కొహ్లీ ఉమ్మి వేశాడు.. ఎల్గర్ బూతులు తిట్టాడు.. ఏమి జరిగింది?

ఈ సమయంలో మద్యలో కొహ్లీ వచ్చి తనపై ఉమ్మేశాడని ఎల్గర్ తెలిపాడు. దీంతో తాను ఒక బూతు మాట వాడి.. బ్యాట్ తీసుకుని కొడతానంటూ కొహ్లీని హెచ్చరించినట్లు తెలిపాడు.

Update: 2024-01-30 00:30 GMT

ఇటీవల దక్షిణాఫ్రికాతో కేప్‌ టౌన్‌ వేదికగా జరిగిన రెండో మ్యాచ్‌ లో భారత్ ఘనవిజయం సాధించడంతో రెండు మ్యాచ్‌ ల టెస్ట్ సిరీస్‌ 1-1తో డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్‌ తో దక్షిణాఫ్రికా బ్యాట్స్ మెన్ డీన్‌ ఎల్గర్‌ అంతర్జాతీయ క్రికెట్‌ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ క్రమంలో తాజాగా విరాట్ కొహ్లీతో తనకు జరిగిన ఒక గొడవ గురించి వివరించాడు. ఇప్పుడు ఇది నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.

అవును... ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన దక్షిణాఫ్రికా బ్యాట్స్ మెన్ డీన్ ఎల్గర్ ఓ పోడ్ కాస్ట్ లో మాట్లాడుతూ సంచలన విషయాలు వెల్లడించాడు. "బాంటర్ విత్ బాయ్స్" అనే ఈ పోడ్ కాస్ట్ కు హాజరైన ఎల్గార్ మాట్లాడుతూ... టీమిండియా స్టార్ బ్యాట్స్ మెన్ విరాట్ కొహ్లీ గురించి మాట్లాడాడు. ఇందులో భాగంగా.. విరాట్ కోహ్లీ గతంలో తనపై ఉమ్మేశాడని తెలిపాడు.

దీనికి సంబందించిన వ్యవహారం జరిగింది 2015 నాటి సిరీస్ లో అని చెబుతూ... ఈ విషయాన్ని మొత్తం వివరించే ప్రయత్నం చేశాడు ఎల్గర్. ఇందులో భాగంగా.. భారత్ లో తన తొలి పర్యటనలో ఓ టెస్టులో తాను బ్యాటింగ్ కు దిగాగా.. కోహ్లీని నేరుగా చూడడం అదే మొదటిసారి.. ఆ మ్యాచ్ కు మొహాలీ వేదిక కాగా.. ఆ సమయంలో అక్కడి పిచ్ చూస్తే ఓ జోక్ లా అనిపించడంతోపాటు.. అలాంటి పిచ్ పై బ్యాటింగ్ ఓ సవాలుగా నిలిచింది అని మొదలుపెట్టాడు ఎల్గర్.

ఇక ఆ సమయంలో బ్యాటింగ్ చేస్తున్న తనపై టీం ఇండియా బౌలర్స్ రవిచంద్రన్ అశ్విన్, అజయ్ జడేజా మాటలు తూటాలు విసురుతున్నారని.. అందుకు తాను కూడా గట్టిగానే జవాబు చెబుతున్నట్లు తెలిపాడు. ఈ సమయంలో మద్యలో కొహ్లీ వచ్చి తనపై ఉమ్మేశాడని ఎల్గర్ తెలిపాడు. దీంతో తాను ఒక బూతు మాట వాడి.. బ్యాట్ తీసుకుని కొడతానంటూ కొహ్లీని హెచ్చరించినట్లు తెలిపాడు.

ఇక అప్పటికి కోహ్లీ ఐపీఎల్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ఆడుతున్నాడని.. ఆ జట్టులోనే దక్షిణాఫ్రికాకు చెందిన ఏబీ డివిలియర్స్ కూడా ఉన్నాడని.. అందువల్ల దక్షిణాఫ్రికా యాసలో తాను వాడిన బూతు మాట గురించి కోహ్లీకి అర్ధమయ్యే ఉంటుంది అనుకున్నట్లు తెలిపాడు. ఇక తాను ఆ మాట అనగానే కొహ్లీ కూడా రివర్స్ లో అదేమాట వాడి హేళన చేశాడని చెప్పాడు.

కట్ చేస్తే... 2017-18 సీజన్ లో దక్షిణాఫ్రికా పర్యటనకు టీమిండియా వచ్చిన సమయంలో... కోహ్లీ తన వద్దకు వచ్చాడని.. ఈ సిరీస్ ముగిసిన తర్వాత ఇద్దరం కలిసి డ్రింక్ చేద్దామని అన్నాడని.. తాను ప్రవర్తించిన తీరు పట్ల క్షమాపణలు చెప్పాలనుకుంటున్నట్లు తెలిపాడని చెప్పుకొచ్చాడు ఎల్గర్. దీంతో.. కోహ్లీ ప్రతిపాదనకు తాను అంగీకరించి.. సిరీస్ అయిపోయిన తర్వాత తెల్లవారి జామున 3 గంటల వారకూ తాగుతూ ఉన్నట్లు తెలిపాడు ఎల్గర్!

కాగా... ఎల్గర్‌ అంతర్జాతీయ క్రికెట్‌ కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ఆడుతున్న చివరి మ్యాచ్ అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్‌ కోహ్లీ స్పెషల్‌ గిఫ్ట్స్ అందించారు. ఇందులో భాగంగా... మెన్ ఇన్ బ్లూ జ‌ట్టు సంత‌కాలు చేసిన జెర్సీని రోహిత్ శర్మ గిఫ్ట్ గా ఇవ్వగా... తాను సంత‌కం చేసిన‌ జెర్సీని కానుక‌గా ఇచ్చాడు కొహ్లీ. అనంతరం... కోహ్లీ తన చేతులు వంచి నమస్కరిస్తూ.. ప్రేక్షకులను కూడా అలా చేయాలని కోరాడు.



Tags:    

Similar News