వచ్చేసింది లేడీ నాదల్.. టెన్నిస్ భవిష్యత్ రారాణి ఈమెనే..
ఒకప్పుడు స్టెఫీ గ్రాఫ్, మోనికా సెలెస్, విలియమ్స్ సోదరీమణులు మహిళా టెన్నిస్ ను దశాబ్దాల పాటు ఏలారు.
ప్రపంచ టెన్నిస్ లో నాలుగు గ్రాండ్ స్లామ్ లు ఉంటే.. వాటిలో ఫ్రెంచ్ ఓపెన్ ప్రత్యేకతే వేరు.. మట్టి కోర్టుపై జరిగే ఈ టోర్నీలో బంతి ఆలస్యంగా రాకెట్ పైకి వస్తుంది. ఆటగాళ్లు కూడా ఎర్రమట్టిలో కదలాలంటే ఎక్కువ చెమటోడ్చాల్సి ఉంటుంది. అందుకనే ప్రపంచ దిగ్గజాలు చాలామంది ఫ్రెంచ్ ఓపెన్ ను విషమ పరీక్షగా పేర్కొంటారు. సంప్రాస్ లాంటి దిగ్గజం అయితే, ఫ్రెంచ్ ఓపెన్ ఒక్కసారీ గెలవలేకపోయాడు. ఫెదరర్ వంటి ఆల్ టైమ్ గ్రేట్ ఒక్కసారి కనాకష్టంగా నెగ్గాడు. ఇక ఫ్రెంచ్ ఓపెన్ లో ఆల్ టైమ్ గ్రేట్ అంటే స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ మాత్రమే. అతడు కెరీర్ లో 22 టైటిల్స్ కొడితే అందులో 14 ఫ్రెంచ్ ఓపెన్లు. అలాంటి నాదల్ కెరీర్ దాదాపు ముగిసింది. ఈసారి అతడు తొలి రౌండ్ లోనే ఓడాడు. 2022 తర్వాత ఇక్కడ విజేతగా నిలవలేదు. అయితే, ఫ్రెంచ్ ఓపెన్ లో నాదల్ తరహా ఏకచ్ఛత్రాధిపత్యం మళ్లీ చూడలేమా? కనీసం మహిళల్లో అయినా చూస్తామా? అనే ప్రశ్న వస్తుండగా నేను ఉన్నానంటూ ఓ క్రీడాకారిణి దూసుకొచ్చింది.
లేడీ నాదల్
ఒకప్పుడు స్టెఫీ గ్రాఫ్, మోనికా సెలెస్, విలియమ్స్ సోదరీమణులు మహిళా టెన్నిస్ ను దశాబ్దాల పాటు ఏలారు. వరుసపెట్టి టైటిల్స్ కొట్టారు. ఇప్పటి తరంలో ఆ స్థాయి వారే లేరు. కేవలం ఒకటీ అరా టైటిల్స్ కొట్టి కనమరుగు అయ్యేవారే. కానీ.. లేడీ నాదల్ అనిపిస్తోంది పోలండ్ కు చెందిన స్వైటెక్. నాదల్ లాగానే దూకుడైన ఆటతో నాలుగోసారి ఫ్రెంచ్ ఓపెన్ కొట్టిందీమె. అదికూడా వరుసగా మూడో టైటిల్ కావడం విశేషం. శనివారం మహిళల సింగిల్స్ తుదిపోరులో స్వైటెక్ 6-2, 6-1తో పన్నెండో సీడ్ పౌలీనిని చిత్తు చేసింది. వాస్తవానికి పౌలినీ మంచి ఫామ్ లో ఉంది. దీంతో హోరాహోరీ పోరు సాగుతుందనుకుంటే గేమ్ ను టాప్ సీడ్ స్వైటెక్ ఏకపక్షంగా మార్చింది.
మెరుపు విన్నర్లు.. చక్కని ప్లేస్ మెంట్లతో.. బలమైన ఫోర్ హ్యాండ్ షాట్లతో స్వైటెక్ అదరగొట్టింది. కాగా, ఫ్రెంచ్ ఓపెన్ ను వరుసగా మూడుసార్లు గెలిచిన మూడో క్రీడాకారిణి స్వైటెక్. గతంలో జస్టిన్ హెనిన్ (2005, 06, 07), మోనికా సెలెస్ (1990, 91, 92) మాత్రమే ఈ ఘనత అందుకున్నారు.
2021లో మినహా నాలుగు ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్స్ స్వైటెక్ వే. 2022లో యూఎస్ ఓపెన్‌నెగ్గింది.