హిస్టరీ క్రియేట్ చేసే దిశగా అమిత్ షా కొడుకు

కేంద్రంలోని మోడీ సర్కారులో అత్యంత పవర్ ఫుల్ వ్యక్తిగా సుపరిచితులు.. మోడీకి నీడగా అభివర్ణించే అమిత్ షా కొడుకు గురించి తెలిసిందే.

Update: 2024-08-27 04:17 GMT

కేంద్రంలోని మోడీ సర్కారులో అత్యంత పవర్ ఫుల్ వ్యక్తిగా సుపరిచితులు.. మోడీకి నీడగా అభివర్ణించే అమిత్ షా కొడుకు గురించి తెలిసిందే. ప్రస్తుతం బీసీసీఐ కార్యదర్శిగా వ్యవహరిస్తున్న ఆయన..త్వరలో జరిగే ఐసీసీ ఛైర్మన్ పదవికి పోటీ పడేందుకు సిద్ధమవుతున్న వార్తలు వస్తున్నాయి. ఆ దిశగా ఆయన అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇదంతా ఓకే కానీ.. ఐసీసీకి అమిత్ షా కొడుకు వెళ్లిపోతే.. ఇప్పుడు ఉన్న పోస్టులోకి ఎవరు వస్తారు? అతడి బ్యాక్ గ్రౌండ్ ఏమిటి? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.

దీనిపై క్రికెట్ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఇంతకూ ఐసీసీ ఛైర్మన్ పోస్టుకు అమిత్ షా కొడుకు జై షా పోటీ పడుతున్న వార్తలు జోరుగా వస్తున్నాయి. నవంబరు 30న ముగిసే పదవీ కాలం తర్వాత పోటీకి దూరంగా ఉండాలని ఐసీసీ ఛైర్మన్ గ్రెగ్ బార్ క్లే డిసైడ్ అయిన సంగతి తెలిసందే. దీంతో.. ఆ పోస్టుకు ఎన్నికలు జరుగుతాయని చెబుతున్నారు. ఈసారి జరిగే ఎన్నికల బరిలో దిగే జైషా.. ఎన్నికల వరకు విషయం వెళ్లకుండా.. తన మంత్రాంగంతో ఆ పదవిని చేపట్టే అవకాశాలు మెండుగా ఉన్నట్లు చెబుతున్నారు.

ఐసీసీ బోర్డులోని 16 మంది సభ్యుల్లో 15 మంది సపోర్టు జైషాకు ఉందని చెబుతున్నారు. సాధారణంగా విజేతకు తొమ్మిది ఓట్లు అవసరం. కానీ..ఆయనకు ఏకంగా 15 మంది అంటే.. 95 శాతం మంది మద్దతు అతనికి ఉంది. అందుకే.. ఎన్నిక అవసరం లేదని.. ఆయన ఏకగ్రీవంగా ఎంపిక కావటం ఖాయమంటున్నారు. ఒకవేళ.. ఇదే జరిగితే.. జై షా హిస్టరీ క్రియేట్ చేసినట్లే అవుతుంది. ఎందుకుంటే.. 35 ఏళ్ల చిరుప్రాయంలో గ్లోబల్ బాడీకి అధిపతిగా వ్యవహరించటం అంటే సామాన్యమైన విషయం కాదు. ఈ కీలక పదవికి ఇప్పటి వరకు జగన్మోహన్ దాల్మియా.. శరద్ పవార్.. ఎన్. శ్రీనివాసన్.. శశాంక్ మనోహర్ తరవాత ప్రపంచ క్రికెట్ కు నాయకత్వం వహించే ఐదో భారతీయుడిగా ఆయన అవతరించనున్నారు.

అదే జరిగితే.. ఆయన స్థానంలో బీసీసీఐ సెక్రటరీ పోస్టును ఎవరికి కట్టబెట్టే వీలుందన్న మాటకు.. బీజేపీకి చెందిన సీనియర్ నేత.. దివంగత అరుణ్ జైట్లీ కుమారుడు రోహన్ జైట్లీకి అవకాశం దక్కుతుందని చెబుతున్నారు. బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ.. ఇతర ఆఫీస్ బేరర్ల పదవీ కాలం ఏడాది తర్వాత ముగియనుంది. మొత్తంగా అమిత్ షా కొడుకు కీలక పదవిని చేపట్టనుంటే.. మరోవైపు అరుణ్ జైట్లీ కుమారుడికి కీలక పదవి దక్కటం ఆసక్తికర పరిణామంగా చెప్పక తప్పదు.

Tags:    

Similar News