ప్రపంచ కప్ షెడ్యూల్ లోమార్పులే మార్పులు..
భారత్ లో వన్డే ప్రపంచ కప్ నకు మరెంతో సమయం లేదు. సరిగ్గా రెండు నెలల్లో భారత గడ్డపై విశ్వ సమరం ప్రారంభం కానుంది. మొత్తం 10 జట్లు పాల్గొనే ఈ కప్ ప్రత్యేకత ఏమంటే.. ఈసారి పూర్తిగా మన దేశమే ఆతిథ్యంఇస్తోంది.
భారత్ లో వన్డే ప్రపంచ కప్ నకు మరెంతో సమయం లేదు. సరిగ్గా రెండు నెలల్లో భారత గడ్డపై విశ్వ సమరం ప్రారంభం కానుంది. మొత్తం 10 జట్లు పాల్గొనే ఈ కప్ ప్రత్యేకత ఏమంటే.. ఈసారి పూర్తిగా మన దేశమే ఆతిథ్యంఇస్తోంది. ఓ లెక్కన చెప్పాలంటే ఇప్పటివరకు ఏ దేశమూ సొంతంగా ఆతిథ్యం ఇవ్వలేదు. ఆ విధంగా చూస్తే భారత క్రికెట్ బోర్డు దమ్ము ఏపాటిదో తెలుస్తోంది. వాస్తవానికి ఇప్పటివరకు భారత్ మూడుసార్లు ప్రపంచ కప్ నకు ఆతిథ్యం ఇచ్చింది. 1987, 1996, 2011 ప్రపంచ కప్ లు భారత్ లోనే జరిగాయి. అయితే, పెద్దన్న హోదాలో పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ లకు మన బోర్డు కొన్ని మ్యాచ్ లు ఇచ్చింది. ఇక భారత్ లో జరిగిన కప్ లలో మొదటిసారి ఆస్ట్రేలియా విశ్వ విజేతగా నిలవగా, రెండోసారి శ్రీలంక ఆ హోదా ఎగరేసుకుపోయింది. 2011లో మాత్రం టీమిండియా సొంతగడ్డపై సగర్వంగా జయకేతనం ఎగురేసింది. ఇప్పుడు నాలుగోసారి మాత్రం బీసీసీఐనే ఎవరితోనూ భాగస్వామ్యం లేకుండా ప్రపంచ కప్ నిర్వహిస్తోంది.
మొన్న భారత్-పాక్ మ్యాచ్ తేదీ
దాదాపు నెల కిందట వన్డే ప్రపంచ కప్ షెడ్యూల్ ఖరారైంది. ఇది గతంలో ఎన్నడూ లేని పరిణామం. 2015 ప్రపంచ కప్ ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ లో జరిగింది. 2019 కప్ నకు ఇంగ్లండ్ ఆతిథ్యం ఇచ్చింది. ఆ సమయంలో ఏడాది ముంగిటే మ్యాచ్ ల షెడ్యూల్ విడుదలైంది. భారత్ లో జరుగబోయే కప్ నకు మాత్రం కొవిడ్ ఇతర కారణాలతో షెడ్యూల్ విడుదల ఆలస్యమైంది. కాగా, గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఉన్న అతి పెద్దదైన నరేంద్ర మోదీ స్టేడియంలో అక్టోబరు 5న డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్, రన్నరప్ న్యూజిలాండ్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. ఇదే మైదానంలో అక్టోబరు 15న చిరకాల ప్రత్యర్థులు భారత్-పాకిస్థాన్ తలపడనున్నాయి. అయితే, ఇదే సమయంలో మన దేశంలో దసరా నవరాత్రులు ప్రారంభమవుతాయి. అసలే సున్నితమైన పరిస్థితి. అందులోనూ గుజరాత్ లోని అహ్మదాబాద్ లో. దీంతో పోలీసు భద్రత పెద్ద సవాలు. అందుకనే మ్యాచ్ ను ఒక రోజు ముందుకు జరిపారు.
మరో మ్యాచ్ తేదీపైనా గందరగోళం..?
ఇప్పటికే ప్రపంచ కప్ మ్యాచ్ ల వేదికలు, తేదీల విషయంలో గందరగోళం ఉండగా.. భద్రతా ఆందోళనల నేపథ్యంలో కొన్ని వేదికలను మార్చాలని ఐసీసీని కోరింది. వాస్తవానికి నవంబరు 12న కోల్ కతాలో పాకిస్థాన్- ఇంగ్లాండ్ మధ్య ప్రఖ్యాత ఈడెన్ గార్డెన్స్ వేదికగా మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే, ఇదే రోజున కాళీమాత పూజ ఉంది. అసలే కోల్ కతా. అందులోనూ కాళీ మాత పూజ. దీనికి భారీగా పోలీసులు బలగాలు అవసరం. అందుకని భద్రతా ఏజెన్సీలు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నాయి. పాక్ – ఇంగ్లండ్ మ్యాచ్‌ను వేరే తేదీకి మార్చాలని బెంగాల్ క్రికెట్ సంధం ఐసీసీ రెక్కీ టీంను అభ్యర్థించినట్లు సమాచారం.
మొత్తం మూడు పాక్ మ్యాచ్ ల తేదీ మార్పు..
కోల్ కతాలో జరగాల్సిన మ్యాచ్ నూ మారిస్తే మొత్తం మీద పాకిస్థాన్ షెడ్యూల్ లో ఇది మూడో మార్పు అవుతుంది. ఇప్పటికే హైదరాబాద్ లో అక్టోబరు 10న జరగాల్సిన పాకిస్థాన్, శ్రీలంక మ్యాచ్ ను 12కు జరిపారు. కాగా, జూన్ 27న కప్ షెడ్యూల్ విడుదలైంది. ఇలా వరుసగా మార్పులు చేస్తారా లేక యథావిధిగా షెడ్యూల్ కొనసాగిస్తారా అనేది తేలలేదు. మార్పులతో కొత్త షెడ్యూల్ ను ప్రకటించాల్సి ఉంది. కోల్ కతాలో ఇంగ్లండ్- పాక్ మ్యాచ్ తేదీ మార్పును బెంగాల్ బోర్డు కార్యదర్శి స్నేహాశిష్ గంగూలీ తోసిపుచ్చారు.