ఫుట్ బాల్ "మెస్సయ్య".. సోషల్ మీడియాలో మేనియా
ఈ నేపథ్యంలో వీరిలో చరిత్రలో నిలిచిపోయే ఆటగాళ్లు ఎవరంటే మాత్రం మెస్సీ, జకోవిచ్. ఎందుకంటే.. దీనికో పెద్ద కథనే ఉంది.
సమకాలీన క్రీడా ప్రపంచంలో గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (గోట్) ఆటగాళ్లు ఎవరంటే.. టెన్నిస్ లో జకోవిచ్ (సెర్బియా), క్రికెట్ లో విరాట్ కోహ్లి (ఇండియా), ఫుట్ బాల్ లో లయోనల్ మెస్సీ (అర్జెంటీనా). గమనార్హం ఏమంటే.. వీరంతా ఇప్పుడు కెరీర్ చివరి దశలో ఉన్నారు. మరొక్క రెండేళ్లలో వీరు తప్పుకొనే చాన్సుంది. ఇక ఫుట్ బాల్ లోనే మరో దిగ్గజంగా భావించే క్రిస్టియానో రొనాల్డో కూడా అంతే. ఈ నేపథ్యంలో వీరిలో చరిత్రలో నిలిచిపోయే ఆటగాళ్లు ఎవరంటే మాత్రం మెస్సీ, జకోవిచ్. ఎందుకంటే.. దీనికో పెద్ద కథనే ఉంది.
ప్రపంచ కప్.. ప్రపంచ రికార్డు
ఏ ఆటగాడికైనా దేశానికి ప్రపంచ కప్ అందించడం అత్యంత గొప్ప అచీవ్ మెంట్. ఫుట్ బాల్ లాంటి ప్రపంచ ప్రసిద్ధ క్రీడలో ఈ ఘనత సాధించాడు లయోనల్ మెస్సీ. 2022లో జరిగిన ఖతర్ ప్రపంచ కప్ లో తన అద్భుత ఆటతీరుతో ఫైనల్లో ఫ్రాన్స్ ను మట్టికరిపించాడు. దీంతోనే అర్జెంటీనా సారథిగా అతడు చరిత్ర పుటల్లోకి ఎక్కాడు. మరోవైపు మెస్సీకి సమకాలీకుడు, ప్రతిభలో సమ ఉజ్జీ కూడా అయిన రొనాల్డో మాత్రం తన జట్టు పోర్చుగల్ కు కప్ అందించలేకపోయాడు. ఇక జకోవిచ్ ఇప్పటికే 24 గ్రాండ్ స్లామ్ లు నెగ్గాడు. మరొక్కటి సాధిస్తే అతడు మహిళా దిగ్గజం మార్గరెట్ కోర్ట్ (24 గ్రాండ్ స్లామ్ లు) రికార్డును దాటేస్తాడు. కాగా, కోహ్లి మాత్రం ఇప్పటివరకు ప్రపంచ కప్ (వన్డే) నెగ్గిన జట్టు సారథిగా లేడు. 2011లో కప్ కొట్టిన జట్టులో అతడు ఉన్నప్పటికీ కేవలం జూనియర్ ఆటగాడు మాత్రమే. ఆ తర్వాత టి20 ప్రపంచ కప్ లను కెప్టెన్, ఆటగాడిగా సాధించలేకపోయాడు. అయితే, మరో నాలుగేళ్లు అంతర్జాతీయ క్రికెట్ లో కొనసాగగలిగితే కోహ్లికి ఏదో ఒక అవకాశం ఉంటుందని చెప్పవచ్చు.
మెస్సీ మాయ కమ్మేసింది..
కతర్ లో జరిగిన ప్రపంచ కప్ ఫుట్ బాల్ తో మెస్సీ మాయ ప్రపంచాన్ని కమ్మేసింది. అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ఆ మ్యాచ్ లో మెస్సీ ప్రదర్శన అద్భుతం అనే చెప్పాలి. మ్యాచ్ పూర్తయి 15 నెలలు అవుతున్నా.. ఇప్పటికీ ఫుట్ బాల్ ప్రేమికుల మనసుల్లో నిలిచిపోయింది. కాగా, మెస్సీ ఇప్పుడు అరుదైన మరో ఘనత సాధించాడు. సోషల్ మీడియా ఇన్ స్టాగ్రామ్ లో 500 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్న ప్లేయర్ గా అవతరించాడు. ఇంతకుముందు ఈ రికార్డు రొనాల్డో కూడా ఈ ఘనత సాధించాడు. ఇతడికి 622 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. క్రికెటర్లలో మాత్రం అత్యధిక ఫాలోవర్లు ఉన్నది టీమిండియా సూపర్ స్టార్ విరాట్ కోహ్లి (266 మిలియన్లు) కావడం విశేషం.