గాలివాటం కాదు, కొత్త కెరటం... ఆఫ్గాన్ సెమీస్ చేరాలంటే...?
అయితే... రన్ రేట్ విషయంలో కాస్త ఇబ్బందులు ఉన్నప్పటికీ.. ఒకటి రెండు అద్భుతాలు జరిగితే ఈ అద్భుతం జరగడం కూడా కష్టమేమీ కాదు!
డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ కు షాకిచ్చింది.. గాలివాటం అని కొంతమంది లైట్ తీసుకున్నారు. ఇంగ్లాండ్ ఫాం లో లేదులే అని సరిపెట్టుకున్నారు. కానీ వరుసగా పాకిస్థాన్, శ్రీలంక లాంటి మాజీ ఛాంపియన్లను మట్టికరిపించింది. దీంతో... ఇది గాలివాటం కాదు, కొత్త కెరటం అనే కామెంట్లు వినిపించాయి. ఈ స్థాయిలో బడా బడా టీంలను మట్టికరిపించిన ఆఫ్గాన్ టీంకి నెదర్లాండ్ దొరికింది. ఇంకేముంది... వాయించి వదిలింది!
అవును... నిబద్దత, కష్టపడే తత్వం, ఐకమత్యం, అలసత్వం వహించకపోవడం... వెరసి ఈ వరల్డ్ కప్ టోర్నీలో ఎవరూ ఊహించని రీతిలో ఆఫ్గనిస్తాన్ దూసుకుపోతుంది. ఇందులో భాగంగా ఇంగ్లాండ్, పాక్, లంకలతోపాటు తాజాగా నెదర్లాండ్స్ ను ఓడించింది. దీంతో ఆడిన ఏడు మ్యాచ్ లలోనూ నాలుగు మ్యాచ్ లు ఆడి పాయింట్ల పట్టికలో ఐదోస్థానంలో నిలిచింది. నాలుగో స్థానంలో ఉన్న న్యూజిలాండ్ కూడా 8 పాయింట్లే సాధించినా.. రన్ రేట్ బాగుంది!
ఈ టోర్నీలో ఇప్పటివరకూ 7 మ్యాచ్ లు ఆడిన ఆఫ్గనిస్తాన్.. 4 విజయాలు సాధించి, పట్టికలో అయిదో స్థానంలో ఉంది. ఈ లెక్కన చూసుకుంటే... అఫ్గాన్ సెమీస్ రేసులో ఉన్నట్లే అనిపిస్తుంది. అయితే... రన్ రేట్ విషయంలో కాస్త ఇబ్బందులు ఉన్నప్పటికీ.. ఒకటి రెండు అద్భుతాలు జరిగితే ఈ అద్భుతం జరగడం కూడా కష్టమేమీ కాదు!
ప్రస్తుతానికి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లు కూడా నాలుగేసి విజయాలే సాధించాయి. ఇక ఏడుకు ఏడు మ్యాచ్ ల్లో నెగ్గిన భారత్ సెమీస్ బెర్తును సొంతం చేసుకోగా.. 7 మ్యాచ్ ల్లో 6 నెగ్గిన దక్షిణాఫ్రికా దగ్గర్లో ఉంది. ఇక మిగతా రెండు బెర్తులకు ఆసీస్ (6 మ్యాచ్ ల్లో 4 విజయాలు), కివీస్ (7 మ్యాచ్ ల్లో 4 విజయాలు) గట్టి పోటీదారులుగా ఉన్నాయి.
ఈ సమయంలో... వీటిని దాటి అఫ్గాన్ ముందుకెళ్లాలంటే.. తన చివరి రెండు మ్యాచ్ ల్లో ఒక్కటైనా నెగ్గాలి. ఈ క్రమంలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాల విషయంలో ఆఫ్గన్ అద్భుతం చేయగలిగితే.. అది కూడా కాస్త మెరుగైన రన్ రేట్ సంపాదిస్తే... ఆఫ్గాన్ జట్టు సెమీస్ లో అడుగుపెట్టడం కన్ ఫాం. అయితే... ప్రాక్టికల్ గా అది అంత ఈజీ కాకపోవచ్చనే కామెంట్లు ఈ సందర్భంగా వినిపిస్తున్నాయి.
కాగా... ప్రపంచకప్ లో అఫ్గానిస్థాన్ తన దూకుడు కొనసాగుతోంది. ఇందులో భాగంగా తాజాగా నెదర్లాండ్స్ ను ఓడించింది. దీంతో వరుసగా మూడు విజయాలు సాధించి హ్యాట్రిక్ కొట్టింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ జట్టు 46.3 ఓవర్లలో 179 పరుగులకు ఆలౌటైంది. నెదర్లాండ్స్ బ్యాటర్లలో ఓడౌడ్ (42), సిబ్రాండ్ (58)లు రాణించారు. ఇద్దరూ రనౌట్స్ గానే వెనుదిరిగడం గమనార్హం.
ఇక ఆఫ్గాన్ బౌలర్లలో "మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్" మహ్మద్ నబి (3/28), నూర్ అహ్మద్ (2/31)లు మెరుగైన బౌలింగ్ వేశారు. అంతకంటే ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఆఫ్గాన్ ఫీల్డింగ్ గురించి! కారణం నెదర్లాండ్ బ్యాటర్స్ నలుగురు రనౌట్ అయ్యారు. ఇందులో నెదర్లాండ్స్ బ్యాటర్ల బాధ్యతారాహిత్యం కంటే... అఫ్గాన్ ఫీల్డింగ్ కే ఇక్కడ మార్కులు పడ్డాయి!
ఇక ఛేదనలో అఫ్గానిస్థాన్ 31.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. కెప్టెన్ హష్మతుల్లా షాహిది (56 నాటౌట్: 64 బంతుల్లో 6×4), రహ్మత్ షా (52: 54 బంతుల్లో 8×4) అర్ధశతకాలతో జట్టును గెలిపించారు. నెదర్లాండ్ బౌలర్స్ లో వాన్ బీక్ ఒక వికెట్ తీసుకున్నాడు.