ఐపీఎల్-20 లో మూడేళ్లలో కొత్త జట్టు.. 100 మ్యాచ్ లు
2008లో మొదలైన ఐపీఎల్ ఇప్పటికే 16 సీజన్లు ముగించుకుంది. వచ్చేది 17వ సీజన్. 2025లో 18, 2026లో 19వ సీజన్ జరగనుంది
కరీబియన్ నుంచి మొదలుపెడితే బంగ్లాదేశ్ వరకు ప్రపంచంలో ఎన్నో క్రికెట్ లీగ్ లు ఉండొచ్చు.. కానీ వాటిలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు ఉండే ఆకర్షణే వేరు. ప్రపంచ క్రికెట్ అంతా ఒక్కచోటనే ఉందా? అనిపిస్తుంటుంది ఆ లీగ్ చూస్తుంటే.. అసలు క్లిక్ అవుతుందా? లేదా? అనే సందిగ్ధతతో.. ఫిక్సింగ్ ఆరోపణలతో.. షెడ్యూల్ అడ్డంకులతో.. ఇలా ఎన్నో అవాంతరాలను దాటుకుని దిగ్విజయంగా 17వ సీజన్ లో అడుగుపెడుతోంది. ప్రస్తుతం పది జట్లతో ఉన్న లీగ్ స్వరూపం మరో మూడేళ్లలో పదకొండో జట్టు ప్రవేశించబోతోంది. అంతేకాదు.. లీగ్ క్యాలెండర్ మరో భారీ మార్పు కూడా జరగనుంది.
2008లో మొదలైన ఐపీఎల్ ఇప్పటికే 16 సీజన్లు ముగించుకుంది. వచ్చేది 17వ సీజన్. 2025లో 18, 2026లో 19వ సీజన్ జరగనుంది. ఇక 2027లో ఈ టి20 లీగ్ 20వ సీజన్ జరుపుకోనుంది. కాగా, ఐపీఎల్ ఈ ఏడాది మొదలయ్యేది ఎప్పుడో గత వారం స్పష్టత వచ్చింది. భారీ స్థాయిలో రెండు నెలల 4 రోజుల పాటు మ్యాచ్ లు జరగనున్నట్లు తెలుస్తోంది. బహుశా లీగ్ చరిత్రలో ఇదే అత్యంత భారీ సమయం అనుకుంటే.. మూడేళ్లలో ఏకంగా మరో 36 రోజులు అధికంగా జరగనుంది. అయితే, ఈసారి ఎన్నికల షెడ్యూల్ కారణంగా కొంత సర్దుబాటు చేసుకోవాల్సిన పరిస్థితి రావొచ్చు. మార్చి 17 తర్వాత లోక్ సభ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని చెబుతున్నారు. ఇక ఐపీఎల్ మార్చి 22 నుంచి మొదలవుతుందని మే 26 వరకు సాగుతుందని కథనాలు వస్తున్నాయి. దీనికి కాస్త ముందే ఎన్నికల షెడ్యూల్ రానుంది.. ఐపీఎల్ తుది ఫలితం మే 26న వెలువడుతుంది. అటుఇటుగా అదే సమయంలో ఎన్నికల ఫలితాలు వచ్చే చాన్సుంది. 2019లో మే 23న ఎన్నికల ఫలితాలు వెలువడిన నేపథ్యంలో ఈ మేరకు అంచనా వేయొచ్చు
వచ్చే 11వ జట్టు ఏదో..?
ప్రాథమిక సమాచారం ప్రకారం ఐపీఎల్ లో 2027 సీజన్ నుంచి పదకొండో జట్టును ఆడించనున్నారు. ఇప్పటివరకు చూస్తే.. చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, బెంగళూరు రాయల్ చాలెంజర్స్, కోల్ కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్, లఖ్ నవూ సూపర్ జెయింట్స్, రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ డేర్ డెవిల్స్ ఇలా మొత్తం పదిజట్లున్నాయి. గతంలో కొచ్చిన్ టస్కర్స్, రైజింగ్ ఫుణె సూపర్ జెయింట్స్, గుజరాత్ లయన్స్ తదితర జట్లు రద్దయ్యాయి. కాగా, 2027లో వచ్చే జట్టు ఏమిటో తెలియాల్సి ఉంది.
వంద మ్యాచ్ ల షెడ్యూల్?
ఐపీఎల్ 20వ సీజన్.. అంటే 2027లో వంద మ్యాచ్ ల షెడ్యూల్ ఉంటుందనే కథనాలు వస్తున్నాయి. బీసీసీఐ ఇప్పటికే దీనిపై కసరత్తు సాగిస్తోందట. ఇప్పటికే రికార్డుస్థాయిలో రెండు నెలల పైగా సమయం తీసుకుంటున్నారు. దీనిపై ఇతర దేశాల క్రికెట్ బోర్డులు గగ్గోలు పెడుతున్నాయి. అలాంటిది వంద మ్యాచ్ లు అంటే ఎలా సర్దుబాటు చేస్తారో చూడాలి. 11 జట్ల మధ్య గ్రూప్ తరహా విభజన చేస్తారా? ఇంకేమైనా మార్పులు ఉంటాయా? అనేది తెలియాల్సి ఉంది.