కాసేపట్లో ఐపీఎల్ ధమాకా.. ధోనీ ఆడతాడా.. బెంగళూరు వ్యూహమేంటి?

‘‘కెప్టెన్ ధోనీ..’’ ఈ మాట టీమిండియాలో ఉన్నప్పుడు, చెన్నైకి ఆడినప్పుడు మనకు వినివిని అలవాటైపోయింది.

Update: 2024-03-22 10:49 GMT

వచ్చేసింది వేసవి వినోదం.. క్రికెట్ అభిమానులకు కనుల పండుగ.. ఏటా మాదిరే అయితే.. ఈసారి విశేషం ఏముంటుంది..? అందుకేనేమో.. సరిగ్గా లీగ్ మొదలవడానికి ఒక్క రోజు ముందు దిగ్గజ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ చెన్నై సూపర్ కింగ్స్ పగ్గాలు వదిలేశాడు. కుర్రాడు రుతురాజ్ కు సారథ్యం అప్పగించాడు. మరి అతడి స్థాయిలో ఆకట్టుకుంటాడా..? ఇక నిరుడే కెప్టెన్సీ వదలిపెట్టిన బెంగళూరు రాయల్ చాలెంజర్స్ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి వచ్చే టి20 ప్రపంచ కప్ నకు టీమిండియాలో ఉండాలంటే ఈసారి లీగ్ లో రాణించడం అత్యంత కీలకం.

రుతురాజ్ ఆకట్టుకుంటాడా..?

‘‘కెప్టెన్ ధోనీ..’’ ఈ మాట టీమిండియాలో ఉన్నప్పుడు, చెన్నైకి ఆడినప్పుడు మనకు వినివిని అలవాటైపోయింది. అంతగా ముద్ర వేశాడు మహి. అలాంటివాడు కెప్టెన్సీ వదిలేస్తే ఏం జరుగుతుందో 2022లో చూశాం. ప్రతిభావంతుడే అయినప్పటికీ జడేజా నాయకుడిగా రాణించలేకపోయాడు. మళ్లీ కెప్టెన్ గా ధోనీ వచ్చి 2023లో చెన్నైను చాంపియన్ గా నిలిపాడు. ఇప్పుడు డిఫెండింగ్‌ ఛాంపియన్‌ గా అచ్చొచ్చిన సొంతగడ్డ చెపాక్‌ లో చెలరేగేందుకు చెన్నై అస్త్రాలను సిద్ధం చేసుకుంది. అయితే, రుతురాజ్‌ ఎలా నడిపిస్తాడు? అన్నది చూడాలి. అసలే అతడు ఓపెనర్. దీంతోపాటు గత ఏడాది ఇన్నింగ్స్‌ ప్రారంభించిన న్యూజిలాండ్ బ్యాటర్ డేవన్‌ కాన్వే ఇప్పుడు అందుబాటులో లేడు. దీంతో వన్డే వరల్డ్‌ కప్‌లో అదరగొట్టిన కివీస్‌ యువ ఆల్ రౌండర్ భారత సంతతికి చెందిన రచిన్‌ రవీంద్ర ఇన్నింగ్స్‌ ప్రారంభించే అవకాశం ఉంది. సీనియర్ అజింక్య రహానె ఉన్నప్పటికీ అతడు మిడిలార్డర్ లో ఆడతాడు. మరో న్యూజిలాండర్ డారిల్ మిచెల్ దూకుడైన బ్యాట్స్ మన్. బౌలింగ్ కూడా వేయగలడు. ఇక ఇంగ్లండ్ కు చెందిన ఆల్ రౌండర్

మొయిన్ అలీ మరో ప్రధాన ఆటగాడు. శివమ్‌ దూబె, ధోనీ, జడేజాతో చెన్నై బ్యాటింగ్ బలంగా ఉంది.

హార్డ్ హిట్టర్ ను దింపుతుందా?

సమీర్ రిజ్వీ.. వేలంలో చెన్నై రూ.8.4 కోట్లు పెట్టిన ఆటగాడు. కుడిచేతి వాటం రైనాగా అతడి గురించి చెబుతున్నారు. అసలు చెన్నై కొత్త కుర్రాళ్ల మీద డబ్బులు పెట్టదు. అలాంటిది రిజ్వీని తీసుకుందంటే అతడిలో ప్రత్యేకత ఉన్నట్లే కదా..? మరి రిజ్వీని మ్యాచ్ ఆడిస్తుందా? అన్నది చూడాలి.

