భారత అల్లుడు అట్టర్ ఫ్లాప్.. ఇక అన్ సోల్డ్ గానే.. ఐపీఎల్ కెరీర్ ఖతం
ఇదంతా చూస్తుంటే 35 ఏళ్ల మ్యాక్స్ వెల్ వచ్చే సీజన్ కు ఏ ఫ్రాంచైజీ కూడా కొనదు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. వచ్చే ఏడాది మెగా వేలంలో అన్ సోల్డ్ గా మిగిలిపోవడం ఖాయం.
బహుశా అతడు లేకుంటేనే బుధవారం నాటి ఐపీఎల్ ప్లేఆఫ్స్ ఎలిమినేటర్ లో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ (ఆర్సీబీ) మెరుగ్గా ఆడేదేమో..? తన స్థానంలో ఇంపాక్ట్ ప్లేయర్ ను దింపినా బాగుండేదేమో..? విల్స్ జాక్స్ లాంటి విధ్వంసకారుడు వెళ్లిపోయినా ఇతడిని ఆడించకుంటే సరిపోయేదేమో..? భారత అల్లుడైన ఓ ఆల్ రౌండర్ గురించి కచ్చితంగా చెప్పాలంటే ఇదే సరైన విశ్లేషణ. బ్యాటింగ్, ఫీల్డింగ్ లో మెరుపు వీరుడు అని తీసుకుంటే.. కనీసం ఓ బౌలర్ స్థాయి ప్రదర్శన కూడా చేయలేదు.
ఆఖరిది ఆడేశాడు ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్ వెల్ సరిగ్గా ఆరు నెలల కిందట జరిగిన వన్డే ప్రపంచ కప్ లో అఫ్ఘానిస్థాన్ పై అజేయ డబుల్ సెంచరీ కొట్టి జట్టును గెలిపించాడు. దీంతో అందరూ అతడిని అహోఒహో అని పొగిడారు. మరి అదే అతడిని ఇప్పుడు మాత్రం ఛీ అంటున్నారు. అంతగా ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో మ్యాక్స్ వెల్ విఫలమయ్యాడు.
6 మ్యాచ్ ల్లో 32.. 9 మ్యాచ్ ల్లో 52 ఐపీఎల్ 17లో ఆర్సీబీ మొత్తం 15 మ్యాచ్ లు ఆడితే మ్యాక్స్ వెల్ ను 9 మ్యాచ్ ల్లోనే పాల్గొన్నాడు. తొలి ఆరు మ్యాచ్ లలో అతడు చేసింది 32 పరుగులే. ఇందులో మూడు డకౌట్లు ఉన్నాయి. దీంతో మానసికంగా సరిగా లేనంటూ 6 మ్యాచ్ ల నుంచి అతడు విరామం తీసుకున్నాడు. ఏప్రిల్ 11న ముంబైతో మ్యాచ్ (డకౌట్) తర్వాత ఏప్రిల్ 28న గుజరాత్ తో బరిలో దిగాడు. అయితే, విల్ జాక్స్, టోప్లీ వంటి విదేశీ ఆటగాళ్లు దూరం కావడంతో మ్యాక్సీని తప్పక ఆడించాల్సి వచ్చింది. చివరి లీగ్ మ్యాచ్ లో చెన్నైపై 16 పరుగులు చేసి, రుతురాజ్ వికెట్ తీయడం మినహా ఈ సీజన్ లో మ్యాక్స్ వెల్ ప్రదర్శన అత్యంత ఘోరం. 9 మ్యాచ్ లలో అతడు చేసింది 52 పరుగులే.
ఇక ఎవరూ తీసుకోరు.. బుధవారం నాటి ప్లేఆఫ్స్ ఎలిమినేటర్ లో ఆర్సీబీ కష్టాల్లో ఉండగా బ్యాటింగ్ కు దిగిన మ్యాక్సీ అశ్విన్ బౌలింగ్ లో మొదటి బంతినే భారీ షాట్ ఆడి క్యాచ్ ఇచ్చాడు. దీన్ని చూసినవారంతా అతడికి అసలు బుర్రుందా? అని ప్రశ్నిస్తున్నారు. అంతేగాక ఫీల్డింగ్ లో కీలకమైన క్యాచ్ జారవిడిచాడు. ఈ సీజన్ లో మూడుసార్లు మ్యాక్సీ తొలి బంతికే గోల్డెన్ డక్ ఔటయ్యాడు. ఇదంతా చూస్తుంటే 35 ఏళ్ల మ్యాక్స్ వెల్ వచ్చే సీజన్ కు ఏ ఫ్రాంచైజీ కూడా కొనదు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. వచ్చే ఏడాది మెగా వేలంలో అన్ సోల్డ్ గా మిగిలిపోవడం ఖాయం.
అత్తారింటికి కూడా కష్టమే..?
తమిళనాడుకు చెందిన విని రామన్ ను ప్రేమ వివాహం చేసుకున్న మ్యాక్స్ వెల్ ను సొంత రాష్ట్రం ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ కూడా భరించడం కష్టమే.