మన వినేశ్ పతకాన్ని లాగేసుకున్న పారిస్ ఒలింపిక్స్.. పాసా.. ఫెయిలా?

2021లో జరిగిన టోక్యో ఒలింపిక్స్ లో డబుల్ డిజిట్ పతకాలు సాధించిన భారత్ కు పారిస్ మాత్రం చేదు మాత్రే.

Update: 2024-08-11 11:23 GMT

ఫ్యాషన్ రాజధాని, ప్రేమికుల ఇష్ట నగరమైన పారిస్ లో ఒలింపిక్స్ అంటే అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. కానీ.. ఒలింపిక్స్ దగ్గరపడుతున్న కొద్దీ అన్నీ వివాదాలు.. విమర్శలే.. పారిస్ లో పారే సెన్ నది మురికి కూపంగా ఉందని.. ఆరంభ వేడుకలకు అంతరాయం ఏర్పడిందని..ఎండలు మండిపోతున్నా ఏసీలు లేవని.. ఒకటే రగడ. ఏమైతేనేం..? ఒలింపిక్స్ ఈ ఆదివారంతో ముగియనున్నాయి. 2021లో జరిగిన టోక్యో ఒలింపిక్స్ లో డబుల్ డిజిట్ పతకాలు సాధించిన భారత్ కు పారిస్ మాత్రం చేదు మాత్రే.

స్వర్ణం/రజతం అందినట్లే అంది..

భారత్ కు వినేశ్ ఫొగట్ రూపంలో రెజ్లింగ్ లో కనీసం రజతం అయినా అందే చాన్స్ పారిస్ ఒలింపిక్స్ లో లభించింది. ఒకవేళ స్వర్ణం అయినా నెగ్గేదేమో..? కానీ, పతకం ఖాయమైన సమయంలో వినేశ్ పై అనూహ్యంగా వేటుపడింది. 50 కేజీల రెజ్లింగ్ అంశం ఫైనల్‌ కు ముందు బరువు కొలతల్లో వినేశ్ 100 గ్రాములు అధికంగా ఉండడంతో డిస్ క్వాలిఫై అయింది. ఈ తీవ్ర వివాదం చివరకు ఆర్బిట్రేషన్‌ కు అప్పీలు చేసేవరకు వెళ్లింది. ఇక వినేశ్ తీరని వేదనతో రెజ్లింగ్‌ కే వీడ్కోలు పలికింది. మరోవైపు జావెలిన్ త్రోలో స్టార్ త్రోయర్ నీరజ్ చోప్రా అనూహ్యంగా వెనుకబడి రజతంతో సరిపెట్టుకున్నాడు. మరోవైవు భారత్ కేవలం ఆరు పతకాలతో సరిపెట్టుకుంది. ఇందులో ఐదు కాంస్యాలే కావడం గమనార్హం.

మొత్తం 19 రోజులు..

పారిస్ ఒలింపిక్స్ గత నెల 24న మొదలయ్యాయి. మొత్తం 19 రోజులు జరిగాయి. ఆదివారం అర్థ రాత్రి (భారత కాలమానం ప్రకారం) 12 గంటలకు ముగింపు వేడుకలు నిర్వహించనున్నారు. గత ఒలింపిక్స్‌ కు భిన్నంగా క్రీడా గ్రామం వెలుపల ప్రారరంభ వేడుకలు నిర్వహించారు. మురికిగా ఉందని పేరు తెచ్చుకున్న సెన్‌ నదిపై బోట్లలో అథ్లెట్లు ర్యాలీగా రాగా.. కాసేపు వర్షంపడడం కలకలం రేపిం. ప్రారంభ సంబరాల్లో లెస్బియన్ డీజే బార్బరా బట్చ్ ప్రదర్శనపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈత పోటీల సందర్భంగా తీవ్ర కాలుష్యం ఏర్పడడంతో పలువురు అథ్లెట్లు అస్వస్థతకు గురయ్యాయి.

