న్యాయం కోసం వీధుల్లోకి వచ్చినప్పుడు మాట్లాడని మోడీ మాట్లాడటమా?
‘‘వినేశ్.. నువ్వు ఛాంపియన్లకే ఛాంపియన్.నీ ప్రతిభ దేశానికి గర్వకారణం. భారతీయులందరికీ నువ్వు స్ఫూర్తిదాయకం.
మన దేశంలో ఒక విచిత్రమైన సన్నివేశం కనిపిస్తూ ఉంటుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏం చేసినా తప్పు కాదు ఒప్పే అనే వర్గం ఎంత బలంగా తమ వాదనను వినిపిస్తుందో.. అంతే బలంగా పీఎం నరేంద్ర మోడీ ఏం చేసినా అందులో ఒప్పు కంటే తప్పులే వెతికే వర్గం ఇంకొకటి ఉంటుంది. వీరి తీరు రోటీన్ కు భిన్నంగా ఉంటుంది. ఇలాంటి వారి ఆలోచనలు విన్నప్పుడు.. వారిని ఏమనాలో ఒక పట్టాన అర్థం కాదు. ఏం చేసినా..చివరకు మోడీలో లోపాన్ని వెతకటమే లక్ష్యంగా వారి తీరు ఉంటుంది.
భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ ఒలింపిక్స్ లో ఫైనల్ కు చేరి.. స్వర్ణం ఖాయమనుకున్న వేళ.. అనూహ్యంగా ఆమె ఉండాల్సిన బరువు కంటే వంద గ్రాములు అధికంగా బరువు ఉందన్న కారణంగా అనర్హత వేటు వేయటం.. కోట్లాది మంది భారతీయులకు షాకింగ్ గా మారింది. ఇక.. వినేశ్ పరిస్థితి చెప్పాల్సిన అవసరమే లేదు. కన్నీరు మున్నీరు అవుతోంది. పోటీకి ముందు రోజు ఉండాల్సిన బరువులోనే ఉన్న ఆమె.. పోటీ వేళకు వంద గ్రాముల బరువు అధికంగా ఉండటంతో ఆమెపై అనర్హత వేటు వేయటంతో తీవ్రంగా బాధిస్తోంది. ఇలాంటి వేళ.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైతం స్పందించారు.
‘‘వినేశ్.. నువ్వు ఛాంపియన్లకే ఛాంపియన్.నీ ప్రతిభ దేశానికి గర్వకారణం. భారతీయులందరికీ నువ్వు స్ఫూర్తిదాయకం. ఈ రోజు నీకు తగిలిన ఎదురుదెబ్బ ఎంతో బాధించింది. దీన్ని వ్యక్తం చేయటానికి నా దగ్గర మాటల్లేవు. కానీ.. ఈ బాధ నుంచి బయటపడి.. బలంగా తిరిగి రాగలవని నేను నమ్ముతున్నా. సవాళ్లను ఎదిరించటం నీ తీరు. మేమంతా నీకు అండగా ఉన్నాం’’ అంటూ ఇచ్చిన భరోసా ఆసక్తికరంగా మారింది. ఇదంతా చదివిన వారు ఎవరైనా.. ప్రధాని మోడీ స్పందించిన తీరుకు ఫిదా అవుతారు.
అందరిలా ఉంటే.. ఇందాక చెప్పిన వారి ప్రత్యేకత ఏముంటుంది? అందుకే వారిప్పుడు కొత్త పల్లవిని వినిపిస్తున్నారు. రెజ్లర్ల పట్ల బీజేపీకి చెందిన ఎంపీ బ్రిజ్ భూషణ్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారంటూ వీధుల్లోకి వచ్చి పోరాటం చేయటం.. వారాల పాటు సాగిన ఈ రచ్చపై అప్పట్లో ప్రధానమంత్రి ఏ దశలోనూ కల్పించుకోకపోవటం తెలిసిందే. దీనిపై అప్పట్లో తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. ఈ నిరసనల్లో పాల్గొన్న ప్రముఖు క్రీడాకారుల్లో రెజ్లర్ వినేశ్ ఫొగాట్ ఒకరు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్న మోడీ వ్యతిరేకులు.. అప్పట్లో వీధుల్లోకి వచ్చి.. న్యాయపోరాటం చేసే వేళలో స్పందించని ప్రధాని.. ఇప్పుడు మాత్రం రియాక్టు అవుతున్నారు. వినేశ్ విషయంలో ఆయన స్పందించక తప్పనిపరిస్థితి ఏర్పడిందంటూ వ్యాఖ్యానిస్తున్నారు. ఇలాంటి వారి మాటల్ని విన్నప్పుడు.. మోడీ చేసే ప్రతి పనిలోనూ నెగిటివ్ ను వెతకటమే వారి లక్ష్యమన్న భావన కలగటం ఖాయం.