రజత పతకంతో మరో రికార్డును క్రియేట్ చేసిన నీరజ్ చోప్రా

పాక్ ఆటగాడు అర్షద్ రెండుసార్లు 90 మీటర్ల కంటే ఎక్కువ దూరాన్ని ఈటెను విసిరాడు.

Update: 2024-08-09 04:53 GMT

గత ఒలింపిక్స్ లో అద్భుత ఆటతో పతకాన్ని సొంతం చేసుకున్న బల్లెం వీరుడు.. భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా మరోసారి తన అద్భుత ఆటతో భారత్ కు రజత పతకాన్ని సొంతమయ్యేలా చేశాడు. గురువారం అర్థరాత్రి జరిగిన జావెలిన్ త్రో ఫైనల్ లో నీరజ్ వెండి పతకాన్ని సొంతం చేసుకున్నాడు. అయితే.. నీరజ్ తో పోలిస్తే పాక్ అథ్లెట్ నదీమ్ అర్షద్ మెరుగైన ప్రదర్శనతో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్నాడు.

పన్నెండు మందిలో పోటీ పడిన నీరజ్ ఫైనల్ లో 89.45 మీటర్లు విసరగా.. పాక్ అథ్లెట్ నదీమ్ అర్షద్ 92.97 మీటర్లు విసరగా.. గ్రెనడా అథ్లెట్ పీటర్స్ అండరసన్ 88.54 మీటర్లు విసిరి మూడో స్థానంలో నిలిచాడు. కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్నాడు. ఫైనల్ బరిలో మొత్తం ఆరు ప్రయత్నాలకు నీరజ్ రెండు త్రోలోనే సక్సెస్ కాగా.. మిగిలిన అన్ని ప్రయత్నాల్లోనూ ఫెయిల్ అయ్యాడు.

పాక్ ఆటగాడు అర్షద్ రెండుసార్లు 90 మీటర్ల కంటే ఎక్కువ దూరాన్ని ఈటెను విసిరాడు. నీరజ్ సాధించిన పతకంతో భారత్ మొత్తం ఐదు పతకాల్ని ఈ ఒలింపిక్స్ లో సొంతం చేసుకుంది. ఇప్పటివరకు భారత్ కు దక్కిన మొదటి రజత పతకం నీరజ్ దే కావటం గమనార్హం. మిగిలిన నాలుగు పతకాలు కాంస్యాలే. మూడు షూటింగ్ లో.. ఒకటి హాకీలో వచ్చింది.

టోక్యో ఒలింపిక్స్ విజేతగా నిలిచిన నీరజ్ ఈసారీ స్వర్ణాన్ని సాధిస్తాడని భావించారు. నిజానికి నీరజ్ మెరుగైన ఆటను ప్రదర్శించినప్పటికీ.. పాక్ అథ్లెట్ అద్భుత ఆటను ప్రదర్శించటంతో వెండితో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే.. వరుస రెండు ఒలింపిక్స్ లో రెండు పతకాల్ని అందుకున్న భారత వీరుడిగా నీరజ్ రికార్డును క్రియేట్ చేశారని చెప్పాలి. గత ఒలింపిక్స్ లో 87.58 మీటర్లతో స్వర్ణాన్ని సొంతం చేసుకోగా..తాజా పోటీలో 89.45 మీటర్లు విసిరినా.. పాక్ అథ్లెట్ అద్భుత ఆటకు రెండో స్థానానికి పరిమితం కావాల్సి వచ్చింది. రజతం సాధించిన నీరజ్ ను రాష్ట్రపతి ద్రూపది ముర్ము.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీలు తమ అభినందనలు తెలియజేశారు. భారత్ కలల్నినిజం చేశాడని కీర్తించారు.

Tags:    

Similar News