షమీ అద్భుతం వెనుక అంత కష్టం ఉంది

భార్య పెట్టిన గ్రహ హింస కేసు.. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు.. ఆత్మహత్య చేసుకుందామన్న ఆలోచనలు.. రోడ్డు ప్రమాదం.. అది కాదు ఇది కాదు

Update: 2023-11-16 04:40 GMT

చిన్నకష్టానికే కుదేలైపోతుంటారు. అలాంటిది ఒకటి కాదు రెండు కాదు.. ఎన్ని కష్టాలు.. మరెన్ని సవాళ్లు ఎదురు కావాలో అన్ని ఎదురు కావటం.. తరచూ ఎదురయ్యే శీల పరీక్షలకు వెరవకుండా.. తనను తాను ఫ్రూవ్ చేసుకోవటమే కాదు.. హీరో కాస్తా జీరో అయిన వేళ.. మళ్లీ హీరో కావటమే కాదు.. సూపర్ హీరోగా మారటం అంత సులువు కాదు. కానీ.. ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు మహ్మద్ షమీ.

భార్య పెట్టిన గ్రహ హింస కేసు.. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు.. ఆత్మహత్య చేసుకుందామన్న ఆలోచనలు.. రోడ్డు ప్రమాదం.. అది కాదు ఇది కాదు. ఒక మనిషి తట్టుకోలేనన్నిసమస్యలు ఎదురైనప్పటికీ వెనకడుగు వేయటంగా.. సమస్యలతోనూ.. తనకు ఎదురుగా నిలిచిన కాలంతోనూ యుద్ధం చేసి.. తాను అనుకున్నది సాధించటమే కాదు.. తానేమిటన్నది లోకానికి తెలియజేసినోడు షమీ.

2013లోనే కెరీర్ ప్రారంభించినా.. ఆటగాడిగా అతడికి దక్కాల్సినంత పేరు దక్కలేదు. ప్రతిభ ఉన్నప్పటికీ శిఖర సమానులైన జహీర్ ఖాన్.. ఇషాంత్ శర్మ లాంటి దిగ్గజాల నీడతో షమీకి రావాల్సినంత గుర్తింపు రాలేదు. ఈలోగా బూమ్రా రావటంతో అతడి ప్రతిభ ప్రపంచానికి కాస్త లేటుగా తెలిసిన పరిస్థితి. ఇతగాడి బౌలింగ్ టాలెంట్ ఎంతన్న దానికి నిదర్శనంగా కొన్ని అంశాల్ని ప్రస్తావిస్తే.. అతడెంత సూపర్ బౌలర్ అన్నది ఇట్టే అర్థమవుతుంది.

భారత్ తరఫున వన్డేల్లో అత్యధిక శాతం వికెట్లు క్లీన్ బౌల్డ్ లు సాధించటం అతడి టాలెంట్ ఎంతన్నది తెలుస్తుంది. అతడి బౌలింగ్ ఎంత అద్భుతం అన్నది తెలియాలంటే ఇక్కడో విషయాన్ని చెబితే అర్థమవుతుంది. ప్రపంచంలో మిచెల్ స్టార్క్.. వకార్ యూనిస్.. వసీం అక్రమ్.. షోయబ్ అక్తర్ మాత్రమే కెరీర్ లో అత్యధిక బౌల్డ్ లు చేశారు. బౌలర్ గా షమీ కెరీర్ ముగిసిందని భావించిన వేళ.. బౌన్సింగ్ పిచ్ ను తాకిన బంతిలా పైకి లేచాడు.

పదకొండేళ్ల కెరీర్ లో ఐదేళ్లు గాయాలతోనూ.. కుటుంబ వివాదాలతోనూ కేవలం పద్నాలుగు మ్యాచ్ లు మాత్రమే ఆడిన షమీ జీవితంలో పెను సునామీ 2018లో వచ్చింది. మరో క్రీడాకారుడికి షమీకి వచ్చిన కష్టాలే వచ్చి ఉంటే.. అడ్రస్ లేకుండా పోయేవాడు. ఎందుకంటే.. కట్టుకున్న భార్య గ్రహహింస కేసు పెట్టటం.. ఫిక్సింగ్ ఆరోపణలు చేయటంతో అతడి కెరీర్ పెను ప్రమాదంలో పడింది. దీనికి తోడు.. కేసులు అతడ్ని చుట్టిముట్టేశాయి. దీంతో.. బీసీసీఐ కాంట్రాక్టు నిలిచిపోయింది. ఇలాంటి వేళ.. ఒక టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతడు భోరున విలపించాడు.

అతడికి ఎదురైన పరీక్షల పరంపరలో.. అతడు ఎంతోకాలంగా ఆడుతున్న ఢిల్లీ డేర్ డెవిల్స్ సైతం అతడ్ని వదులుకుంది. ఇలా షాకుల మీద షాకులు తగిలాయి. వీటన్నింటికి తట్టుకొని నిలిచాడు. కాలపరీక్షలో నెగ్గి.. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణల నుంచి బయటపడ్డాడు. మళ్లీ తనకు వచ్చిన అవకాశాన్ని మిస్ చేసుకోకుండా కఠినంగా శ్రమించాడు. 2019లో 21 వన్డేల్లో 177.2 ఓవర్లు బౌల్ చేసి అత్యధికంగా 42 వికెట్లు సాధించాడు.

