పొడగరి పేసర్ షహీన్.. రికార్డు బ్రేకింగ్

పొరుగు దేశం పాకిస్థాన్ వన్డే ప్రపంచ కప్ లో తీవ్ర కష్టాల్లో ఉంది. ఆరు మ్యాచ్ లకు గాను రెండింటిలోనే గెలిచింది.

Update: 2023-10-31 13:30 GMT

పొరుగు దేశం పాకిస్థాన్ వన్డే ప్రపంచ కప్ లో తీవ్ర కష్టాల్లో ఉంది. ఆరు మ్యాచ్ లకు గాను రెండింటిలోనే గెలిచింది. చిరకాల ప్రత్యర్థి భారత్ తో సహా మూడు మ్యాచ్ లలో ఓటమిపాలైంది. ఆ జట్టు సెమీస్ చేరడం కష్టమేనని చెప్పొచ్చు. కానీ, అనేక సమీకరణాల రీత్యా చూస్తే పాకిస్థాన్ ఇంకా సెమీఫైనల్ రేసులోనే ఉందనేది స్పష్టం. మంగళవారం ఏడో లీగ్ మ్యాచ్ లో బంగ్లాదేశ్ తో తలపడుతోంది పాకిస్థాన్. ఆ జట్టు తొలుత బౌలింగ్ చేస్తున్న ఈ మ్యాచ్ లో మెరుగ్గా కనిపిస్తోంది. ఈ క్రమంలో పాకిస్థాన్ స్టార్ పేసర్ ఓ ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు.

పొడగరి.. పేస్ పెద్ద దిక్కు

భారత్ లో ప్రపంచ కప్ ప్రారంభానికి ముందు వరకు పాకిస్థాన్ ఫేవరెట్ జట్లలో ఒకటి. కానీ, ఆ జట్టు ప్రయాణం ఏమాత్రం సజావుగా సాగలేదు. భారత్ తో పేలవంగా ఆడి ఓడిపోయింది. వాస్తవానికి నెదర్లాండ్స్, శ్రీలంకలతో హైదరాబాద్ ఉప్పల్ లో జరిగిన మ్యాచ్ లలో సునాయాసంగా గెలిచిన పాక్.. ప్రపంచ కప్ సెమీస్ చేరడం పక్కా అని భావించారు. కానీ, భారత్ తో పాటు ఆ తర్వాత నాలుగు మ్యాచ్ లలోనూ ఓడిపోయి ఇంటిముఖం దిశగా ఉంది. ఆ జట్టులో ఇప్పటివరకు ఆకట్టుకున్న ఆటగాడు ఎవరంటే మాత్రం ఆరు అడుగులు పైగా పొడవుండే పేసర్ షహీన్ షా ఆఫ్రిది.

పోరాడింది.. కానీ,

సాంకేతికంగా ఆరు మ్యాచ్ లకు గాను నాలుగింటిలో పాకిస్థాన్ ఓడిపోయి ఉండొచ్చు. అయితే, ఆ జట్టు మరీ ఏమంత చెత్తగా ఆడలేదు. ఆస్ట్రేలియాపై భారీ స్కోరును దాదాపు ఛేదించినంత పని చేసింది. అఫ్గానిస్థాన్ పై చివర వరకు పోరాడింది. దక్షిణాఫ్రికాతో అయితే లక్ కలిసిరాలేదు. వీటిలో ఏ రెండు మ్యాచ్ లు గెలిచి ఉన్నా, పాకిస్థాన్ సెమీస్ ఆశలు సజీవంగా ఉండేవి. కాగా, పాకిస్థాన్ ఈ పరిస్థితికి కారణం రెండో ప్రధాన పేసర్ నసీమ్ షా లేకపోవడం. మొదటి ప్రాధాన్య పేసర్ షహీన్ షా ఆఫ్రిదితో కలిసి బంతిని పంచుకునే అతడు గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. దీంతో భారం మొత్తాన్ని ఆఫ్రిది మోస్తున్నాడు. ఈ క్రమంలో అతడు తన పాత్రకు న్యాయం చేస్తున్నాడు.

అరుదైన రికార్డు అందుకున్నాడు

షహీన్ సత్తా ఏమిటో మిగతా ప్రపంచానికి తెలుసు. అతడు గతేడాది గాయపడితే పెద్ద ఆందోళన వ్యక్తమైంది. కాగా, బంగ్లాదేశ్ తో మంగళవారం మ్యాచ్ లో తొలి ఓవర్ లో ఐదో బంతికే వికెట్ పడగొట్టి అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. వన్డే చరిత్రలో అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన బౌలర్‌గా చరిత్ర నెలకొల్పాడు. ఈ క్రమంలో పాకిస్తాన్ బౌలర్లలో ఇంతవరకు సాధ్యం కాని ఫీట్ నమోదు చేశాడు. కెరీర్ లో 51వ మ్యాచ్ ఆడుతున్న అతడు 100 వికెట్లు తీశాడు. అత్యంత వేగంగా ఈ ఫీట్ అందుకు పేసర్ ఆఫ్రిదీనే. ఆస్ట్రేలియా పేసర్ స్టార్క్ (52 మ్యాచ్ లలో 100 వికెట్లు) రికార్డును ఆఫ్రిది బద్దలు కొటాడు. కాగా, అతి తక్కువ మ్యాచ్ లలో వంద వికెట్ల ఘనత నేపాల్ వంటి పసికూన జట్టు ఆటగాడి పేరిట ఉండడం గమనార్హం. నేపాల్ స్పిన్నర్ సందీప్ లమిచానే.. 42 వన్డే మ్యాచ్‌లలో 100 వికెట్లు పడగొట్టాడు. కానీ, ఇతడు స్పిన్నర్. అఫ్ఘానిస్థాన్ మిస్టరీ స్పిన్నర్ రషీద్ ఖాన్ 44 వన్డేల్లో 100 వికెట్లు తీసి నంబర్ 2గా ఉన్నాడు. పాక్ మాజీ స్పిన్నర్ సక్లైన్ ముస్తాక్ 53 వన్డేల్లో 100 వికెట్లు తీసి ఐదో స్థానంలో ఉన్నాడు.

Tags:    

Similar News