ఇరుగు దిష్టి.. పొరుగు దిష్టి.. న్యూజిలాండ్ స్టార్ కు బామ్మ దిష్
న్యూజిలాండ్ క్రికెట్ జట్టులో అనూహ్యంగా చోటు దక్కించుకుని చెలరేగిపోతున్నాడు భారత సంతతికి చెందిన ఆల్ రౌండర్ రచిన్ రవీంద్ర.
తండ్రి పుట్టింది భారత దేశంలో.. ఉద్యోగ రీత్యా సెటిలైంది వేరే దేశంలో.. అతడికి కొడుకు పుట్టింది అదే దేశంలో.. ఆ కుమారుడు పెరిగి పెద్దయి.. ఆ దేశ జాతీయ క్రికెటర్ అయి.. నాన్న పుట్టిన దేశంలో రికార్డుల దుమ్ము దులుపుతూ ఉంటే, అందరి కళ్లూ అతడిపై పడినందున పూర్వీకుల సొంత ఊరిలో నానమ్మ ఇంటిలో దిష్టి తీస్తే..? అతడెంత లక్కీ ఫెలోనో కదా..? లక్ కంటే మించిన పదం ఏమైనా ఉంటే ఈ సన్నివేశానికి ఆ పేరు పెట్టాలేమో..? ఎందుకంటే, ఇది అందరికీ దక్కే భాగ్యం కాదు.
నాన్న పుట్టిన ఊరిలో..
న్యూజిలాండ్ క్రికెట్ జట్టులో అనూహ్యంగా చోటు దక్కించుకుని చెలరేగిపోతున్నాడు భారత సంతతికి చెందిన ఆల్ రౌండర్ రచిన్ రవీంద్ర. భారత సంతతికి చెందిన జీతన్ పటేల్, ఇష్ సోథి తదితర క్రికెటర్లు ఇప్పటికే ఆ జట్టుకు ఆడినా.. వారెవరికీ రాని పేరు ప్రతిష్ఠలు రచిన్ వచ్చాయి. కారణం.. అతడు బ్యాటింగ్ లో దుమ్మురేపుతుండడమే. ప్రపంచ కప్ నకు ముందే రచిన్ న్యూజిలాండ్ కు 15 వన్డేల వరకు ఆడాడు. కానీ, వాటిలో పెద్దగా రాణించలేదు. అయితే, భారత్ వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో మాత్రం టాప్ ఆర్డర్ లో వస్తూ సెంచరీల మీద సెంచరీలు కొడుతున్నాడు. కేవలం 9 మ్యాచ్ లలోనే 565 పరుగులు చేశాడు. ప్రపంచ మేటి బ్యాట్స్ మన్ అయిన డికాక్(550), కోహ్లి(543), వార్నర్(446), రోహిత్ శర్మ(442)లను మించి పరుగులు చేయడం విశేషం. కాగా, రచిన్ తండ్రి రవి క్రిష్ణమూర్తి స్వస్థలం బెంగళూరు. అతడు సాఫ్ట్ వేర్ ఇంజనీరు. 1997లో.. అంటే రచిన్ పుట్టేందుకు రెండేళ్ల ముందు న్యూజిలాండ్ వెళ్లిపోయి అక్కడే స్థిరపడ్డాడు. ఇక రచిన్.. 1999లో పుట్టాడు. వెల్లింగ్టన్ లో పెరిగాడు. రవి క్రిష్ణమూర్తి వయసు 50 ఏళ్లుంటుంది. సహజంగానే తన యుక్త వయసులో ఉన్నప్పుడు టీమిండియాకు ఆడిన సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్ లకు వీరాభిమాని. అందుకే వారిద్దరి పేర్లూ కలిసి వచ్చేలా రచిన్ (రాహుల్ + సచిన్) అని కుమారుడికి పేరు పెట్టాడు.
అనుకోకుండా ఆడుతూ
లోయరార్డర్ లో కొన్ని పరుగులైనా చేసే స్పిన్ ఆల్ రౌండర్ గా పనికొస్తాడని రచిన్ ను జట్టులోకి ఎంపిక చేశారు. అయితే, అనుకోకుండా టాపార్డర్ లో బ్యాటింగ్ కు దింపాల్సి వచ్చింది. జట్టు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ వస్తున్నాడు. అరంగేట్రంలోనే వరల్డ్ కప్ లో 3 సెంచరీలు చేసిన ఆటగాడిగా చరిత్ర లిఖించాడు. విశేషం ఏమంటే.. తన పూర్వీకుల ఊరైన బెంగళూరులోనే ఈ రికార్డు సృష్టించడం. ఈ నెల 4న పాకిస్థాన్ తో మ్యాచ్ లో అతడీ అద్భుతం చేశాడు. న్యూజిలాండ్ తరఫున ఒకే ప్రపంచ కప్ లో అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు కూడా నమోదు చేశాడు. మరో 14 పరుగులు చేస్తే ఒక ప్రపంచకప్ లో అత్యధిక పరుగులు చేసిన కివీస్ బ్యాటర్ గానూ ఖ్యాతికెక్కుతాడు. ఈ రికార్డు ప్రస్తుతం కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ (578 పరుగులు) పేరిట ఉంది. గత ప్రపంచ కప్ లో కేన్ దీనిని నెలకొల్పాడు.
ఇరుగు దిష్టి.. పొరుగు దిష్టి..
ఈ ప్రపంచ కప్ లో న్యూజిలాండ్ బెంగళూరులో రెండు లీగ్ మ్యాచ్ లు ఆడింది. ఒకటి ఈ నెల 4న పాకిస్థాన్ పై కాగా, రెండోది గురువారం శ్రీలంకపై. పాక్ పై రచిన్ అద్భుత శతకం చేశాడు. లంకపైనా మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. పూర్వీకుల నగరంలో చిరస్మరణీయ ఇన్నింగ్స్ లతో భళా అనిపించాడు. ఈ రెండు మ్యాచ్ లకూ రచిన్ నానమ్మ, తాతయ్య హాజరవడం అతడి లక్. అయితే, తాజాగా రచిన్ కు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ గా మారింది. బెంగళూరులో తన నానమ్మ అతడికి దిష్టి తీసింది. న్యూజిలాండ్ తన జాతీయత అయినప్పటికీ, భారతీయ మూలాలను మరువను అని చెప్పిన రచిన్.. బుద్ధిగా కూచున్నాడు. దీన్ని చూసినవారు అతడు భారతీయ సంప్రదాయాలను విస్మరించడం లేదని ప్రశంసిస్తున్నారు. పెద్దల పట్ల గౌరవంగా ఉంటున్నాడని కొనియాడుతున్నారు. అంతర్జాతీయ స్థాయి ఆటగాడు అయినా.. బామ్మకు మనవడే అని అంటున్నారు.