సానియా.. నీతో కలుస్తా.. టెన్నిస్ ఆల్ టైమ్ గ్రేట్ ఓదార్పు
క్రీడా జీవితంలో అత్యంత విజయవంతమై.. ఎంతో ఆశలతో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టి.. ఒక బిడ్డకు తండ్రి కూడా అయిన భారత టెన్నిస్ స్టార్, హైదరాబాదీ సానియా మీర్జా ఇప్పుడు ఒంటరి అయింది.
క్రీడా జీవితంలో అత్యంత విజయవంతమై.. ఎంతో ఆశలతో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టి.. ఒక బిడ్డకు తండ్రి కూడా అయిన భారత టెన్నిస్ స్టార్, హైదరాబాదీ సానియా మీర్జా ఇప్పుడు ఒంటరి అయింది. ఓ విధంగా చెప్పాలంటే భర్త, పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ చేతిలో ఆమె మోసపోయిందనే అనుకోవాలి. దశాబ్దాలుగా వైరం ఉన్న రెండు శత్రు దేశాలకు చెందిన వీరిద్దరూ కలవడమే అనూహ్యం అనుకుంటే.. ఆ బంధం అంతే అనూహ్యంగా తెగిపోయింది. ఇలాంటి సమయంలో ఆమెకు ఓ ఓదార్పు మాట దక్కింది. అదికూడా అలాంటి ఇలాంటి వ్యక్తి నుంచి కాదు. సానియా ఎంతో ప్రేమించే టెన్నిస్ లో ఆల్ టైమ్ గ్రేట్ అయిన స్టార్ నుంచి. వ్యక్తిగతంగా కష్ట కాలంలో ఉన్న ఆమెకు ఇది గొప్ప ఊరటనే..
‘‘గోట్’’ అండగా నిలుస్తాడట..
బోరిస్ బెకర్, పీట్ సంప్రాస్ నుంచి ఫెడరర్, నాదల్ వరకు పురుషుల టెన్నిస్ లో ఎంతోమంది స్టార్లు. వీరందరినీ మించినవాడు నొవాక్ జకోవిచ్ అనడంలో సందేహం లేదు. ఎవరికీ సాధ్యం కాని రీతిలో 24 గ్రాండ్ స్లామ్ లు గెలిచాడు. మహిళల టెన్నిస్ రాణిగా పేర్కొనే మార్గరెట్ కోర్ట్ (24) రికార్డును సమం చేసిన అతడు ప్రస్తుతం జరుగుతున్న ఆస్ట్రేలియన్ ఓపెన్ ను గెలుచుకుంటే.. చరిత్రలో నిలిచిపోతాడు. కెరీర్ లో 25వ గ్రాండ్ స్లామ్ కొట్టిన అరుదైన ఘనతను సొంతం చేసుకుంటాడు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో టెన్నిస్ లో 10 గ్రాండ్ స్లామ్ లు గెలవడమే గొప్ప. ఇక 25 అనే మాటే మర్చిపోవాలి. కాగా, ఆస్ట్రేలియన్ ఓపెన్ లో జకోవిచ్ క్వార్టర్ ఫైనల్ కు వెళ్లాడు. ఈ టోర్నీ సందర్భంగా బ్రాడ్ కాస్టర్ సోనీ స్పోర్ట్స్ ఓ ఇంటర్వ్యూ చేసింది. ఇందులో జకోవిచ్ తో పాటు భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా కూడా పాల్గొంది. సానియాతో కలిసి తాను పనిచేస్తానని ఇంటర్వ్యూలో అతడు తెలిపాడు.
భారత్ అంటే ఇష్టం.. మళ్లీ వస్తా..
సెర్బియాకు చెందిన జకోవిచ్ భారత్ అంటే తనకు ఎంతో ఇష్టమని ఇంటర్వ్యూలో చెప్పాడు. ఆ దేశంలో టెన్నిస్ అభివృద్దికి సానియా మీర్జాతో కలిసి పనిచేస్తాని జకో చెప్పాడు. తాను మరోసారి ఇండియాకు రావాలనుకుంటున్నానని తెలిపాడు. అంతేకాదు.. సెర్బియా- భారత్ మధ్య ఎంతో అనుబంధం ఉందని.. చాలా సారూప్యతలు ఉన్నాయని చెప్పుకొచ్చాడు. గతంలో భారత్ కు వచ్చినప్పుడు ఢిల్లీలో ఉన్నట్లు తెలిపాడు. నాటి ఆతథ్యాన్నిగుర్తుచేసుకున్నాడు. ‘నాకు భారతీయలంటే చాలా ఇష్టం. అక్కడివారు నన్ను అంతే బాగా అభిమానిస్తారు. ఇండియన్స్ స్పోర్ట్స్ అంటే ఎక్కువగా ఇష్టపడతారు. క్రికెట్ నైతే ఒక మతంగా ఆరాధిస్తారు. టెన్నిస్ అంటే కూడా వారికి ఇష్టమే’’ అంటూ జకో వివరించాడు.
అప్పట్లో సాధారణ ఆటగాడిగా..
జకోవిచ్ 2013-14లో భారత్ కు వచ్చాడు. అప్పటికి అతడు టెన్నిస్ లో ఓ స్థాయి ఆటగాడు మాత్రమే. గతంలో వచ్చినప్పుడు ఎగ్జిబిషన్ మ్యాచ్ లు ఆడాడు. రెండు రోజులు ఢిల్లీలో ఉన్నాడు. మరోసారి భారత్ వచ్చి పిల్లల అభివృద్ధికి కొన్ని కార్యక్రమాల్లో భాగం కావాలని ఆశిస్తున్నట్లు జకో చెప్పాడు. సేవా కార్యక్రామాలంటే తన భార్యకు కూడా ఎంతో ఇష్టమని.. తమ ఫౌండేషన్ లక్ష్యం సేవ చేయడమేనని వివరించాడు. భారత్‌లో టెన్నిస్ అభివృద్దికి సంబంధించిన కార్యక్రమాల్లో భాగం కావాలనకుంటున్నట్లు జకో పేర్కొన్నాడు. ‘‘పిల్లలు రాకెట్ పట్టుకుని టెన్నిస్ ఆడడం అంటే నాకు చాలా ఇష్టం. టెన్నిస్ అభివృద్దికి నేను అన్ని విధాల కృషి చేస్తా. ఇందుకోసం సానియా మీర్జాతో కలిసి పనిచేస్తా’ అని జకో చెప్పుకొచ్చాడు.