ఒక్క పరుగుతో నేపాల్ కల భగ్నం.. బ్యాడ్ లక్ కు పెద్దన్న చేతిలోనే
మన పొరుగు దేశం నేపాల్ గురించి తెలుసు కదా..? నాలుగైదు నెలల కిందట మంగోలియాతో టి20 మ్యాచ్ లో ఏకంగా 300పైగా రికార్డు స్కోరు కొట్టింది.
అసలే తక్కువ స్కోర్లు.. చిన్న జట్ల సంచలనాలు.. అటువైపేమో బ్యాడ్ లక్ కు పెద్దన్న లాంటి జట్టు.. ఈ నేపథ్యంలో టి20 ప్రపంచ కప్ లో ఓ మ్యాచ్ అత్యంత ఆసక్తి కలిగించింది. ఓ చిన్న జట్టు అడుగు ముందుకు వేస్తుందా? అనే సందర్భం ఎదురైంది. చివరకు అదేమీ జరగలేదు. ఆ జట్టు కల చెదిరింది..
ఈ మ్యాచ్ లో గెలిచి ఉంటే..
మన పొరుగు దేశం నేపాల్ గురించి తెలుసు కదా..? నాలుగైదు నెలల కిందట మంగోలియాతో టి20 మ్యాచ్ లో ఏకంగా 300పైగా రికార్డు స్కోరు కొట్టింది. ఈ జట్టు ప్రస్తుతం టి20 ప్రపంచ కప్ లో ఆడుతోంది. గ్రూప్ డిలో దక్షిణాఫ్రికా, శ్రీలంక, బంగ్లాదేశ్ లతో పాటు ఈ జట్టూ ఉంది. శ్రీలంకతో మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. బంగ్లాతో ఆడాల్సి ఉంది. అయితే, నేపాల్ కు కాస్త ‘సూపర్-8’ ఆశలు ఉన్నాయి. కానీ, దక్షిణాఫ్రికా ఒకే ఒక్క పరుగుతో వాటిని కూల్చేసింది.
శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్ లో తొలుత దక్షిణాఫ్రికా 20 ఓవర్లకు 7 వికెట్లు నష్టపోయి 115 పరుగులు చేసింది. కానీ, నేపాల్ ను సఫారీ బౌలర్ షంసీ దెబ్బకొట్టాడు. ఇన్నింగ్స్ 8వ ఓవర్లో ఒకే ఓవర్ లో రెండు వికెట్లు, 18వ ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టాడు. అప్పటికీ ఆఖరి ఓవర్ లో విజయానికి 8 పరుగులు అవసరం. దక్షిణాఫ్రికా బౌలర్ బార్ట్ మన్.. నేపాల్ బ్యాటర్లను కట్టడి చేశాడు. చివరి బంతికి రెండు పరుగులు చేయాల్సి ఉండగా.. గుల్సాన్ ఝాను ఔట్ చేశాడు. దీంతో ఒక్క పరుగు తేడాతో దక్షిణాఫ్రికా నెగ్గింది. ఈ మ్యాచ్లో నేపాల్ గెలిస్తే సూపర్-8 రేసులో ఉండేది.
నేపాల్ చివరి 16 బంతుల్లో 4 వికెట్లు కోల్పోవడంతో పెద్ద సంచలనం రేపే అవకాశం కోల్పోయింది. అసలు దక్షిణాఫ్రికా జట్టుకు బ్యాడ్ లక్ టీమ్ అన్న పేరుంది. ఒత్తిడిలో పూర్తిగా చేతులెత్తేస్తుంది. లేదా వర్షం వచ్చి ఆ జట్టును దెబ్బకొడుతుంది. కానీ, ఈ సారి టి20 ప్రపంచ కప్ లో నిలకడగా ఆడుతోంది.