రోహిత్ ను ఆకాశానికెత్తిన గంభీర్... కెప్టెన్ - లీడర్ మధ్య తేడా ఇదే!
ప్రపంచకప్ లో భాగంగా ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో భారత్ 100 పరుగుల తేడాతో ఘన విజయ సాధించింది. ఈ గెలుపుతో టీం ఇండియా సెమీస్ బెర్తును ఖరారు చేసుకుంది.
ప్రపంచకప్ లో భాగంగా ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో భారత్ 100 పరుగుల తేడాతో ఘన విజయ సాధించింది. ఈ గెలుపుతో టీం ఇండియా సెమీస్ బెర్తును ఖరారు చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో టీం ఇండియా బౌలర్ల ధాటికి ఇంగ్లాండ్ 34.5 ఓవర్లలో 129 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లాండ్ బ్యాటర్స్ లో లివింగ్ స్టోన్ (27) మాత్రమే టాప్ స్కోరర్ గా నిలిచాడు.
ఇక భారత్ బౌలర్లలో మహ్మద్ షమి (4/22), బుమ్రా (3/32), కుల్ దీప్ యాదవ్ (2/24) ఇంగ్లాండ్ పతనాన్ని శాసించారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన ఇంగ్లాండ్ మొదటి నాలుగు ఓవర్లలో 26/0తో నిలిచింది. అయితే... బుమ్రా ఇన్నింగ్స్ ఐదో ఓవర్ లో డేవిడ్ మలన్ , జో రూట్ ను వరుస బంతుల్లో పెవిలియన్ కు పంపి ఇంగ్లాండ్ ను గట్టిదెబ్బకొట్టాడు. ఇలా వెంటవెంటనే రెండు వికెట్లు కోల్పోయి ఇంగ్లాండ్ ఒత్తిడిలో పడింది. తర్వాత కూడా బుమ్రా, షమి వరుసగా వికెట్లు పడగొట్టడంతో మ్యాచ్ ను టీండియా చేజిక్కించుకుంది.
ఇందులో ప్రధానంగా... తొలి నాలుగు మ్యాచ్ ల్లో తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన షమీ.. అవకాశం వచ్చినప్పటి నుంచి చెలరేగిపోతున్నాడు. న్యూజిలాండ్ లో గత మ్యాచ్ లో అయిదు వికెట్ల ప్రదర్శనతో అదరగొట్టిన అనంతరం... తాజాగా ఇంగ్లాండ్ పైనా అదే స్థాయిలో రెచ్చిపోయాడు. బౌలింగ్ కు అనుకూలిస్తున్న పిచ్ పై కసిగా బౌలింగ్ చేసిన షమి వేసిన బంతులను ఎదుర్కోవడం ప్రత్యర్థి ఆటగాళ్లకు శక్తిని మించిన పనే అయిందన్నా అతిశయోక్తి కాదు!
ఇక క్లిష్టమైన ఈ పిచ్ పై తడబడ్డ ఇండియన్ టాప్ ఆర్డర్ ను కెప్టెన్ రోహిత్ శర్మ (87) విలువైన ఇన్నింగ్స్ తో ఆదుకోగా.. సూర్యకుమార్ యాదవ్ (49), కేఎల్ రాహుల్ (39) కూడా కీలక ఇన్నింగ్స్ ఆడారు.
ఈ మ్యాచ్ తో అంతర్జాతీయ క్రికెట్లో 18 వేల పరుగులు పూర్తి చేసిన అయిదో భారత బ్యాటర్ రోహిత్ (18040) రికార్డ్ సృష్టించాడు. ఇతనికంటే ముందు సచిన్ (34357), కోహ్లి (26121), ద్రవిడ్ (24208), గంగూలీ (18575) ఉన్నారు. అయితే.. ఈ మ్యాచ్ విజయం అనంతరం రోహిత్ పై ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి. ఇందులో భాగంగా... ఇతడు కెప్టెన్ కాదు లీడర్ అంటూ ఆకాశికెత్తేస్తున్నారు.
అవును... రోహిత్ శర్మ కెప్టెన్సీపై టీం ఇండియా మాజీ ఓపెనర్, డేరింగ్ అండ్ డ్యాషింగ్ బ్యాట్స్ మెన్ గౌతం గంభీర్ ప్రశంసల జల్లులు కురిపించాడు. ఇందులో భాగంగా... ఇండియాకు చాలామంది కెప్టెన్లు వచ్చారు కానీ... రోహిత్ శర్మ మాత్రం లీడర్ అంటూ కొనియాడాడు. ఇదే సమయమంలో... కెప్టెన్ కూ లీడర్ కూ చాలా తేడా ఉందని తెలిపిన గంభీర్... రోహిత్ శర్మ నిస్వార్ధంగా జట్టుకోసం ఆడుతున్నాడని అన్నాడు.
ఇదే సమయంలో... కెప్టెన్సీ పరంగా, ఆటపరంగా జట్టును ముందుడి నడిపిస్తున్న రోహిత్ శర్మ... ఏనాడూ సెంచరీల వెనక, రన్స్ వెనక పరుగెత్తడని అన్నాడు. ఈ ప్రశంసల్లో ఎవరికో సెటైర్స్ వేసినట్లు ఆన్ లైన్ లో వినిపిస్తున్న కామెంట్ల సంగతి కాసేపు పక్కనపెడితే... రోహిత్ కూడా సెంచరీల వెనుక పరుగెత్తితే ఇప్పటికే అతని ఖాతాలో 40 - 45 సెంచరీలు ఉండేవని గంభీర్ అభిప్రాయపడ్డాడు! ప్రస్తుతం ఈ కామెంట్లు వైరల్ అవుతున్నాయి!