బంతిపట్టిన టీమిండియా స్టార్లు.. సెమీ ఫైనల్స్ కు ముందుజాగ్రత్త
సెమీస్ లో వీరంతా బౌలింగ్ చేస్తారని కాదు.. కనీసం ఒకరిద్దరైనా పరిస్థితులను బట్టి బంతిని అందుకునే చాన్సుంది.
ఐపీఎల్ లో దక్కన్ చార్జర్స్ (సన్ రైజర్స్ హైదరాబాద్) కు ఆడుతూ హ్యాట్రిక్ తీసిన రోహిత్ శర్మ.. టీమిండియా ప్రధాన బ్యాట్స్ మన్ గా ఎదిగాక మరెప్పుడూ బౌలింగ్ కు దిగే ప్రయత్నం చేయలేదు. కెరీర్ ప్రారంభంలో మీడియం పేస్ బౌలింగ్ చేసిన విరాట్ కోహ్లి.. ప్రపంచ నంబర్ వన్ బ్యాట్స్ మన్ అయ్యాక బౌలింగ్ ను వదులుకున్నాడు. రంజీల్లో ముంబైకి ఆడుతూ మీడియం పేస్ ఆల్ రౌండర్ గా పేరున్న.. కొన్ని వికెట్లు కూడా పడగొట్టిన సూర్యకుమార్ యాదవ్ 360 డిగ్రీస్ బ్యాట్స్ మన్ గా మారక బంతిని అందుకోవడమే లేదు.. టాపార్డర్ బ్యాట్స్ మన్ గా పరుగుల వరద పారిస్తున్న ఓపెనర్ శుబ్ మన్ గిల్ భారత జట్టులోకి వచ్చాక బౌలింగ్ వేసినట్లు చూడలేదు. కానీ, ఇదంతా ఒక్కసారి జరిగింది. అది ఆదివారం నాటి ప్రపంచ కప్ మ్యాచ్ లోనే దీనికి అవకాశం ఏర్పడింది.
ఆరో బౌలర్ లేడు..
టీమిండియా ప్రస్తుతం ఐదుగురు స్పెషలిస్ట్ బౌలర్లతోనే ఆడుతోంది. పేసర్లు బుమ్రా, షమీ, సిరాజ్, స్పిన్నర్లు కుల్దీప్, జడేజా తమ పది ఓవర్ల కోటా పూర్తి చేయగలవారే. ప్రత్యర్థి బ్యాట్స్ మన్ చెలరేగుతున్నా కట్టడి చేయగలవారే. కానీ, ఆరో బౌలర్ అంటూ ఎవరూ లేరు. అనూహ్యంగా ఐగుగురు బౌలర్లలో ఒకరు విఫలమైతే ఇబ్బందులు తప్పవు. అందులోనూ సిరాజ్ వంటి బౌలర్ గాడి తప్పితే మళ్లీ పట్టా లెక్కడం కష్టం. ఇప్పటికైతే సిరాజ్ అద్భుత ఫామ్ లో ఉన్నాడు. కానీ సెమీఫైనల్స్ , ఫైనల్స్ లో ఏం జరుగుతుందో చెప్పలేం కదా? సిరాజ్ అనే ఏముంది..? బుమ్రా , షమీ, జడేజా, కుల్దీప్ ఎవరైనా విఫలం కావొచ్చు. ఇలాంటి పరిస్థిత్లుల్లో ఆరో బౌలర్ గా కనీసం మూడు నాలుగు ఓవర్లు వేసేందుకు ఒకరు ఉండాలి. వాస్తవానికి హార్దిక్ పాండ్యా అందుబాటులో ఉంటే ఆరో నంబరు బ్యాట్స్ మన్ గా, మూడో పేసర్ గా (ఆరో బౌలర్ గా) ఇబ్బందులు ఉండకపోయేవి. కానీ, అతడి గాయం, శార్దూల్ ఠాకూర్ వైఫల్యంతో సమీకరణాలు మారిపోయాయి.
కోటాలో ఆకట్టుకోకుంటే..
తమ పది ఓవర్ల కోటాలో ఏ బౌలరైనా విఫలమైతే.. బంతి అందుకోవడానికి ప్రత్యామ్నాయాలను ఆలోచిస్తోంది టీమిండియా. కీలకమైన సెమీఫైనల్స్ కు ముందు, అందులోనూ న్యూజిలాండ్ వంటి జట్టుతో ఆడుతున్న సమయంలో భారత్ ఎలాంటి చాన్స్ ఇవ్వకూడదు. అందుకనే రోహిత్, కోహ్లి, సూర్య, గిల్ బౌలింగ్ కు దిగినట్లున్నారు. సెమీస్ లో వీరంతా బౌలింగ్ చేస్తారని కాదు.. కనీసం ఒకరిద్దరైనా పరిస్థితులను బట్టి బంతిని అందుకునే చాన్సుంది.
కోహ్లి బౌలింగ్ చేస్తాడు..
2008లో వన్డే కెరీర్ ప్రారంబించిన విరాట్ కోహ్లి మొదట్లో మీడియం పేస్ వేసేవాడు. 2011 ప్రపంచ కప్ లోనూ బౌలింగ్ చేశాడు. ఆ తర్వాతే ఫిట్ నెస్ మీద బాగా ఫోకస్ పెట్టి.. పూర్తి ఫిట్ గా మారాక బౌలింగ్ చేయడం లేదు. కానీ, ఈ ప్రపంచ కప్ లో రెండు మ్యాచ్ లలో బౌలింగ్ వేశాడు. నెదర్లాండ్స్ తో ఒక వికెట్ కూడా పడగొట్టాడు. టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ కూడా అవసరమైతే కోహ్లి బౌలింగ్ చేస్తాడని ప్రకటించారు. అయితే, ఇక్కడో కీలక విషయం ఏమంటే.. కెప్టెన్ రోహిత్ కూడా బౌలింగ్ చేయడం. నెదర్లాండ్స్ తో ఐదు బంతులు వేసి వికెట్ పడగొట్టాడు. కోహ్లి 3, సూర్య 2, గిల్ 2 ఓవర్లు వేశారు. ఇదంతా ఎందుకైనా మంచిదనే వ్యూహంలో భాగమే అనుకోవచ్చు.
కొసమెరుపు: సుదీర్ఘ కాలం తర్వాత బౌలింగ్ కు దిగిన రోహిత్.. నెదర్లాండ్స్ తో మ్యాచ్ లో వికెట్ పడగొట్టాడు. అది కూడా భారత సంతతి ఆటగాడు విజయవాడకు చెందిన తేజ నిడమానూరు వికెట్. 260 వన్డేల్లో 598 బంతులేసిన రోహిత్ 9 వికెట్లు పడగొట్టాడు.