ఐపీఎల్ లో ఆ భారతీయ అల్లుడు.. మహా దండగ

ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్ వెల్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు.

Update: 2024-04-13 11:36 GMT

0, 3, 28, 0, 1, 0.. ఇవేవో లోయరార్డర్ బ్యాటర్ పరుగులు కావు.. వన్డేల్లో డబుల్ సెంచరీ.. టి20ల్లో సూపర్ సెంచరీ కొట్టిన బ్యాటర్ వరుసగా నమోదు చేసిన స్కోర్లు.. మొత్తం ఆరు ఇన్నింగ్స్ లో 32 పరుగులు.. మూడు డకౌట్లు.. మ్యాచ్ ఫలితాన్ని ఒంటిచేత్తో మార్చేస్తాడనే పేరున్న అతగాడు ఈ స్థాయలో విఫలం అవుతుండడం అభిమానులను తీవ్ర వేదనకు గురిచేస్తోంది. కనీసం క్రీజులో కుదురుకోవడానికి కూడా ఇబ్బందులు పడుతున్న వైనం చూస్తే ఇంకా ఎందుకు ఇతడిని ఆడిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం అవుతోంది.

డబుల్ సెంచరీ కొట్టిన చోట డకౌట్

ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్ వెల్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. అతడి హిటింగ్ సామర్థ్యం ఎలాంటిదో అందరికీ తెలుసు. రివర్స్ స్వీప్ లు, పుల్ షాట్లతో విరుచుకుపడే అతడు ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు పెద్ద గుదిబండగా మారాడు. లీగ్ మొత్తం పేలవ ఫామ్ లో ఉన్న అతడు.. గురువారం ముంబయి ఇండియన్స్ తో మ్యాచ్ లో నాలుగు బంతులు ఆడి ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. విచిత్రం ఏమంటే.. వన్డే ప్రపంచ కప్ లో ఇదే వాంఖడే స్టేడియంలో మ్యాక్స్ వెల్ అఫ్ఘానిస్థాన్ పై ఏకంగా డబుల్ సెంచరీ కొట్టి ఆస్ట్రేలియాను గెలిపించాడు. పిక్కలు పట్టేసినా.. ఒంటిచేత్తో నాడు అఫ్ఘాన్ మేటి స్పిన్నర్లను చితగ్గొట్టిన అతడు.. మొన్న ముంబై ఇండియన్స్ సాధారణ స్పిన్నర్ శ్రేయస్ గోపాల్ బౌలింగ్ లో డిఫెన్స్ ఆడబోయి ఎల్బీ అయ్యాడు. ఈ క్రమంలో ఐపీఎల్ లో అత్యధికసార్లు డకౌటైన బ్యాటర్ గా రోహిత్ శర్మ, దినేశ్ కార్తిక్ రికార్డు (17 సార్లు)ను సమం చేశాడు. దీంతో దీంతో ఆర్సీబీ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. జాతీయ జట్టు ఆస్ట్రేలియా తరఫున ఆడినట్లు, ఆర్సీబీకి ఆడట్లేదని మండిపడుతున్నారు.

అతడు అంతే.. కానీ మరీ ఇంతనా?

మ్యాక్స్ వెల్ ఆటతీరే అంత. కొడితే హిట్టు. లేదంటే ఫట్టు.. కానీ, మరీ ఇంత దారుణంగా ఆడతాడా? అనే విమర్శలు వస్తున్నాయి. ఇంతకూ మ్యాక్స్ వెల్ కు ఏమైంది? అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. 2019లో ఓసారి మెంటల్ రిహాబిలిటేషన్ కు వెళ్లిన మ్యాక్స్ వెల్ అనంతరం తిరిగి అంతర్జాతీయ క్రికెట్లోకి వచ్చాడు. గాయాలు బాధపెడుతున్నా కెరీర్ ను కొనసాగిస్తూ బిగ్ బాష్ లీగ్, ఆస్ట్రేలియా జాతీయ జట్టు, ఐపీఎల్ లో ఆడుతున్నాడు. కానీ, ఇండియన్ లీగ్ లో అత్యంత చెత్త ప్రదర్శనతో జట్టులో అవసరమా? అనే తీరున విఫలమవుతున్నాడు.

జట్టుకు పెను భారం..

కోహ్లి వంటి స్టార్ 2008 నుంచి బెంగళూరుకు ఆడుతున్నా ఇప్పటివరకు ఆ జట్టు ఐపీఎల్ టైటిల్ కొట్టలేదు. వాస్తవానికి బెంగళూరు బౌలింగ్ మొదటినుంచి బలహీనం. సరైన ఆల్ రౌండర్, ఫినిషర్ లేకపోవడం వారికి ఎప్పటినుంచో ఉన్న లోటు. ఇప్పుడు బ్యాటింగ్ కూడా బాగా పడిపోయింది. కేవలం కోహ్లి, డుప్లెసిస్ మాత్రమే ఆ జట్టులో చెప్పుకోదగ్గ ఆటగాళ్లు. వెటరన్ దినేశ్ కార్తీక్ ను పూర్తిగా ఫినిషర్ గానే చూడాలి తప్ప భారీ ఇన్నింగ్స్ కోసం కాదు. ఇలాంటి సమయంలోనే మ్యాక్సీ వెఫల్యం బెంగళూరును తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది.

అల్లుడిని పక్కనపెడతారా..?

తమిళనాడు మూలాలున్న విని రామన్ ను రెండేళ్ల కిందట మ్యాక్స్ వెల్ వివాహమాడిన సంగతి తెలిసిందే. అలా భారత్ కు అల్లుడైన మ్యాక్సీ ఐపీఎల్ లో వైఫల్యాల పరంపర కొనసాగిస్తే పక్కనపెట్టక తప్పదు. ఒక మ్యాచ్ కాకుంటే మరోదాంట్లో అయినా రాణిస్తాడనే ఆశలు సన్నగిల్లుతుండడమే దీనికి కారణం.

Tags:    

Similar News