ఆసీస్-కివీస్ కొదమ సింహాలు.. దద్ధరిల్లిన ధర్మశాల మైదానం!

ఓవర్ కు ఏడు నుంచి పదిపైనే పరుగుల సగటుతో బౌలర్ల గణాంకాలు చెదిరిపోయాయి

Update: 2023-10-29 03:54 GMT

ఓవర్ కు ఏడు నుంచి పదిపైనే పరుగుల సగటుతో బౌలర్ల గణాంకాలు చెదిరిపోయాయి.. బ్యాట్స్ మెన్ ఊచకోతకు బౌండరీలు చిన్నబోయాయి.. ఆ వీర బాదుడుకు బంతి బావురుమంది.. స్కోరు బోర్డు హోరెత్తింది.. ప్రధాన బ్యాట్స్ మెనే కాదు లోయరార్డర్ కూడా మెరుపులు మెరిపించడంతో హిమాలయాల పాదాల్లో ఉన్న మైదానం దద్దరిల్లింది.. వెరసి ప్రేక్షకులకు అమితానందం దక్కింది.. కొదమ సింహాలు తలపడితే ఎలా ఉంటుందో తెలియదు కాని.. రెండు గట్టి జట్లు వన్డే ప్రపంచ కప్ లో ఢీకొంటే ఎలా ఉంటుందో తెలిసేలా సాగింది శనివారం నాటి ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ మ్యాచ్. ఇరు జట్లూ చివరి బంతి వరకు పోరాడాయి. కానీ, విజయం ఎప్పుడైనా ఒక్కరి వైపే నిలుస్తుంది కదా..?

నిన్న పాక్-దక్షిణాఫ్రికా, నేడు ఆసీస్-కివీస్

శుక్రవారం పాకిస్థాన్-దక్షిణాఫ్రికా మ్యాచ్ చూసిన అభిమానులకు మంచి మజా వచ్చింది. దానికి కొనసాగింపుగానా? అన్నట్లు శనివారం ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ జట్ల మధ్య మ్యాచ్ జరిగిం. కొంత ఆలస్యంగానైనా పరుగు అందుకున్న కంగారూలు.. మొదటినుంచి నిలకడగా ఆడుతున్న న్యూజిలాండ్.. ఇంకేం..? భీకరంగా తలపడ్డాయి. టాస్ గెలిచి మరీ ధర్మశాల వంటి పిచ్ పై బౌలింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ కు ఆసీస్ ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (65 బంతుల్లో 81, 5 ఫోర్లు, 6 సిక్స్ లు), ట్రావిస్ హెడ్ (67 బంతుల్లో 109, 10 ఫోర్లు, 7 సిక్స్ లు) చుక్కుల చూపించారు. వీరిద్దరూ క్రీజులో ఉండగా రన్ రేట్ ఓవర్ కు పది పైనే సాగింది. వార్నర్ ఔటయినా హెడ్ దూకుడుతో సెంచరీ అందుకున్నాడు. ప్రత్యర్థి ఓపెనర్లను వెంటవెంటనే ఔట్ చేసి.. మిడిలార్డర్ లో మార్ష్ (31), స్మిత్ (18), లబుషేన్ (18)ను కట్టడి చేసిన న్యూజిలాండ్ మళ్లీ రేసులోకి వచ్చింది. కానీ, విధ్వంసక మ్యాక్స్ వెల్ (24 బంతుల్లో 41, 5 ఫోర్లు, 2 సిక్స్ లు) చెలరేగాడు. వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ ఇంగ్లిస్ (28 బంతుల్లో 38, 4 ఫోర్లు, 1 సిక్స్) అండగా స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. చివర్లో కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ (14 బంతుల్లో 37, 2 ఫోర్లు, 4 సిక్స్ లు) అనూహ్యంగా విరుచుకుపడడంతో ఆస్ట్రేలియా ఏకంగా 388 పరుగులు చేసింది. అయితే, ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. ఆలస్యంగా తేరుకున్న కివీస్ బౌలర్లు.. కంగారూ లోయరార్డర్ ను కుప్పకూల్చి 49.2 ఓవర్లకే ఆలౌట్ చేశారు. లేదంటే స్కోరు 400 దాటేది.

