‘మను’ బోణీ.. పారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు తొలి పతకం

మిగతా అందరూ విఫలమైనా.. ఆమె ఆశలు నిలిపింది.. మొదటి రోజే మెరిసిన ఆమె రెండో రోజు పతకం కొల్లగొట్టింది.

Update: 2024-07-28 11:06 GMT

మిగతా అందరూ విఫలమైనా.. ఆమె ఆశలు నిలిపింది.. మొదటి రోజే మెరిసిన ఆమె రెండో రోజు పతకం కొల్లగొట్టింది. నిలకడైన ప్రదర్శనతో భారత్ కు పారిస్ ఒలింపిక్స్ లో బోణీ కొట్టింది. 10మీ ఎయిర్‌ పిస్టల్‌ ఫైనల్‌ లో భారత యువ షూటర్ మను బాకర్‌ కాంస్యం కొల్లగొట్టింది. శనివారం క్వాలిఫికేషన్‌ లో మను 580 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్‌ ఫైనల్‌ ఆదివారం జరిగింది. ఇదే ఈవెంట్లో మరో భారత షూటర్‌ రిథమ్‌ సాంగ్వాన్‌ 15వ స్థానంలో నిలిచి తప్పుకొంది. ఈమె 517 పాయింట్లు స్కోర్‌ చేసింది. అయితే, 582 పాయింట్లతో హంగేరి షూటర్‌ వెరోనికా మేజర్‌ టాప్ లో నిలిచింది. నిన్నటి రోజున తొలి సిరీస్‌ లో పది షాట్లకు 97 పాయింట్లు స్కోర్‌ చేసిన మను.. తర్వాత నిలకడైన ప్రదర్శనతో 27 ఇన్నర్‌ పదులు షూట్‌ చేసింది.

చరిత్ర పుటల్లోకి..

పారిస్ లో కాంస్యం సాధించడం ద్వారా ఒలింపిక్స్‌ షూటింగ్‌ లో పతకం సాధించిన తొలి భారత మహిళా షూటర్‌ గా మను బాకర్ సృష్టించింది. కాగా, టోక్యోలో జరిగిన 2020 ఒలింపిక్స్ (కరోనా కారణంగా 2021లో జరిగాయి) తొలి రోజే వెయిట్‌ లిఫ్టర్‌ చాను రజతం సాధించింది. పారిస్ లో మాత్రం రెండో రోజు పతకం లభించింది. అప్పట్లో బోణీ భారత బృందానికి, అభిమానులకు గొప్ప ఊపునిచ్చింది. ఈసారి ఆ అవకాశం లేదా? అని అభిమానులు నిరుత్సాహ పడుతుండగా మను అదరగొట్టింది. తోటివారంతా విఫలమైన వేళ.. చక్కటి ప్రదర్శనతో ఫైనల్‌ కు వచ్చింది. షూటింగ్‌ లో భారత్‌ కు అసలు పతకాల ఆశల్లేవ్. కానీ.. మను వాటికి ఊపిరి పోసింది.

పురుషులు.. ప్చ్..

పారిస్ ఒలింపిక్స్ పురుషుల 10మీ ఎయిర్‌ పిస్టల్‌ లో సరబ్‌జ్యోత్, అర్జున్‌ బరిలో దిగినా మొదట్లోనే విఫలమయ్యారు. అయితే, సరబ్‌ జ్యోత్‌ త్రుటిలో తుది పోరుకు దూరమయ్యాడు. ఎనిమిది మందికి ఫైనల్‌ చేరే అవకాశముండగా.. సరబ్‌జిత్‌ 577 పాయింట్లతో 9వ స్థానంలో నిలిచాడు. జర్మనీకి చెందిన రాబిన్స్‌తో సమానంగా స్కోర్‌ చేసినా.. ఎక్కువ ఇన్నర్‌ పదులతో రాబిన్స్ ముందంజ వేశాడు. రాబిన్స్‌ 17 ఇన్నర్‌ పదులు షూట్‌ చేయగా.. సరబ్‌ 16 దగ్గరే ఆగిపోయాడు. కాగా, అర్జున్‌ చీమా 174 పాయింట్లతో 18వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఇక 10 మీ ఎయిర్‌ రైఫిల్‌ ఈవెంట్లో రెండు భారత జట్లూ క్వాలిఫికేషన్‌ దశలోనే నిష్క్రమించాయి. రమిత జిందాల్‌-అర్జున్‌ బబుతా జోడీ 628.7 పాయింట్లతో ఆరో స్థానంలో, ఇలవెనిల్‌ వలరివన్‌- సందీప్‌ సింగ్‌ ద్వయం (626.3) 12వ స్థానంతో సరిపెట్టుకుంది. పతకం సాధించే ఫైనల్స్ కు చేరాలంటే జట్లు టాప్‌-4లో నిలవాలి.

Tags:    

Similar News