అయినప్పటికీ వివిధ కారణాలతో 2020లో ఆస్ట్రేలియా సిరీస్ కు అతడ్ని విడిచిపెట్టేశారు. అప్పటి నుంచి 2022 వరకు పిలుపే రాలేదు. ఇలాంటి వేళలో యూపీలోని తన ఫామ్ హౌస్ లో సొంత పొలంలో ఏర్పాటు చేసుకున్న మైదానంలో ప్రాక్టీస్ చేసేవాడు. ఈ విషయం ఎవరికి తెలీదు. కొన్నేళ్ల క్రితం ఈ విషయాన్ని అతడి చిన్ననాటి కోచ్ మహమ్మద్ బద్రుద్దీన్ ప్రకటించటంతో అతడి కఠిన శ్రమ గురించి ప్రపంచానికి తెలిసింది.

తాను ఏర్పాటు చేసుకున్న గ్రౌండ్ ను తన సొంత డబ్బుల్ని వినియోగించాడు. తన సోదరుడితో కలిసి పిచ్ పనులు స్వయంగా కలిసి చేసుకునేవాడు. షమీ ఏర్పాటు చేసుకున్న గ్రౌండ్ లో మూడు రకాల పిచ్ లు ఉన్నాయి. వీటిల్లో ఒకటి ఫ్లాట్ పిచ్ అయితే.. మరొకటి కొంచెం పచ్చికతో ఉంటుంది. మూడోది పూర్తిగా బౌలింగ్ కు అనుకూలమైనది. ఫ్లాట్ పిచ్ మీద బంతులు విసరాలంటే రెక్కలు ముక్కలు చేసుకోవాల్సిందే. ఇలా.. గంటల కొద్దీ సాదన చేసేవాడు. తాను రియల్ మ్యాచ్ లో ఆడుతున్నట్లుగా ప్రాక్టీస్ చేసేవాడు.

ఇక్కడితో సరిపెట్టలేదు. ఒకవేళ.. ఇక్కడితో ఆగితే.. ఇంత దూరం వచ్చేవాడు కాదేమో? తన సొంత గ్రౌండ్ లో సొంతంగా ఫ్లడ్ లైట్లను ఏర్పాటు చేసుకున్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్ లో రాత్రివేళలో బౌలింగ్ చేసే నైపుణ్యానికి పదును పెట్టుకున్నాడు. కొవిడ్.. లాక్ డౌన్ టైంలో గంటల కొద్దీ సమయాన్ని ప్రాక్టీస్ కోసం వెచ్చించేవాడు అంతేకాదు.. బౌలర్ గా వేగంగా బంతులు వేయటమే కాదు.. ఫిట్ నెస్ కాపాడుకోవటం కోసం కాళ్లను బలంగా ఉంచుకోవాలి. అందుకోసం ఇంట్లోనే మినీ జిమ్ ను ఏర్పాటు చేసుకున్నాడు. పొలంలో మట్టిపై చాలాసేపు రన్నింగ్ చేసేవాడు. పొలం మట్టి మెత్తగా ఉండటంతో అక్కడ ఎక్కువ శక్తిని వినియోగించి పరిగెత్తాల్సి ఉండేది.

ఇలా తనను తాను రాటు తేల్చుకుంటూ నిత్యం శ్రమించేవాడు. అతడి కష్టానికి తగ్గ ఫలితం రావటం మొదలైంది.లాక్ డౌన్ తర్వాత గుజరాత్ టైటాన్స్ తరఫున అద్భుత ప్రదర్శన చేసిన అతను ఈ ఏడాది తిరుగులేని ఫామ్ లో ఉన్నాడు. ప్రపంచకప్ జట్టులో స్థానం లభించినా.. లీగ్ దశలో తొలి నాలుగు మ్యాచ్ లలో అతడ్ని తుది జట్టుకు తీసుకోలేదు. హార్దిక్ గాయం కారణంగా జట్టులోకి వచ్చిన షమీ.. తొలి మ్యాచ్ లోనూ పటిష్ఠమైన కివీస్ బ్యాటర్లను కకావికలం చేశాడు. ఐదు వికెట్లను సాధించాడు. ఆ తర్వాత ఇంగ్లండ్ లో జరిగిన మ్యాచ్ లో నాలుగు.. శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో ఐదు.. సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో రెండు వికెట్లుతీశాడు. తాజాగా సెమీస్ లో కివీస్ జట్టుపై ఏకంగా ఏడు వికెట్లు సాధించాడు. భారత బౌలర్లలో తిరుగులేని అధిక్యతను ప్రదర్శించాడు. ప్రపంచకప్ ఫైనల్ లో అతడి కసి టీమిండియాకు సరికొత్త అస్త్రంగా మారుతుందని చెప్పక తప్పదు. అదెంతన్నది తేలాలంటే ఆదివారం వరకు వెయిట్ చేస్తే సరిపోతుంది.

Tags:    

Similar News