వెన్నుచూపని కివీస్..

టార్గెట్ 389.. అది కూడా స్టార్క్, కమ్మిన్స్, హేజిల్ వుడ్ వంటి పేసర్లున్న ఆస్ట్రేలియాపై. కానీ, న్యూజిలాండ్ తగ్గలేదు. ఓపెనర్లు కాన్వే (17 బంతుల్లో 6 ఫోర్లతో 38), విల్ యంగ్ (37 బంతుల్లో 32, 4 ఫోర్లు, 1 సిక్స్) వేసిన పునాది ఆసరగా భారత సంతతి ఆల్ రౌండర్ రచిన్ రవీంద్ర (89 బంతుల్లో 116, 9 ఫోర్లు, 5 సిక్స్ లు) దంచుడు మొదలుపెట్టాడు. భారత్ పై సెంచరీ కొట్టిన డారిల్ మిచెల్ (51 బంతుల్లో 54, 6 ఫోర్లు, 1 సిక్స్) తోడుగా జట్టును నడిపించాడు. కానీ, మిచెల్ ఔటయ్యాక కెప్టెన్ లాథమ్ (21), గ్లెన్ ఫిలిప్స్ (12) విఫలం కావడంతో దెబ్బపడింది. అయినా రచిన్ తగ్గలేదు. ఆల్ రౌండర్ నీషమ్ (39 బంతుల్లో 58, 3 ఫోర్లు,3 సిక్స్ లు) అండతో టార్గెట్ ను కరిగించాడు. 59 బంతుల్లో 96 పరుగులు చేయాల్సిన దశలో రచిన్ ఔటవడంతో కివీస్ పని అయిపోయిందనుకున్నారు. అయితే, నీషమ్.. స్పిన్ ఆల్ రౌండర్ శాంట్నర్ (12 బంతుల్లో 17, 1 ఫోర్, 1 సిక్స్) పట్టు విడవకుండా పోరాడారు. శాంటర్న్, ఆ తర్వాత హెన్రీ (9) ఔటయ్యాక వచ్చిన బౌల్ట్ (10 నాటౌట్) ఓ సిక్స్ కొట్టి జట్టును గెలుపు బాటలో నిలిపాడు. దీంతో నీషన్ క్రీజులో ఉండగా చివరి ఓవర్లో విజయానికి 19 పరుగులు కావాల్సి వచ్చింది. అప్పటికీ 50వ ఓవర్ రెండో బంతిని స్టార్క్ వైడ్ గా వేయడంతో బౌండరీకి వెళ్లింది. తర్వాతి మూడు బంతులకూ నీషన్ రెండేసి పరుగులు తీశాడు. 2 బంతుల్లో 7 పరుగులు కావాల్సిన స్థితిలో రెండో పరుగుకు ప్రయత్నించి నీషమ్ రనౌటయ్యాడు. చివరి బంతికి సిక్స్ కొడితే ‘‘టై’’ అయ్యే పరిస్థితుల్లో ఫెర్గూసన్ కు ఆ అవకాశం ఇవ్వలేదు స్టార్క్. అలా.. చివరకు ఈ ప్రపంచ కప్ లో అతి భారీ ఛేదన రికార్డు త్రుటిలో మిస్ అయింది. లేదంటే మరో చరిత్ర నమోదయ్యేది. ప్రేక్షకులకు చిరస్మరణీయంగా మిగిలిపోయేది.

బౌలర్లు బేజారు..

