ప్రపంచ నెంబర్‌వన్‌ ఫుట్‌బాలర్‌.. కొడతాడా?

Update: 2015-07-04 09:19 GMT
ప్రపంచంలో అత్యంత ఆదరణ ఉన్న క్రీడ ఫుట్‌బాల్‌. వందల కోట్ల మంది ఆ ఆటంటే పడి చస్తారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది ప్రతిభావంతులైన ఫుట్‌బాలర్లున్నారు. ఐతే అన్ని కోట్ల మందిలో బెస్ట్‌ అనిపించుకున్నాడు అర్జెంటీనా ఆటగాడు లయోనెల్‌ మెస్సి. రొనాల్డో, నెయ్‌మార్‌, సురెజ్‌ లాంటి ప్రతిభావంతులు ఎంతమంది ఉన్నా... మెస్సినే 'ది బెస్ట్‌' అంటారు విశ్లేషకులు, మాజీ ఆటగాళ్లు. టీనేజ్‌లో ఉన్నపుడే తన అద్భుతమైన ఆటతీరుతో ప్రపంచవ్యాప్తంగా ఫుట్‌బాల్‌ ప్రియుల్ని కట్టిపడేసిన మెస్సి.. గత కొన్నేళ్లలో ఎంతో ఎత్తుకు ఎదిగాడు. చాలాసార్లు 'ప్రపంచ అత్యుత్తమ ఫుట్‌బాలర్‌' అవార్డు కూడా అందుకున్నాడు.

ఐతే ఎంత పేరు సంపాదించినా.. తన దేశానికి పెద్ద టైటిల్‌ ఏదీ సాధించిపెట్టలేకపోయాడనే అపప్రద ఉంది మెస్పిపై. గత ఏడాది సాకర్‌ ప్రపంచకప్‌లో మెస్సి బాగానే రాణించినా.. అర్జెంటీనా ఫైనల్‌ కూడా చేరినా.. టైటిల్‌ మాత్రం సాధించలేకపోయింది. ఫైనల్లో జర్మనీ చేతిలో త్రుటిలో ఓడింది. ఐతే ఇప్పుడు కోపా అమెరికా టైటిల్‌ సాధించే అద్భుత అవకాశం అర్జెంటీనాకు వచ్చింది. టోర్నీలో ఎక్కువ గోల్స్‌ చేయకపోయినా.. జట్టును ముందుండి నడిపించాడు మెస్సి. సెమీఫైనల్‌ విజయంలోనూ అతడిదే కీలకపాత్ర. శనివారం రాత్రి ఆతిథ్య చిలీ జట్టుతో అర్జెంటీనా ఫైనల్‌ ఆడబోతోంది. స్థాయి ప్రకారం చూస్తే చిలీ కంటే అర్జెంటీనా మెరుగైన జట్టే. ఐతే సొంతగడ్డపై ఆడుతుండటం.. పైగా ఫామ్‌ బాగుండటంతో చిలీని తక్కువ అంచనా వేయలేం. ఐతే తన కెరీర్లో అర్జెంటీనాకు పెద్ద టైటిల్‌ అందించడానికి వచ్చిన మంచి అవకాశాన్ని వదులుకోవడానికి మెస్సి సిద్ధంగా లేడు. అందుకే శనివారం అతడి విశ్వరూపం చూస్తామని ఆశతో ఉన్నారు అర్జెంటీనా అభిమానులు. మరి మెస్సి ఏం చేస్తాడో చూడాలి.
Tags:    

Similar News