సిక్స్ తో బట్లర్ సెంచరీ.. రాజస్థాన్ కు వరుసగా నాలుగో విక్టరీ!
ఐపీఎల్ సీజన్ 17లో భాగంగా శనివారం జైపుర్ వేదికగా రాజస్థాన్, బెంగళూరు మధ్య ఆసక్తికరమైన మ్యాచ్ నడిచింది
ఐపీఎల్ సీజన్ 17లో భాగంగా శనివారం జైపుర్ వేదికగా రాజస్థాన్, బెంగళూరు మధ్య ఆసక్తికరమైన మ్యాచ్ నడిచింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్.. బెంగళూరు జట్టుని బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. దీంతో... విరాట్ కొహ్లీ - డూప్లెసిస్ లు మైదానంలోకి అడుగుపెట్టారు. ఈ నేపథ్యంలో మ్యాచ్ ఆధ్యంతం ఎలా జరిగిందనేది ఇప్పుడు చూద్దాం!
ప్రారంభమైన బెంగళూరు బ్యాటింగ్!:
బెంగళూరు నుంచి ఓపెనర్లుగా కెప్టెన్ డూప్లెసిస్, విరాట్ కొహ్లీ క్రీజ్ లోకి అడుపెట్టారు. ఈ సమయంలో రాజస్థాన్ రాయల్స్ నుంచి ట్రెంట్ బౌల్ట్ తొలి ఓవర్ ఆరంభించి 8 పరుగులు ఇచ్చాడు. అనంతరం.. నంద్రి బర్గర్ వేసిన రెండో ఓవర్ లో 13 పరుగులు రాగా.. ఆ ఓవర్ లో కోహ్లీ రెండు బౌండరీలు బాదాడు.
ఇదే క్రమంలో... ట్రెంట్ బౌల్ట్ వేసిన మూడో ఓవర్ లోనూ ఎనిమిది పరుగులు వచ్చాయి. ఇక నంద్రి బర్గర్ వేసిన నాలుగో ఓవర్ లో ఒక సిక్స్, ఒక ఫోర్ తో కలిపి 13 పరుగులు రాబట్టారు. అనంతరం ఐదో ఓవర్లో అశ్విన్ మూడు సింగిల్స్ మాత్రమే ఇచ్చాడు. ఈ క్రమంలో... అవేశ్ ఖాన్ వేసిన ఆరో ఓవర్ లో ఎనిమిది పరుగులు వచ్చాయి.
దీంతో... పవర్ ప్లే పూర్తయ్యే సరికి వికెట్లేమీ నష్టపోకుండా బెంగళూరు 53 పరుగులు రాబట్టింది.
సగం ఓవర్లు పూర్తయ్యే సరికి బెంగళూరు పరిస్థితి ఇది!:
బెంగళూరు బ్యాటింగ్ నిలకడగా సాగుతోంది. ఈ నేపథ్యంలో... అశ్విన్ వేసిన ఏడో ఓవర్ లో 7 పరుగులు, చాహల్ వేసిన ఎనిమిదో ఓవర్ లో 4 పరుగులు వచ్చాయి. ఇక, ట్రెంట్ బౌల్ట్ వేసిన తొమ్మిదో ఓవర్ లో డూప్లెసిస్ రెండు సిక్స్ లు బాదాడు. ఇదే క్రమంలో... చాహల్ వేసిన 10 ఓవర్ లో నాలుగో బంతికి కోహ్లీ సిక్స్ బాదాడు. దీంతో... పది ఓవర్లు ముగిసే సరికి బెంగళూరు స్కోరు వికెట్లేమీ నష్టపోకుండా 88 పరుగులకు చేరుకుంది.
కోహ్లీ హాఫ్ సెంచరీ!:
రియాన్ పరాగ్ వేసిన 11 ఓవర్ లో నాలుగో బంతికి సిక్సర్ బాదడంతో... ఈ సీజన్ లో మూడో హాఫ్ సెంచరీ చేశాడు కొహ్లీ. ఇందులో భాగంగా 39 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేశాడు. దీంతో 11 ఓవర్లు పూర్తయ్యే సరికి బెంగళూరు స్కోరు వికెట్లేమీ నష్టపోకుండా 98 పరుగులకు చేరింది.
