రోహిత్ పై హార్దిక్ నాలుక మడత.. కెప్టెన్ కన్నింగ్

అందుకే లీగ్ చరిత్రలో ముంబై ఇండియన్స్ ను అత్యంత విజయవంతమైన జట్టుగా చెబుతారు.

Update: 2024-03-18 16:30 GMT

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అత్యంత విజయవంతమైన జట్టు ఏదంటే.. ముంబై ఇండియన్స్ (ఎంఐ)పేరే చెబుతారు అందరూ. మూడేళ్ల కిందటే ఐదు సీజన్లలో విజేతగా నిలిచిందీ జట్టు. అందులోనూ రోహిత్ శర్మ సారథ్యంలో ముంబై ప్రమాణాలు ఎక్కడికో చేరాయి. మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని చెన్నైని 2013, 15, 19లో, 2017లో పుణెని ఓడించి టైటిల్ కొట్టింది ముంబై. అందుకే లీగ్ చరిత్రలో ముంబై ఇండియన్స్ ను అత్యంత విజయవంతమైన జట్టుగా చెబుతారు.

అత్యధిక సీజన్ ల కెప్టెన్

2013లో తొలిసారి ముంబై సారథ్య బాధ్యతలు చేపట్టాడు రోహిత్ శర్మ. మధ్యలో పొలార్డ్, సూర్యకుమార్ యాదవ్ అడపాదడపా పగ్గాలు వెళ్లినా 2023 వరకు అతడే నడిపించాడు. ఈ మధ్యలోనే టైటిల్స్ కొట్టింది ముంబై. అయితే, ఈ సీజన్ కు ముందు ముంబై యాజమాన్యం అనూహ్య నిర్ణయం తీసుకుంది. రోహిత్ శర్మ స్థానంలో హార్దిన్ పాండ్యాను గుజరాత్ నుంచి తీసుకొచ్చి మరీ కెప్టెన్సీ అప్పగించింది. దీంతోనే ముంబైని చాలామంది సోషల్ మీడియాలో అన్ ఫాలో చేశారు. కాగా, రోహిత్ టీమిండియాకు వన్డేలు, టెస్టుల్లో సారథిగా ఉన్నాడు. టి20 ప్రపంచ కప్ లోనూ అతడే కెప్టెన్సీ చేపట్టే చాన్సుంది. అలాంటివాడిని ముంబై కెప్టెన్ గా తప్పించింది.

రోహిత్ గురించి హార్దిక్ తడబాటు

ఐపీఎల్ మరొక్క నాలుగు రోజుల్లో మొదలుకానుంది. ఈ సందర్బంగా ఆయా జట్ల కెప్టెన్లు మీడియా ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలో హార్దిక్ పాండ్యా.. తమ ఫ్రాంచైజీ మాజీ కెప్టెన్ రోహిత్ గురించి అడిగిన ప్రశ్నకు తడబడ్డాడు. ముంబై కెప్టెన్ అయ్యాక మీరు రోహిత్ తో మాట్లాడారా? అని మీడియా ప్రశ్నించగా.. ‘‘ఔను.. కాదు’’ అంటూ సమాధానం ఇచ్చాడు. ‘‘రోహిత్ వరుసగా ప్రయాణాల్లో ఉన్నాడని’’ వివరణ ఇస్తూ అసలు సమాధానం దాటవేశాడు. ఇక రోహిత్ ను కెప్టెన్ గా ఎందుకు తప్పించారు? అన్న ప్రశ్నకు ముంబై కోచ్ బౌచర్ మౌనమే తన జవాబు అన్నట్లు స్పందించాడు.

Tags:    

Similar News