పాక్ బౌలర్లకు చుక్కలు... రాహుల్, కోహ్లీ సెంచరీలు!

ఇందులో భాగంగా విరాట్ కోహ్లీ (122), కేఎల్ రాహుల్ (111) సెంచరీలు సాధించి నాటౌట్ గా నిలిచారు.

Update: 2023-09-11 13:49 GMT

పాకిస్థాన్‌ తో జరుగుతున్న ఆసియా కప్‌ - 2023 సూపర్‌-4 మ్యాచ్‌ లో ఇండియన్ బ్యాట్ మెన్స్ అదరగొట్టారు. పాకిస్థాన్ బౌలర్లను ఊచకోత కోశారు. ఇందులో భాగంగా విరాట్ కోహ్లీ (122), కేఎల్ రాహుల్ (111) సెంచరీలు సాధించి నాటౌట్ గా నిలిచారు. ఇలా మూడో వికెట్‌ కు ఆసియా కప్‌ లోనే అత్యధికంగా 233 పరుగులు జోడించారు.

దీంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన టీం ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 356 పరుగులు చేసింది. అంతకముందు కెప్టెన్ రోహిత్ శర్మ (56), శుభ్‌ మన్‌ గిల్ (58) హాఫ్ సెంచరీలు చేశారు. దీంతో పాకిస్థాన్ పై భారత్‌ కు ఇది అత్యుత్తమ స్కోరుగా మారింది.

కాగా... ఆసియాకప్‌ లో భారత్‌ వర్సెస్ పాకిస్థాన్‌ మ్యాచ్‌ లను వరుణుడు వెంటాడుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆదివారం జరగాల్సిన మ్యాచ్‌ మధ్యలో వర్షం అంతరాయం కలిగించడంతో సోమవారానికి వాయిదా పడింది. అయితే సోమవారం కూడా వర్షం పడటంతో... మ్యాచ్ పై అనుమానాలు మొదలయ్యాయి. అయితే సాయంత్రం 4:40కి మ్యాచ్ ప్రారంభమైంది.

ఆదివారం 24.1 ఓవర్ల వద్ద ఆగిపోయిన మ్యాచ్ సోమవారం తిరిగి మెల్లగా ప్రారంభమైంది. ఈ సమయంలో 25 ఓవర్లకు భారత్ స్కోరు 150 పరుగులకు రెండు వికెట్లు కోల్పోగా... అప్పటికి క్రీజ్‌ లో కోహ్లీ (9), కేఎల్ రాహుల్ (19) ఉన్నారు. ఈ సమయంలో 28వ ఓవర్ వరకూ విరాట్ బ్యాట్ నుంచి ఫోర్ చూడలేని పరిస్థితి.

అక్కడనుంచి కాస్త బ్యాట్ ఝులిపించిన ఈ ఇద్దరు స్టార్ బ్యాట్స్ మెన్స్ 30 ఓవర్ల సమయానికి వీరిద్దరూ కలిసి మూడో వికెట్‌ కు 52 పరుగులు జోడించారు. ఇలా 50 పరుగుల భాగస్వామ్యం అనంతరం రాహుల్ దూకుడు పెంచాడు. దీంతో 33 ఓవర్లకు ఇండియా స్కోరు రెండొందలకు చేరుకుంది.

ఈ క్రమంలో 34వ ఓవర్లో కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీ పూర్తి చేయగా... 39 ఓవర్లో విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ సాధించాడు. ఈ క్రమంలో 40 ఓవర్ల ఆట ముగిసే సరికి ఇండియా స్కోరు రెండు వికెట్లు కోల్పోయి 251 పరుగులు చేసింది. ఆ సమయానికి కేఎల్ రాహుల్ (72), విరాట్ కోహ్లీ (57) ధాటిగా ఆడుతున్నారు.

ఇక 45ఓవర్లు చేరే సరికి కేఎల్ రాహుల్ (95), విరాట్ కోహ్లీ (83) దూకుడుగా ఆడేయడంతో భారత్ స్కోరు 300కి చేరింది. అప్పటికి వీరిద్దరూ మూడో వికెట్‌ కు 177 పరుగులు జోడించారు. ఈ క్రమంలో 47వ ఓవర్లో కేఎల్ రాహుల్ సెంచరీ చేయగా... అదే ఓవర్లో కోహ్లీ కూడా తన 47వ శతకం పూర్తిచేసుకున్నాడు. దీంతో ముందుగా బ్యాటింగ్‌ చేసిన టీం ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో రెండు వికెట్లకు 356 పరుగులు చేసింది.

Tags:    

Similar News