మరీ అంత వ్యంగ్యం అవసరమా బంగ్లా..!

Update: 2015-06-30 06:12 GMT
ఒక ఓటమి టీమిండియాను విపరీతమైన నిరాశకు గురి చేస్తే.. ఒక విజయం బంగ్లాదేశీయుల్ని గాల్లో ఎగిరేలా చేసింది. ఆట అన్నాక గెలుపు ఓటములు సహజం. అయితే.. టీమిండియాలాంటి బలమైన జట్టును ఓడించటం.. సిరీస్‌ సొంతం చేసుకోవటం కచ్ఛితంగా చిన్న విషయం అయితే కాదు. అయితే.. ఇలాంటి సందర్భాల్లో విజయాన్ని హుందాగా జరుపుకోవాలే కానీ.. ఓడిన వారి మనోభావాలు దెబ్బ తినేలా మాత్రం వ్యవహరించకూడదు.

కానీ.. అలాంటి హద్దుల్ని దాటేసింది బంగ్లాదేశ్‌కు చెందిన ఒక పత్రిక. తమ జట్టు చేతిలో టీమిండియా ఓడిపోవటాన్ని ప్రముఖంగా చెప్పుకునే క్రమంలో.. అవమానకరంగా.. వ్యంగంతో కూడిన ఒక ప్రకటనను అచ్చేసింది బంగ్లాదేశ్‌కు చెందిన ప్రొతోమ్‌ అలో అనే బంగ్లా దినపత్రిక.

ఆ పత్రిక ఒక వ్యంగ్య ప్రకటనను తాజాగా ప్రకటించింది. అందులో.. బౌలర్‌ ముస్తాఫిజూర్‌ ఒక కట్టర్‌ను పట్టుకొని ఉంటాడు. అతనికి కాస్త కిందన భారత క్రికెటర్లు సగం క్షవరం చేసిన తలతో ఒక బ్యానర్‌ పట్టుకొని కనిపిస్తారు. పలువురు క్రికెటర్లు.. సదరు కట్టర్‌ను తాము వాడామని.. మీరు కూడా వాడాలంటూ చెప్పే ఒక బ్యానర్‌ను పట్టుకొని ఉంటారు.

మరోవైపు.. సదరు కట్టర్‌ ఎక్కడ దొరుకుతుందన్న అడ్రస్‌ ఇస్తూ.. మిర్పూర్‌ స్టేడియం మార్కెట్‌లో సదరు కట్టర్‌ లభిస్తుందని సదరు యాడ్‌లో పేర్కొన్నారు. దీని ద్వారా భారత క్రికెటర్లను విమర్శించే కన్నా అవమానించేలా ఉందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ముస్తాఫిజూర్‌ సంధించిన ఆఫ్‌ కట్టర్లతో టీమిండియా సభ్యులుకష్టాల పాలయ్యారన్న సందేశాన్ని ఈ వ్యంగ్య యాడ్‌ ద్వారా ఇచ్చారన్న వాదన వినిపిస్తోంది.

అయితే.. ఒకరిని గొప్పగా చూపించటం కోసం మరొకరిని తక్కువగా చిత్రీకరించటం.. అది కూడా అవమానకర రీతిలో అన్నది ఇప్పుడు చర్చగా మారింది. ఇలాంటి యాడ్ల కారణంగా క్రీడాస్ఫూర్తి గంగలో కలవటమే కాదు.. రెండు దేశాల మధ్య సంబంధాలపై ఇలాంటివి కచ్ఛితంగా ప్రభావితం చూపిస్తాయన్న మాట వినిపిస్తోంది. ఇలాంటి వాటిని బంగ్లాదేశ్‌ సర్కారు మొగ్గలోనే తుంచేయటం మంచిదన్న సూచన వినిపిస్తోంది
Tags:    

Similar News