‘ఎర్ర మట్టి కోట’కు నయా రారాజు.. అల్కరాజ్
ఆల్ టైమ్ గ్రేట్ ఫెదరర్ ఫ్రెంచ్ ఓపెన్ ను ఒక్కసారే (2009) నెగ్గగలిగాడు. జకోవిచ్, నాదల్ ఈసారి సెమీస్ కు చేరలేదు.
టెన్నిస్ గ్రాండ్ స్లామ్ లలో అత్యంత క్లిష్టమైన ఫ్రెంచ్ ఓపెన్ నెగ్గడం అంటే మామూలు మాటలు కాదు.. ఈ ఒక్క గ్రాండ్ స్లామ్ గెలిచి మిగతా వాటిలో సాధారణ ప్రదర్శన చేసిన ఆటగాళ్లున్నారు. మిగతా గ్రాండ్ స్లామ్ లను అలవోకగా కొట్టేసి ఫ్రెంచ్ ఓపెన్ లో కనీసం సెమీస్ కు చేరనివారూ ఉన్నారు. ఎర్రమట్టిలో బంతి ఆలస్యంగా రాకెట్ మీదకు వస్తుంది.. అందులోనూ ఎర్ర మట్టిలో ఆటగాళ్ల కదలికలు అంత వేగంగా ఉండవు. అందుకనే ఫ్రెంచ్ ఓపెన్ అంత ప్రత్యేకం.
20 ఏళ్లలో ఆ ముగ్గురే..
ఆల్ టైమ్ గ్రేట్ ఫెదరర్ ఫ్రెంచ్ ఓపెన్ ను ఒక్కసారే (2009) నెగ్గగలిగాడు. జకోవిచ్, నాదల్ ఈసారి సెమీస్ కు చేరలేదు. 14 సార్లు ఫ్రెంచ్ ఓపెన్ నెగ్గిన నాదల్ తొలి రౌండ్ లోనే వెనుదిరిగాడు. రికార్డు స్థాయిలో 25వ టైటిల్ పై కన్నేసిన జకోవిచ్ గాయంతో తప్పుకొన్నాడు. మరి ఈసారి టైటిల్ కొట్టేదెవరు? దీనికి సమాధానంగా నేనున్నానంటూ వచ్చాడు స్పెయిన్ కే చెందిన అల్కరాజ్.
కొన్నేళ్లుగా ప్రంపచ టెన్నిస్ లో అల్కరాజ్ పేరు వినిపిస్తోంది. అయితే, 21 ఏళ్ల ఈ కుర్రాడు ఇప్పుడిప్పుడే పరిణితి సాధిస్తున్నాడు. ఆదివారం ఫ్రెంచ్ ఓపెన్ లో ఛాంపియన్ గా ఆవిర్భవించాడు. తమ దేశానికే చెందిన నాదల్ ను ఆరాధించే అల్కరాజ్.. ఎర్ర కోటలో జెండా ఎగరేశాడు. ఆదివారం హోరాహోరీగా సాగిన ఫైనల్లో మూడో సీడ్ అల్కరాజ్ 6-3, 2-6, 5-7, 6-1, 6-2తో నాలుగో సీడ్ జ్వెరెవ్‌ని ఓడించాడు. ఈ మ్యాచ్ 4 గంటలకు పైగా జరిగింది.
మెరుపు సర్వీసులు, క్రాస్ కోర్టు విన్నర్లతో విజృంభించిన ఈ స్పెయిన్ స్టార్.. చిన్న వయసులో మూడు భిన్నమైన కోర్టులపై గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు గెలిచిన తొలి ఆటగాడిగా నిలిచాడు. ఇంతకుముందు ఈ రికార్డు అమెరికాకు చెందిన జిమ్మి కానర్స్ (, 22 ఏళ్లు) పేరిట ఉండేది.
జకోవిచ్ తర్వాత ఇతడే
నాదల్, జకోవిచ్ తర్వాత పురుషుల విభాగంలో భవిష్యత్ టెన్నిస్ సూపర్ స్టార్ ఎవరా? అనేది మొన్నటివరకు సందేహం ఉండేది. అయితే, అల్కరాజ్ దీనికి తానేనని సమాధానం చెప్పాడు. 2005లో నాదల్ 19 ఏళ్ల కుర్రాడిగా ఫ్రెంచ్ ఓపెన్ కొట్టాడు. అతడి తర్వాత ఈ టైటిల్ నెగ్గిన రెండో పిన్న వయస్కుడు 21 ఏళ్ల అల్కరాజ్ కావడం గమనార్హం.
మిగతా కోర్టుల్లోనూ.
పచ్చికతో నిండి ఉండే వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ లలో ప్రతిష్ఠాత్మకమైనది. గత ఏడాది ఈ టైటిల్ ను గెలిచాడు అల్కరాజ్. దీనికిముందు 2022లో యూఎస్ ఓపెన్ ను కైవసం చేసుకున్నాడు. మరో విశేషం ఏమంటే.. గత పదేళ్లలో నాదల్, జకోవిచ్, వావ్రింకా కాకుండా ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ గెలిచింది అల్కరాజ్ మాత్రమే. దీన్నిబట్టే అతడు భవిష్యత్ సూపర్ స్టార్ అని చెప్పొచ్చు.