దుమ్ములేపిన భారత్‌.. ఈ మ్యాచ్‌ లో పలు రికార్డులు బద్దలయ్యాయి!

దీంతో భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 356 పరుగుల భారీ స్కోర్‌ ను సాధించింది. తర్వాత బ్యాటింగ్‌ కు దిగిన పాకిస్థాన్‌ బ్యాటింగ్‌ పేకమేడలా కుప్పకూలింది.

Update: 2023-09-12 03:58 GMT

ఆసియా కప్‌ లో భాగంగా నిర్వహించిన సూపర్‌ 4 మ్యాచ్‌ లో భారత్‌ దుమ్ములేపింది. దాయాది దేశం పాకిస్థాన్‌ ను చిత్తుగా ఓడించింది. భారత టాప్‌ ఆర్డర్‌ బ్యాట్సమెన్లు రోహిత్‌ శర్మ, శుభమన్‌ గిల్‌ అర్థ సెంచరీలతో చెలరేగగా.. భారత పరుగుల యంత్రం.. విరాట్‌ కోహ్లీ, చాలాకాలం తర్వాత జట్టులోకి వచ్చిన కేఎల్‌ రాహుల్‌ సెంచరీలతో చెలరేగారు. దీంతో భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 356 పరుగుల భారీ స్కోర్‌ ను సాధించింది. తర్వాత బ్యాటింగ్‌ కు దిగిన పాకిస్థాన్‌ బ్యాటింగ్‌ పేకమేడలా కుప్పకూలింది. ఒక్కరంటే ఒక్కరు కూడా కనీసం అర్థ సెంచరీ చేయలేదు. దీంతో 228 పరుగుల భారీ తేడాతో పాకిస్థాన్‌ చిత్తుగా ఓడిపోయింది.

మొదటి రోజు భారత్‌ బ్యాటింగ్‌ చేస్తుండగా వర్షం రావడంతో రెండో రోజు మ్యాచ్‌ ను నిర్వహించారు. రెండో రోజు కూడా పలుమార్లు వర్షం వల్ల ఇబ్బంది తలెత్తినా ఎట్టకేలకు మ్యాచ్‌ జరిగింది. మొదట బ్యాటింగ్‌ చేసిన భారత్‌ బ్యాటర్లలో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ 56, శుభమన్‌ గిల్‌ 58 పరుగులు చేసి ఔటయ్యారు. ఆ తర్వాత బ్యాటింగ్‌ కు కొచ్చిన విరాట్‌ కోహ్లీ, కేఎల్‌ రాహుల్‌ లు మరో వికెట్‌ పడనీయలేదు. వీరిద్దరూ చెరో సెంచరీ బాదారు. ఈ క్రమంలో విరాట్‌ 94 బంతుల్లో 122, రాహుల్‌ 106 బంతుల్లో 111 పరుగులు చేశారు.

ఆ తర్వాత కష్టసాధ్యమైన లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్‌.. భారత బౌలర్ల ధాటికి చేతులెత్తేసింది. వరుసగా వికెట్లు కోల్పోయింది. భారత స్పిన్నర్‌ కులదీప్‌ యాదవ్‌ ఏకంగా ఐదు వికెట్లు తీసి సత్తా చాటాడు. భారత్‌ పేస్‌ గుర్రం.. జస్పీత్‌ బుమ్రా 1, హార్దిక్‌ పాండ్యా 1, శార్దూల్‌ ఠాకూర్‌ 1 చొప్పున వికెట్లు తీశారు. 8 వికెట్ల నష్టానికి పాక్‌ 128 పరుగులు మాత్రమే చేయగలిగింది.

టీమిండియా ఓపెనర్లు రోహిత్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్‌ అదిరిపోయే ఆరంభాన్నివ్వడమే తమ ఓటమిని శాసించిందని పాకిస్థాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజామ్‌ వ్యాఖ్యానించాడు. తమ పేస్‌ త్రయానికి తగ్గట్లు భారత ఓపెనర్లు పకడ్బందీగా ప్రిపేరయ్యారని వెల్లడించాడు. వారు ఎదురు దాడికి దిగి తమను ఒత్తిడిలోకి నెట్టారని తెలిపాడు. తమ ఓటమికి బ్యాటింగ్, బౌలింగ్‌ వైఫల్యమే కారణమన్నాడు. రోహిత్‌–శుభ్‌మన్‌ గిల్‌ అందించిన శుభారంభాన్ని విరాట్‌ కోహ్లీ, కేఎల్‌ రాహుల్‌ కొనసాగించారని బాబర్‌ ప్రశంసించాడు.

కాగా ఈ మ్యాచ్‌ లో పలు రికార్డులు బద్దలయ్యాయి. వన్డేల్లో వేగంగా (277 ఇన్నింగ్స్‌ల్లో) 13 వేల పరుగుల మైలురాయిని అందుకున్న బ్యాటర్‌ గా విరాట్‌ కోహ్లి నిలిచాడు. తద్వారా సచిన్‌ టెండూల్కర్‌ (321 ఇన్నింగ్సులు) రికార్డును దాటేశాడు. ఈ జాబితాలో రికీ పాంటింగ్‌(341 ఇన్నింగ్సులు) మూడో స్థానంలో ఉన్నాడు.

అలాగే భారత్‌ తరఫున ఆసియా కప్‌ లో అత్యధిక ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డులు సొంతం చేసుకున్న ఆటగాడిగా కోహ్లీ మరో రికార్డు సాధించాడు. విరాట్‌ తాజా మ్యాచ్‌ తో కలిపి 4 సార్లు ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డులు దక్కించుకున్నాడు. సురేశ్‌ రైనా(3), సిద్ధూ(3) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

అదేవిధంగా కొలంబోలో ప్రేమదాస స్టేడియంలో కోహ్లీకిది వరుసగా నాలుగో శతకం కావడం విశేషం. తాజా శతకంతో కలిపి వన్డేల్లో కోహ్లీ శతకాల సంఖ్య 47కు చేరింది. వన్డేల్లో సచిన్‌ పేరిట ఉన్న అత్యధిక శతకాల రికార్డు (49)కు విరాట్‌ మరో 2 సెంచరీల దూరంలో మాత్రమే ఉన్నాడు. సచిన్‌ 463 వన్డేలాడగా.. కోహ్లీకిది 278వ మ్యాచ్‌ మాత్రమే కావడం గమనార్హం. మొత్తం మీద ఇది విరాట్‌ కు 77వ శతకం.

Tags:    

Similar News