గూబలదిరిపోతున్న టికెట్ల ధరలు.. జేబులు ఖాళీ.. ఏం జరిగింది?
పైగా.. నరేంద్ర మోడీ స్టేడియంలో 1,36000 మంది ఒకే సారి కూర్చుని వీక్షించే ఏర్పాటు ఉంది. అంతేకాదు.. అధునాతన సౌకర్యాలు కూడా సొంతం
వన్డే ప్రపంచ కప్ ఫైనల్ పోటీ.. మరో రెండు రోజుల్లో ఆదివారం జరగనుంది. ప్రధాని నరేంద్ర మోడీ సొంత రాష్ట్రం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో రెండేళ్ల కిందట నిర్మించిన 'నరేంద్ర మోడీ స్టేడియం'లో ఈ ఫైనల్ పోటీ జరగనుంది. పైగా.. ఈ ఫైనల్స్‌లో రెండు దిగ్గజ దేశాలు(భారత్-ఆస్ట్రేలియా) పోటీ పడుతుండడంతో మరింతగా ఉత్కంఠ పెరిగిపోయింది. దీంతో ఎక్కడెక్కడి నుంచో క్రికెట్ ప్రియులు ఈ ఫైనల్ మ్యాచ్‌ను వీక్షించేందుకు.. క్యూ కడుతున్నారు.
పైగా.. నరేంద్ర మోడీ స్టేడియంలో 1,36000 మంది ఒకే సారి కూర్చుని వీక్షించే ఏర్పాటు ఉంది. అంతేకాదు.. అధునాతన సౌకర్యాలు కూడా సొంతం. ఎక్కడికక్కడ స్క్రీన్స్ కూడా ఉంటాయి. దీంతో ఈ వేదిక నుంచి ప్రత్యక్షంగా ఫైనల్ మ్యాచ్‌ను వీక్షించాలని క్రికెట్ ప్రియులు కోరుకుంటున్నారు. అయితే.. వీరి వీక్ నెస్‌ను, వన్డే క్రికెట్ ఫైనల్స్‌కు పెరిగిన డిమాండ్‌ను తమకు అనుకూలంగా మార్చేసుకున్నారు.. స్థానిక హోటల్ యజమానులు, విమాన యాజమాన్యాలు.
+ సాధారణ హోటళ్లలోనే ఒక్క రాత్రి బస చేసేందుకు రూ.10 వేలు వసూలు చేస్తున్నారు. ముందుగానే బుక్ చేసుకోవాలి. ఇప్పటికే అహ్మదాబాద్ నగరంలో హోటళ్లు హౌస్ ఫుల్ బోర్డులు పెట్టేశాయి.
+ అహ్మదాబాద్‌లోని స్టార్ హోటళ్లలో రోజుకు రూ.లక్ష చొప్పున వసూలు చేస్తున్నారు. దీనికి జీఎస్టీ అదనం. ఇవి కూడా దాదాపు నిండిపోయాయి.
+ ఇక, నవంబరు 18-19 తేదీల్లో ముంబై నుంచి అహ్మదాబాద్‌కు వెళ్లే విమానాల చార్జీలు ఏకంగా రూ.50 వేలు పలుకుతున్నాయి. సాధారణ రోజుల్లో ఇవి 22 వేలు.
+ ఢిల్లీ నుంచి అహ్మదాబాద్‌కు రూ.40 వేలు. హైదరాబాద్ నుంచి రూ.35 వేలు చొప్పున విమాన చార్జీలు వసూలు చేస్తున్నారు. ఇవి మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.