ఆసియా కప్.. ఉత్కంఠభరిత పోరులో ఇండియాదే గెలుపు!
పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో సెంచరీలు సాధించిన విరాట్ కోహ్లీ ఈసారి 3 పరుగులు, కేఎల్ రాహుల్ 39 పరుగులు మాత్రమే చేశారు
ఆసియా కప్ సూపర్-4లో భాగంగా నిర్వహించిన మ్యాచ్ లో ఆతిథ్య శ్రీలంకపై భారత్ ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ అతి తక్కువ స్కోరుకే పరిమితమైంది. పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో చెలరేగి ఆడిన భారత బ్యాటర్లు శ్రీలంకతో మ్యాచ్ లో మాత్రం చేతులెత్తేశారు. హిట్ మ్యాన్ రోహిత్ శర్మే మరోసారి భారత్ ను ఆదుకున్నాడు. వరుసగా మూడో అర్థ సెంచరీ సాధించాడు. రోహిత్ 53 పరుగులు చేయగా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. దీంతో భారత్ పూర్తి ఓవర్లు కూడా ఆడకుండానే 49.1 ఓవర్లలో 213 పరుగులకు ఆలౌట్ అయ్యింది.
పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో సెంచరీలు సాధించిన విరాట్ కోహ్లీ ఈసారి 3 పరుగులు, కేఎల్ రాహుల్ 39 పరుగులు మాత్రమే చేశారు. మిగిలినవారిలో ఇషాన్ కిషన్ 33, శుభమన్ గిల్ 19, అక్షర్ పటేల్ 26, హార్దిక్ పాండ్యా 5, రవీంద్ర జడేజా 4 పరుగులు చేశారు. శ్రీలంక బౌలర్లలో దునిత్ వెల్లలాగే 5 వికెట్లతో, అసలంక 4 వికెట్లతో భారత్ బ్యాటింగ్ నడ్డి విరిచారు.
ఆ తర్వాత 214 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 41.3 ఓవర్లలో 172 పరుగులకే అన్ని వికెట్లను కోల్పోయి ఓటమి పాలైంది. దీంతో భారత్ 41 పరుగుల తేడాతో గెలుపొందింది. శ్రీలంక జట్టులో టాప్ ఆర్డర్ విఫలం కాగా.. మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు ధనంజయ డిసిల్వా(41), దునిత్ వెల్లలాగె(42) శ్రీలంకను గెలిపించడానికి సర్వశక్తులా ప్రయత్నించారు. పాకిస్థాన్ తో జరిగిన మ్యాచులో ఐదు వికెట్లు తీసిన భారత్ స్పిన్ బౌలర్ కులదీప్ యాదవ్ మరోసారి నాలుగు వికెట్లను శ్రీలంక బ్యాటింగ్ ను తుత్తునియలు చేశాడు. జస్పీత్ బుమ్రా, రవీంద్ర జడేజా తలో రెండు వికెట్లు తీశారు. పాండ్యా, సిరాజ్ చెరో ఒక వికెట్ తీశారు.
కాగా లక్ష్యచేధనలో 99 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన లంకను వెల్లలాగె, ధనంజయ కాపాడారు. క్రీజులో పాతుకుపోయి నిలకడగా పరుగులు రాబట్టారు. దీంతో శ్రీలంక విజయం దిశగా సాగిపోయింది. కొట్టాల్సిన రన్స్ కూడా పెద్దగా లేకపోవడం, ఓవర్ కు 4 పరుగులు చేస్తే గెలిచే పరిస్థితిలో ఉండటంతో ఈ మ్యాచ్ భారత్ కోల్పోవడం ఖాయమనిపించింది. అయితే అర్ధ శతకం దిశగా సాగుతున్న ధనంజయను జడేజా ఔట్ చేసి మ్యాచ్ ను మలుపుతిప్పాడు. ఆ తర్వాత వచ్చిన మహీశ్ తీక్షణ (2), కాసున్ రజితా (1), పతిరన (0) వరుసగా పెవిలియన్ బాటపట్టడంతో శ్రీలంక ఇక కోల్పోలేకపోయింది. తాజా విజయంతో భారత్ ఆసియా కప్ ఫైనల్లోకి దాదాపు ప్రవేశించినట్టే.