ఒలింపిక్స్ సంచలనం మెడనిండా మెడల్స్ తో ఎవరీ గోల్డ్ ఫిష్?

ఒలింపిక్స్ లో పాల్గొనే సుమారు 90దేశాలు అతడి కంటే తక్కువ పతకాలు సాధించాయంటే.. అతడు ఏ స్థాయి ఆటగాడనేది తెలుస్తోంది!

Update: 2024-08-03 04:48 GMT

అది బంగారమా, వెండా, కాంస్యమా అనే సంగతి కాసేపు పక్కనపెడితే... అసలు ఒలింపిక్స్ లో పతకం సాధించడం అంటేనే చాలా అద్భుతం అని చెప్పాలి. వందల, వేల మంది నాలుగేళ్లపాటు కష్టపడి ట్రైనింగ్ అయ్యి ఒలింపిక్స్ కి వెళ్లి ఒట్టి చేతులతో తిరిగివస్తుంటారు! అయితే... ఇప్పుడు చెప్పుకోబోయే వ్యక్తి మాత్రం ఒలింపిక్స్ కి వెళ్తే మెడలో మెడల్ తోనే తిరిగివస్తాడన్నా అతిశయోక్తి కాదు!


ఒలింపిక్స్ లో పాల్గొనే సుమారు 90దేశాలు అతడి కంటే తక్కువ పతకాలు సాధించాయంటే.. అతడు ఏ స్థాయి ఆటగాడనేది తెలుస్తోంది! 15ఏళ్ల వయసులోనే అతడి స్విమ్మింగ్ ప్రస్థానం మొదలైంది. ఈ క్రమంలో అతడు ఏకంగా 28 పథకాలు సాధించగా.. అందులో 23 స్వర్ణాలు కావడం గమనార్హం. అందుకే ఇతడిని “బంగారు చేప” అని కొందరంటే.. “మహాద్భుత స్విమ్మర్” అని ఇంకొంతమంది చెబుతారు!

అవును... 15 ఏళ్ల వయసులోనే ఒలింపిక్స్ స్విమ్మింగ్ లో ప్రస్థానం మొదలుపెట్టిన ఈ అమెరికా స్విమ్మర్ మైకెల్ ఫెల్ఫ్స్... 2000 సిడ్నీ ఒలింపిక్స్ లో యూఎస్ స్విమ్మింగ్ జట్టులో సభ్యుడిగా చేరాడు. అతడు ఆ ఈవెంట్ లో పతకం నెగ్గకపోయినా... 2004లో ఏథెన్స్ లో జరిగిన ఒలింపిక్స్ లో మాత్రం విశ్వరూపం చూపించాడు. ఏకంగా ఆరు స్వర్ణాలతో అగ్రస్థానంలో నిలిచాడు. దీంతో ప్రపంచం మొత్తం ఒక్కసారిఫా ఫెల్ఫ్స్ వైపు చూసింది!

వాస్తవానికి 2012 ఒలింపిక్స్ తర్వాత రిటైర్మెట్ ప్రకటించారు మైకెల్ ఫెల్ఫ్స్. తర్వాత ఏమనుకున్నారో ఏమో కానీ.. రీ ఎంట్రీ ఇవ్వాలని ఫిక్స్ అయ్యారు. 2016 రియో ఒలింపిక్స్ లోనూ సత్త చాటాడు. ఒలింపిక్స్ అనే కాదు.. ప్రపంచ స్విమ్మింగ్ సమాఖ్య అధికారికంగా గుర్తించిన రికార్డుల్లో ఫెల్ఫ్స్ ఖాతాలో ఓ దశలో 39 ప్రపంచ రికార్డులు ఉండటం గమనార్హం.

టోర్నీ ఏదైనా... రికార్డు సృష్టించడం.. తాను సృష్టించిన ఆ రికార్డును కొదీ రోజుల తర్వాత తానే స్వయంగా వాటిని బద్దలు కోట్టడం ఫెల్ఫ్స్ లైఫ్ లో ఓ అంతర్భాగం అయిపోయిన పరిస్థితి. సుమారు ఎనిమిదేళ్లపాటు వరల్డ్ స్విమ్మర్ ఆఫ్ ద ఇయర్ గా అతడు తన ఆధిక్యాన్ని ప్రదర్శించారంటే.. ఫెల్ఫ్స్ ఫెర్మార్మెన్స్ ను అర్ధం చేసుకోవచ్చు!

ఇలా ఒలింపిక్స్ లో 23 స్వర్ణాలు సహా మొత్తం 28 పథకాలతో పాటు ప్రతిష్టాత్మక వరల్డ్ చాంపియన్ షిప్ లో అంతకంటే మెరుగైన ప్రదర్శనతో 26 స్వర్ణాలు సహా మొత్తం 33 పథకాలు సాధించాడు ఫెల్ఫ్స్. ఇదే సమయంలో... పాన్ పసిఫిక్ చాంపియన్ షిప్ లోనూ 16 స్వర్ణాలు సహా మొత్తం 21 పతకాలు సాధించాడు.

ఈ క్రమంలోనే అతని ఆటోబయోగ్రఫీ "బినీత్ ద సర్ఫేస్" విడుదలైంది. ఈ పుస్తకం కూడా అతని ఆటలాగే దూసుకుపోయింది. అమెరికాలో అత్యంత ప్రజాదరణ పొందిన పుస్తకాల్లో ఒకటిగా నిలిచింది.

ఇక ఇతడి ఒక్కడి మెడల్స్ కంటే తక్కువ మెడల్స్ సాధించిన దేశాలు సుమారు 90 ఉండగా.. అందులో కాస్త దగ్గరలో నైజీరియా (27), సెర్బియా (25) పతకాలు కలిగి ఉండగా... టినిడాడ్ అండ్ టొబాగో (19), ఇజ్రాయేల్ (15), పాకిస్థాన్ (10) పతకాలతో తర్వాత స్థానాల్లో ఉన్నాయి! ఇక, 10 గోల్డ్ మెడల్స్ తో కలిపి భారత్ 38 ఒలింపిక్ పతకాలను సాధించిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News