గోల్డెన్ స్లామ్ తో జకో కల తీరింది..

ప్రపంచ టెన్నిస్ లో ఆల్ టైమ్ గ్రేట్ నొవాక్‌ జకోవిచ్ ఈసారి పారిస్ లో గోల్డ్ కొట్టాడు. దీంతో గోల్డెన్ స్లామ్‌ (గ్రాడ్ స్లామ్+ఒలింపిక్ మెడల్) సాధించిన జాబితాలో చేరాడు. ఈ ఘనత అందుకున్న ఐదో టెన్నిస్‌ ప్లేయర్‌ అతడు. ఇక జిమ్నాస్టిక్ చరిత్రలో నిలిచిపోయే క్రీడాకారిణి అయిన సిమోన్ బైల్స్‌ కు ఈసారి స్వర్ణం దక్కలేదు. ప్రత్యర్థి రెబెకా ఆండ్రాడె దానిని ఎగురేసుకుపోయింది. అయితే, బైల్స్ క్రీడా స్ఫూర్తి ప్రదర్శించి రెబెకాను క్వీన్‌ అంటూ కొనియాడింది.

కొత్త చిరుత.. బైల్స్..

100 మీటర్ల పరుగు.. ప్రపంచంలో అత్యంత వేగవంతమైన రన్నర్ ఎవరో తెలిపే పరుగు ఇది. ఇందులో సెకను లో ఐదువేల వంతు తేడాతో నోవా బైల్స్‌ విజేతగా ఆవిర్భవించాడు. 9.79 సెకన్లలో రేసు పూర్తి చేసి సరికొత్త చిరుతగా నిలిచాడు. బాక్సింగ్‌ లో అల్జీరియాకు చెందిన ఇమానె ఖెలిఫ్‌ 46 సెకన్లలోనే ప్రత్యర్థిని చిత్తు చేయడంతో మహిళ కాదంటూ తీవ్ర విమర్శలు వచ్చాయి. సోషల్ మీడియా లో వేధింపులు రావడంతో చివరకు ఆమె కేసు పెట్టింది. చివరకు గోల్డ్ కూడా కొట్టి తన సత్తాచాటింది. తైవాన్‌ బాక్సర్‌ లిన్‌ యూ టింగ్‌ కూ ఇలాంటి పరిస్థితే ఎదురవడం గమనార్హం. అయితే, ఆమె కూడా స్వర్ణంతో జవాబిచ్చింది.

బద్ధ శత్రువుల సెల్ఫీ

బద్ధ శత్రువులైన ఉత్తర, దక్షిణకొరియాలు టేబుల్ టెన్నిస్‌ లో పోటాపోటీగా తలపడ్డాయి. దక్షిణ కొరియా కాంస్యం గెలుచుకోగా.. ఉత్తర కొరియా రజతం నెగ్గింది. పోడియంపై ఇరు దేశాల అథ్లెట్లు సెల్ఫీ దిగడం ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీడాభిమానుల మనసు దోచుకుంది. ఆస్ట్రేలియా స్కేట్‌ బోర్డింగ్‌ సంచలనం ఆరిసా ట్రై 14 ఏళ్ల వయసులోనే బంగారు పతకం సాధించి ఔరా అనిపించింది. షూటింగ్‌ లో తుర్కియేకు చెందిన 51 ఏళ్ల ఆటగాడు టీ షర్ట్‌, సాధారణ గ్లాసెస్‌ తో రజతం గెలిచి ఆకట్టుకున్నాడు. ఏ పరికరాలూ లేకుండా పతకం కొల్లగొట్టడంతో సోషల్ మీడియాలో పొగడ్తలు వెల్లువెత్తాయి. క్యూబాకు చెందిన 42 ఏళ్ల రెజ్లర్‌ మిజైన్ లోపెజ్ వ్యక్తిగత విభాగంలో వరుసగా ఐదు స్వర్ణాలు సాధించడం విశేషం.

Tags:    

Similar News