టీమిండియాకు షాక్.. స్టార్ ఆల్ రౌండర్ వరల్డ్ కప్ నుంచి ఔట్

ఏడుకు ఏడు మ్యాచ్ ల్లోనూ గెలిచి ప్రపంచ కప్ లో దూసుకెళ్తున్న టీమిండియాకు భారీ షాక్. గాయం కారణంగా స్టార్ ఆల్ రౌండర్ టోర్నీమొత్తానికి దూరమయ్యాడు.

Update: 2023-11-04 09:25 GMT

ఏడుకు ఏడు మ్యాచ్ ల్లోనూ గెలిచి ప్రపంచ కప్ లో దూసుకెళ్తున్న టీమిండియాకు భారీ షాక్. గాయం కారణంగా స్టార్ ఆల్ రౌండర్ టోర్నీమొత్తానికి దూరమయ్యాడు. మొదట ఒక మ్యాచ్ తర్వాత మరో మ్యాచ్ అని చెప్పినప్పటికీ ఇప్పుడు పూర్తిగా టోర్నీ మొత్తానికి అందుబాటులో లేకుండా పోయాడు. కనీసం సెమీస్ నాటికి అయినా జట్టులోకి వస్తాడని ఆశ పెట్టుకున్నా, అదేమీ సాధ్యం కాదని తేలిపోయింది. దీంతో స్టార్ ఆల్ రౌండర్ గురించి కీలక ప్రకటన చేసింది బీసీసీఐ.

సెమీస్ నాటికి కీలకం కానీ..

ప్రపంచ కప్ లో భారత్ కు కీలకమైన ఆటగాడు ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా. మీడియం పేసర్ గా, ఆరో స్థానంలో బ్యాటర్ గా అతడి సేవలు చాలా ముఖ్యం. మరీ ముఖ్యంగా మూడో పేసర్ గా అతడు బంతిని అందుకుంటూ ఒకటీ అరా వికెట్లు తీసినా జట్టుకు ప్రయోజనం. కాగా, ఈ ప్రపంచ కప్ లో బంగ్లాదేశ్‌ తో మ్యాచ్‌లో బౌలింగ్‌ చేసి బంతిని ఆపే క్రమంలో హార్దిక్ గాయపడ్డాడు. తొలుత చిన్నదే అనుకున్నప్పటికీ బంతిని వేసే పరిస్థితి లేకపోవడంతో మైదానాన్ని వీడాడు. మిగిలిన మూడు బంతులను స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లి వేసిన సంగతి తెలిసిందే. కాగా, హార్దిక్ ది చీలమండ గాయంగా తేల్చారు. దీంతో జాతీయ క్రికెట్ అకాడమీకి పంపారు. కనీసం మూడు మ్యాచ్ లు (లీగ్ దశలో) ఆడడం కష్టమని తొలుత జట్టు మేనేజ్ మెంట్ ప్రకటించింది. హార్దిక్ ప్రపంచ కప్ లో మూడు మ్యాచుల్లో ఐదు వికెట్లు తీశాడు. బంగ్లాపై మూడు బంతులే వేశాడు. ఇక ఒక్కసారి మాత్రమే బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చింది. అందులోనూ 11 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.

గాయం తీవ్రమైనదే..

ఫిట్ నెస్ కు విపరీతమైన ప్రాధాన్యం ఇచ్చే హార్దిక్ పాండ్యా.. తరచూ గాయాలపాలవుతున్నాడు. మూడేళ్ల కిందట ఆసియా కప్ లో వెన్ను గాయానికి గురైన అతడు చాలా రోజులు జట్టుకు దూరమయ్యాడు. కోలుకుని వచ్చాక టెస్టు మ్యాచ్ లకు అతడిని ఎంపిక చేయడం లేదు. మొదట టి20లు ఆడించి, తర్వాత వన్డేలకూ తీసుకున్నారు. దీనిమధ్యలో హార్దిక్ కు టి20 కెప్టెన్సీ కూడా దక్కింది. కాగా, హార్దిక్ గాయం కాస్త తీవ్రమైనదే అని తెలుస్తోంది. ప్రపంచ కప్ ముగిశాక ఆస్ట్రేలియాతో టి20 సిరీస్ ఆడతాడా? లేక మరికొన్ని రోజులు విశ్రాంతి తప్పదా? అనేది తేలాల్సి ఉంది.

ప్రసిద్ధ్ కు పిలుపు

హార్డిక్ పాండ్యా స్థానంలో యువ పేసర్ ప్రసిద్ధ్ క్రిష్ణను జట్టులోకి ఎంపిక చేశారు. వన్డే స్పెషలిస్ట్ బౌలర్ అయిన ప్రసిద్ధ్ కూడా మొన్నటివరకు గాయంతో ఇబ్బందిపడి కోలుకున్నవాడే. కాగా, ప్రసిద్ధ్ బ్యాటింగ్ లో బలహీనమే. కానీ, హార్దిక్ స్థాయిలో బ్యాటర్ ను ఇప్పటికిప్పుడు తేలేరు. అందులోనూ మూడో పేసర్ గా సిరాజ్ ప్రదర్శన కాస్త అనుమానంగా ఉంది. అతడిని పూర్తిగా తప్పించలేకున్నా, ప్రసిద్ధ్ వంటి బౌలర్ ఉండడం అవసరమేనని టీమ్ మేనేజ్ మెంట్ భావించినట్టుంది.

Tags:    

Similar News