బౌలింగే బెంగ..

చెన్నై బౌలింగ్ మొదటినుంచి కాస్త వీకే. మొయిన్ అలీ, జడేజా గొప్ప స్పిన్ ఆల్ రౌండర్లే. అయితే, పేస్ విభాగం బాగా బలహీనం. టీమిండియా ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్ రెండేళ్ల తర్వాత ఈసారి మళ్లీ చెన్నైకు వచ్చాడు. తరచూ గాయాల బారిన పడే దీపక్ చాహర్ చెన్నై మెయిన్ బౌలర్. ధోనీ అత్యంత విశ్వాసం ఉంచే దీపక్, శార్దూల్ బ్యాటింగ్‌ చేయగలరు. ఇక మతీశ పతిరణ గాయంతో దూరమైనందున తుషార్‌ పాండేతో కలిసి శార్దూల్, దీపక్ భారత మోయాల్సి ఉంటుంది.

అమ్మాయిలు కొట్టారు.. మరి అబ్బాయిలు..?

ఐపీఎల్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అంటే విరాట్ కోహ్లినే. కానీ, ఇప్పటివరకు టైటిల్ కొట్టలేకపోయింది. ఇది ఆ జట్టు అభిమానులను తీవ్రంగా బాధించే అంశం. మొన్ననే మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో బెంగళూరు అమ్మాయిలు విజేతగా నిలిచారు. ఇదే స్ఫూర్తితో దక్షిణాఫ్రికా స్టార్ డుప్లెసిస్ నాయకత్వంలోని పురుషుల జట్టు సత్తా చాటాల్సి ఉంది. కోహ్లీ, మ్యాక్స్‌వెల్, గ్రీన్, దినేశ్‌ కార్తీక్ లు బెంగళూరు బ్యాటింగ్ లైనప్ లో ఉన్నారు. కార్తీక్ కు ఇది చివరి సీజన్. ఫినిషర్‌ గా నిరుడు విఫలమయ్యాడు.

గ్రీన్ బాటేనా?

ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ గ్రీన్‌ ను భారీ మొత్తం వెచ్చించి ఆర్సీబీ తీసుకుంది. అతడు ఫామ్ లో ఉన్నాడు కూడా. తన బాధ్యతలకు న్యాయం చేయాల్సి ఉంది. చెన్నై పిచ్ బ్యాటింగ్‌ కే కాదు.. స్పిన్నర్లకు సహకరిస్తుంది. కాబట్టి బెంగళూరు స్పిన్‌ ఎటాక్‌ ను సరిచేసుకోవాలి. హైదరాబాదీ పేసర్ సిరాజ్‌,లాకీ ఫెర్గూసన్, యువ బౌలర్ ఆకాశ్‌ దీప్‌, గ్రీన్‌ తో పేస్ విభాగం పటిష్ఠంగా ఉంది. అయితే, స్పిన్ మాత్రం బాగా వీక్. పార్ట్ టైమ్ స్పిన్నర్ అయిన మ్యాక్స్‌వెల్‌పైనే ఆధారపడాల్సి వస్తోంది. సీనియర్ కర్ణ్‌ శర్మ మాత్రమే స్పెషలిస్ట్ స్పిన్నర్. మరి ఇతడి లెగ్‌ స్పిన్‌ ఎంతమాత్రం గెలిపిస్తుందో చూడాలి.

తొలి మ్యాచ్ కు తుది జట్లు

చెన్నై..: రుతురాజ్‌ (కెప్టెన్), రచిన్, రహానె, మిచెల్, మొయిన్‌ అలీ, దూబె, ధోనీ (కీపర్), జడేజా, శార్దూల్, దీపక్ చాహర్, ముకేశ్‌ చౌదరి/ తుషార్‌ దేశ్‌ పాండే

బెంగళూరు: డుప్లెసిస్ (కెప్టెన్), కోహ్లీ, పటీదార్, మ్యాక్స్‌వెల్, గ్రీన్, దినేశ్‌ కార్తీక్‌ (కీపర్), మహిపాల్ లామ్రోర్‌, లాకీ ఫెర్గూసన్, సిరాజ్, కర్ణ్‌ శర్మ, ఆకాశ్‌ దీప్.

Tags:    

Similar News