ఎంతటి ప్రత్యర్థినైనా మట్టికరిపిస్తుందని స్పష్టమైంది. ఆదివారం నాటి మ్యాచ్ తో ప్రపంచ కప్ నకు ఒక ఊపు తెచ్చింది ఆ జట్టు. బ్యాటింగ్ లో కాస్త నిలకడ వస్తే చాలు.. ఇంగ్లండ్ పై విజయం ఇచ్చిన స్ఫూర్తితో.. మెరికల్లాంటి స్పిన్నర్ల త్రయంతో ఒకటీ రెండు పెద్ద జట్లను ఓడించినా ఆశ్చర్యం లేదు. అదే జరిగితే ప్రపంచ కప్ సెమీస్ రేసు రసవత్తరంగా మారడం ఖాయం.

Tags:    

Similar News