బాబర్..జైశ్వాల్ కాదు..ప్రస్తుతం నంబర్ 1 టెస్టు బ్యాట్స్ మన్ అతడే
క్రికెట్ లో టి20లు, వన్డేలు.. వీటిలో ఎంత ప్రతిభ చూపినా ఆటగాడిని (బ్యాట్స్ మన్ లేదా బౌలర్) మేటిగా లేదా లెజెండ్ గా పరిగణించరు.
క్రికెట్ లో టి20లు, వన్డేలు.. వీటిలో ఎంత ప్రతిభ చూపినా ఆటగాడిని (బ్యాట్స్ మన్ లేదా బౌలర్) మేటిగా లేదా లెజెండ్ గా పరిగణించరు. కేవలం టెస్టుల్లో రాణిస్తేనే.. అది కూడా నిలకడగా ప్రదర్శన చేస్తేనే ఆ క్రికెటర్లను చరిత్రలో గొప్పవారిగా కీర్తిస్తారు. రికార్డు పుస్తకాల్లో చోటిస్తారు. ప్రస్తుతం టెస్టు క్రికెట్ లో అలాంటివారు నలుగురు ఉన్నారు. వారే.. విరాట్ కోహ్లి (భారత్), జో రూట్ (ఇంగ్లండ్), స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా), కేన్ విలియమ్సన్ (న్యూజిలాండ్). వీరంతా వేర్వేరు దేశాలకు చెందినవారు కావడం ఓ విషయమైతే.. 2008 అండర్-19 ప్రపంచ కప్ లో తమ తమ దేశాలకు ప్రాతినిధ్యం వహించారు. ఆ తర్వాత జాతీయ జట్లకు ఎంపికై ప్రపంచంలోనే అగ్రశ్రేణి ఆటగాళ్లుగా ఎదిగారు. అందుకనే వీరిని ఫ్యాబ్ -4గా కొనియాడుతుంటారు. అయితే, వీరిలో టాప్ ఎవరో చెప్పడం కష్టం.
బాబర్.. జైశ్వాల్.. కమిందు..?
పాకిస్థాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజామ్, శ్రీలంక నయా సంచలనం కమిందు మెండిస్, టీమ్ ఇండియా యువ కెరటం యశస్వి జైశ్వాల్.. ప్రపంచ క్రికెట్ లో టాప్ బ్యాట్స్ మన్ గా ఉన్నవారు వీరు. అయితే, వీరందరికంటే మొనగాడు ఒకడున్నాడు. అతడే ఇంగ్లండ్ మిడిలార్డర్ బ్యాటర్ హ్యారీ బ్రూక్. ఈ విషయాన్ని చెప్పింది కూడా జో రూట్ కావడం గమనార్హం.
23 టెస్టులు 8 శతకాలు..
బ్రూక్ వయసు 25. మూడేళ్ల కిందట అరంగేట్రం చేసిన అతడు ఇప్పటివరకు 23 టెస్టులు ఆడాడు. వీటిలో 8 సెంచరీలు కొట్టాడు. తాజాగా న్యూజిలాండ్ తో టెస్టు సిరీస్ లో వరుసగా రెండు మ్యాచ్ లలో సెంచరీలు బాదాడు. మూడేళ్లలో 23 మ్యాచ్ ల్లోనే 8 శతకాలు సాధించడం విశేషం. న్యూజిలాండ్ తో క్లిష్ట పరిస్థితుల్లో బ్యాటింగ్ కు దిగిన అతడు తొలి టెస్టులో భారీ శతకం (171; 191 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్స్ లు) బాదాడు. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో 123 (115 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్స్ లు) చేశాడు. రెండో ఇన్నింగ్స్ లో హాఫ్ సెంచరీ (55) కొట్టాడు.
టెస్టుల్లో నంబర్ వన్ దిశగా..
త్వరలో బ్రూక్ (854 పాయింట్లు) ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ లో టాప్ నకు చేరువగా ఉన్నాడు. జో రూట్ (895 పాయింట్లు) మొదటిస్థానంలో ఉన్నాడు. బ్రూక్ 23 టెస్టుల్లోనే 61.62 సగటుతో 2,280 పరుగులు చేయడం గమనార్హం. దీంతోనే బ్రూక్ ను నంబర్ వన్ అంటున్నాడు రూట్.. ఒత్తిడిని తట్టుకొని ఆడతాడని.. మైదానంలో అన్నివైపులా షాట్లు కొడతాడని.. అతడి తల మీదుగా స్కూప్ షాట్ తో సాధించే సిక్స్ అద్భుతం అని కొనియాడాడు.
మరోవైపు రూట్ కూడా సూపర్ ఫామ్ లో ఉన్నాడు. 151 టెస్టుల్లో 12,886 పరుగులు చేశాడు. టాప్ రన్ స్కోరర్స్ జాబితాలో ఐదో స్థానంలో ఉన్నాడు. మరో 492 పరుగులు చేస్తే పాంటింగ్ (13378), కలిస్ (13289), ద్రవిడ్ (13288)ను దాటేస్తారు. సచిన్ (15,921)ను అందుకోవడం మాత్రం కష్టమే అని చెప్పారు.