100 దాటిన బెంగళూరు స్కోరు!:
క్రీజులో పాతుకుపోయిన బెంగళూరు ఓపెనర్లు.. నిలకడగా ఆడుతున్నారు. ఈ క్రమంలో ఆవేశ్ ఖాన్ వేసిన 12 ఓవర్ రెండో బంతికి బెంగళూరు స్కోరు 100 పరుగులకు చేరుకుంది. ఈ సమయంలో ఆ ఓవర్ పూర్తయ్యే సరికి బెంగళూరు స్కోరు వికెట్లేమీ నష్టపోకుండా 107 పరుగులు!
బెంగళూరు ఫస్ట్ వికెట్ డౌన్!:
చాహల్ వేసిన 14 ఓవర్ లో చివరి బంతికి డుప్లెసిస్ ఔటయ్యాడు. ఆ సమయానికి డూప్లెసిస్ వ్యక్తిగత స్కోరు 33 బతుల్లో 2 ఫోర్లు 2 సిక్స్ ల సాయంతో 44 పరుగులు. దీంతో... 125 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యానికి తెరపడింది.
బెంగళూరు రెండో వికెట్ :
నంద్రి బర్గర్ వేసిన 15 ఓవర్ లో ఐదో బంతికి మ్యాక్స్ వెల్ (1) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో బెంగళూరు స్కోరు 15 ఓవర్లు పూర్తయ్యే సరికి 2 వికెట్ల నష్టానికి 129 పరుగులుగా ఉంది.
బెంగళూరు మూడో వికెట్:
చాహల్ వేసిన 17.2 ఓవర్ కు సౌరభ్ చౌహన్ (9) యశస్వి జైస్వాల్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో 18 ఓవర్లు పూర్తయ్యేసరికి బెంగళూరు స్కోరు 3 వికెట్ల నష్టానికి 165 పరుగులు.
విరాట్ కోహ్లీ సెంచరీ!:
ఐపీఎల్ సీజన్ 17లో తొలి సెంచరీ నమోదైంది. ఇందులో భాగంగా... విరాట్ కొహ్లీ 67 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
రాజస్థాన్ లక్ష్యం 184!:
రాజస్థాన్ తో జరుగుతున్న మ్యాచ్ లో బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (113*: 72 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్స్ లు) శతకం బాదాడు. డుప్లెసిస్ (44: 33 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్ లు) రాణించాడు. రాజస్థాన్ బౌలర్లలో యుజ్వేంద్ర చాహల్ 2, నంద్రి బర్గర్ ఒక వికట్ పడగొట్టారు.
ఈ శతకంతో ఐపీఎల్ లో 7500 కంటే ఎక్కువ పరుగులు చేసిన తొలి ఆటగాడిగా విరాట్ కొహ్లీ రికార్డు సృష్టించాడు. ప్రస్తుతం అతని ఐపీఎల్ కెరీర్ పరుగులు 7579.
తొలి ఓవర్ లోనే రాజస్థాన్ కు షాక్!:
బెంగళూరు నిర్ధేశించిన 184 పరుగుల లక్ష్య ఛేదనలో భాగంగా బరిలోకి దిగిన రాజస్థాన్ కు తొలి ఓవర్ లోనే షాక్ తగిలింది. ఇందులో భాగంగా... రీస్ టాప్లీ వేసిన తొలి ఓవర్ రెండో బంతికి యశస్వి జైస్వాల్ (0) మ్యాక్స్ వెల్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అనంతరం బట్లర్ క్రీజ్ లోకి వచ్చాడు.
ఈ క్రమంలో... యశ్ దయాల్ వేసిన రెండో ఓవర్ లో 8, టాప్లీ వేసిన మూడో ఓవర్ లో 7, సిరాజ్ వేసిన నాలుగో ఓవర్ లో 9, యశ్ దయాల్ వేసిన ఐదో ఓవర్ లో 9 పరుగులు రాబట్టారు రాజస్థాన్ బ్యాటర్స్. ఈ క్రమంలో... మయాంక్ దగార్ వేసిన ఆరో ఓవర్ లో బట్లర్.. మూడు ఫోర్లు, ఓ సిక్స్ బాదేశాడు.
దీంతో పవర్ ప్లే ముగిసే సరికి రాజస్థాన్ స్కోరు ఒక వికెట్ నష్టానికి 54 పరుగులకు చేరింది. ఈ సమయంలో బట్లర్ (39), శాంసన్ (15) పరుగులతో క్రీజ్ లో ఉన్నారు.
