గుత్తా జ్వాలకు రివర్స్‌ పంచ్‌

Update: 2015-07-08 10:28 GMT
బ్యాడ్మింటన్‌ స్టార్‌ ప్లేయర్‌ గుత్తా జ్వాలకు, భారత బ్యాడ్మింటన్‌ హెడ్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌కు పడదన్న విషయం తెలిసిందే. ఎక్కడ తేడా వచ్చిందో కానీ.. ఒకరి పేరెత్తితే ఇంకొకరు ఇంతెత్తున లేస్తారు. ఐతే గోపీచంద్‌ ఎప్పుడూ మీడియా ముందు నోరు విప్పడు. జ్వాలకు ఎక్కడ ఫిట్టింగ్‌ పెట్టాలో అక్కడ పెడతాడు. ఒలింపిక్స్‌ దిశగా క్రీడాకారులకు సాయం చేసేందుకు ప్రభుత్వం చేపట్టిన 'టాప్‌' పథకంలో జ్వాలకు చోటు దక్కకపోవడానికి గోపీచందే కారణమన్నది బహిరంగ రహస్యం. మీడియా ముందుకు వచ్చినపుడల్లా జ్వాల దీని గురించి నిరసన వ్యక్తం చేస్తూనే ఉంటుంది. గోపీచంద్‌ను ఉద్దేశించి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తూ ఉంటుంది.

ఇటీవలే కెనడా ఓపెన్‌ టైటిల్‌ గెలిచాక మరోసారి గోపీచంద్‌పై ధ్వజమెత్తింది జ్వాల. పనిలో పనిగా కేంద్ర క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్‌)ను కూడా టార్గెట్‌ చేసింది. గోపీ, సాయ్‌ కలిసి తమ పట్ల వివక్ష చూపిస్తున్నారని విమర్శించింది. ఇన్నాళ్లూ గోపీ సైలెంటుగా ఉన్నాడు కానీ.. ఈసారి మాత్రం జ్వాలకు కౌంటర్‌ ఇచ్చాడు. ఐతే అది డైరెక్టుగా కాదు. తన తరఫున కేంద్ర క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్‌) డైరెక్టర్‌ ఇంజేటి శ్రీనివాస్‌ను రంగంలోకి దించాడు.

సాయ్‌ డైరెక్టర్‌ జ్వాలపై గట్టిగానే టార్గెట్‌ చేశాడు. జ్వాల వ్యాఖ్యలు క్రమశిక్షణా రాహిత్యం కిందికి వస్తాయని.. ఆమె హద్దులు దాటుతోందని శ్రీనివాస్‌ అన్నారు. ''అంతర్జాతీయ స్థాయి టోర్నీలకు క్రీడాకారులను పంపించడంలో కానీ.. శిక్షణ ఇవ్వడంలో కానీ.. మేం ఎలాంటి వివక్షా చూపించలేదు. అందరు అథ్లెట్లను ఒకేలా చూశాం. డబుల్స్‌ మీద వివక్ష చూపిస్తారన్నది అర్థరహితమైన ఆరోపణ. చీఫ్‌ కోచ్‌ గోపీచంద్‌ డబుల్స్‌ విభాగాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఆయనపై విమర్శలు చేయడం తగదు. గోపీపై జ్వాల దురుద్దేశంతోనే వ్యాఖ్యలు చేస్తోంది. టాప్‌లో జ్వాల, అశ్వినిల పేర్లు చేర్చాలని గోపీచంద్‌ ప్రతిపాదించారు. ఆ విషయం తెలియకుండా జ్వాల ఇష్టానుసారం మాట్లాడటం తగదు'' అని శ్రీనివాస్‌ అన్నారు.

Tags:    

Similar News