ధర్మశాల మ్యాచ్ లో అటు న్యూజిలాండ్ బౌలర్లు, ఇటు ఆస్ట్రేలియా బౌలర్లు బేజారెత్తిపోయారు. ముఖ్యంగా పేస్ బౌలర్లకు బంతి ఎక్కడ వేయాలో తెలియని పరిస్థితి ఎదురైంది. కివీస్ ప్రధాన పేసర్లలో ఒకడైన ఫెర్గూసన్ 3 ఓవర్లలో 38 పరుగులు ఇచ్చేశాడు. హెన్నీ 6.2 ఓవర్లలో 67 పరుగులు, బౌల్ట్ 10 ఓవర్లలో 77 పరుగులు సమర్పించుకున్నారు. స్పిన్నర్ శాంటర్న్ 10 ఓవర్లలో 80 పరుగులు ఇచ్చేశాడు. పార్ట్ టైమ్ స్పిన్నర్ ఫిలిప్స్ మాత్రమే 10 ఓవర్ల కోటాలో 37 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టి ఆసీస్ కు కళ్లెం వేశాడు. నీషమ్ అయితే 2 ఓవర్లలోనే 32 పరుగులు ధారపోశాడు.

ఆసీస్ బౌలర్లదీ ఇదే దుర్గతి. ప్రపంచ మేటి పేసర్ లలో ఒకడైన స్టార్క్ 9 ఓవర్లలోనే 89 పరుగులు, హేజిల్ వుడ్ 9 ఓవర్లలో 70, కమ్మిన్స్ 10 ఓవర్లలో 66, మార్ష్ 2 ఓవర్లలో 18 పరుగులు ఇచ్చేశారు. స్పిన్నర్ ఆడమ్ జంపా (10 ఓవర్లలో 74)నూ కివీస్ బ్యాట్స్ మెన్ విడిచిపెట్టలేదు. అయితే, న్యూజిలాండ్ పార్ట్ టైమ్ స్పిన్నర్ ఫిలిప్స్ తరహాలోనే ఆసీస్ పార్ట్ టైమ్ స్పిన్నర్ మ్యాక్స్ వెల్ (10 ఓవర్లలో 62) కాస్త నయం అనిపించాడు.

కొసమెరుపు:

ఈ టోర్నీకి ముందు జరిగిన సిరీస్ లలో జట్టును గెలిపిస్తూ వచ్చిన ఆస్ట్రేలియా ఓపెనర్ హెడ్ అనూహ్యంగా గాయపడ్డాడు. అయినప్పటికీ కోలుకుంటాడనే ఉద్దేశంలో ప్రపంచ కప్ నకు తీసుకొచ్చారు. న్యూజిలాండ్ తో మ్యాచ్ ద్వారానే అతడు ఈ ప్రపంచ కప్ బరిలో దిగాడు. సెంచరీ కొట్టేసి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచాడు. ఇక కివీస్ ఆల్ రౌండర్ రచిన్ రవీంద్రను యాక్సిడెంటల్ గానే జట్టులోకి తీసుకున్నారు. కెప్టెన్ కేన్ విలియమ్సన్ అందుబాటులో లేకపోవడంతో తుది జట్టులోనూ చోటు దక్కింది. కానీ, అంచనాలను తలకిందులు చేస్తూ ఇంగ్లండ్ తో జరిగిన తొలి మ్యాచ్ లోనే ఓపెనర్ గా వచ్చి అజేయ సెంచరీ బాదాడు. తర్వాత విలియమ్సన్ స్థానమైన వన్ డౌన్ లో దిగి నెదర్లాండ్స్, భారత్ లపై అర్ధ సెంచరీలు కొట్టాడు. ఇప్పుడు ఆస్ట్రేలియాపైనా సెంచరీతో ఆకట్టుకున్నాడు. మరొక్క బ్యాట్స్ మన్ ఎవరైనా రచిన్ కు అండగా నిలిచి ఉంటే ఆసీస్ పై కివీస్ అతి భారీ టార్గెట్ ను కొట్టేసి ఉండేది అనడంలో సందేహమే లేదు.

Tags:    

Similar News