బట్లర్ హాఫ్ సెంచరీ!:
సిరాజ్ వేసిన 10 ఓవర్ లో మూడో బంతికి శాంసన్ (44) సిక్స్ బాదగా.. ఐదో బంతికి సింగిల్ తీసి బట్లర్ 30 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకున్నాడు. దీంతో సగం ఓవర్లు పూర్తయ్యే సరికి రాజస్థాన్ స్కోరు ఒక వికెట్ నష్టానికి 95 పరుగులకు చేరింది.
శాంసన్ హాఫ్ సెంచరీ!:
10 ఓవర్ లో బట్లర్ హాఫ్ సెంచరీ చేస్తే.. మయాంక్ దగార్ వేసిన 11 ఓవర్ లో రెండు ఫోర్లు, ఓ సిక్స్ బాదిన సంజూ శాంసన్ 33 బంతుల్లో అర్ధ శతకం అందుకున్నాడు. ఈ సమయంలో రాజస్థాన్ రాయల్స్ 11 ఓవర్లు పూర్తయ్యే సరికి ఒక వికెట్ నష్టానికి 109 పరుగులు చేసింది. ఈ సమయంలో... శాంసన్ (58), బట్లర్ (50) పరుగులతో క్రీజ్ లో ఉన్నారు.
36 బంతుల్లో 39 పరుగులు!:
రాజస్థాన్ బ్యాటర్లు శాంసన్, బట్లర్ లు ఏమాత్రం తగ్గడం లేదు. బెంగళూరు బౌలర్లను ఒక ఆటాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో 14 ఓవర్లు పూరయ్యేసరికి రాజస్థాన్ ఒక వికెట్ నష్టానికి 145 పరుగులు చేసింది. ఈ సమయంలో... బట్లర్ (75), శాంసన్ (68) పరుగులతో క్రీజ్ లో ఉన్నారు.
అంటే... రాజస్థాన్ విజయానికి 36 బంతుల్లో 39 పరుగులు అవసరం.
రాజస్థాన్ రెండో వికెట్ డౌన్!:
సిరాజ్ వేసిన 14.4 ఓవర్ లో సంజూ శాంసన్ ఔటయ్యాడు. అప్పటికి అతడి వ్యక్తిగత స్కోరు... 42 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్ ల సాయంతో 69 పరుగులు!
దీంతో... 15 ఓవర్లు పూరయ్యేసరికి రాజస్థాన్ రాయల్స్ స్కోరు 2 వికెట్ల నష్టాన్నికి 152 పరుగులు!
రాజస్థాన్ మూడో వికెట్!:
యశ్ దయాల్ వేసిన 15.4 ఓవర్ లో రియాన్ పరాగ్ (4) ఔటయ్యాడు. దీంతో 16 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి రాజస్థాన్ స్కోరు 160 పరుగులు.
నాలుగో వికెట్ కోల్పోయిన రాజస్థాన్!:
విజయానికి చేరువైన సమయంలో రాజస్థాన్ వరుసగా వికెట్లు కోల్పోతుంది. ఇందులో భాగంగా.. టాప్లీ వేసిన 17 ఓవర్లో మూడో బంతికి ధ్రువ్ జురెల్ ఔటయ్యాడు. దీంతో 17 ఓవర్లు పూర్తయ్యే సరికి 4 వికెట్ల నష్టానికి రాజస్థాన్ స్కోరు 170 పరుగులు.
సిక్స్ తో బట్లర్ సెంచరీ.. రాజస్థాన్ కు వరుసగా నాలుగో విక్టరీ!:
రాజస్థాన్ 19 ఓవర్లు పూర్తయ్యే సరికి 4 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేయగా... 20వ ఓవర్ తొలిబంతికి బట్లర్ సిక్స్ బాదడంతో... అటు సెంచరీ, ఇటు టీం కు 6 వికెట్ల తేడాతో విక్టరీ ఒకేసారి లభించాయి. దీంతో... ఈ ఐపీఎల్ సీజన్ లో రాజస్థాన్ వరుసగా నాలుగో విక్టరీ సాధించింది.
ఈ మ్యాచ్ లో రెండు సెంచరీలు నమోదవ్వడం గమనార్హం. బెంగళూరు నుంచి విరాట్ కోహ్లీ (113*: 72 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్స్ లు) శతకం బాదగా... రాజస్థాన్ రాయల్స్ నుంచి జోస్ బట్లర్ (100*: 58 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స్ లు) సెంచరీ సాధించాడు!