48 ఏళ్ల ప్రపంచకప్ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డు... పాక్ బౌలర్ సొంతం!
స్టార్ బౌలర్ హారిస్ రవూఫ్ 48ఏళ్ల ప్రపంచ కప్ చరిత్రలో అత్యంత చెత్త రికార్డ్ సృష్టించాడు.
భారత్ వేదికగా జరుగుతున్న వన్ డే ప్రపంచ కప్ లో టీ ఇండియా తనదైన దూకుడుతో దూసుకుపోతుంటే... మరోపక్క దాయాదీ పాకిస్థాన్ జట్టు పేలవ ప్రదర్శన కనబరిచింది. ఆడిన 9 మ్యాచ్ లలోనూ 4 మాత్రమే గెలిచి 5 మ్యాచ్ లలో ఓడిపోయింది. ఫలితంగా పాయింట్ల పట్టికలో ఐదోస్థానంలో నిలిచింది. ఈ సమయంలో పాక్ బౌలర్లలో హారిస్ రవూఫ్ అత్యంత చెత్త రికార్డ్ సొంతం చేసుకున్నాడు.
అవును... అన్ని విభాగాల్లోనూ అత్యంత పేలవ ప్రదర్శన కనబరిచిన పాకిస్థాన్ జట్టులో స్టార్ బౌలర్ హారిస్ రవూఫ్ 48ఏళ్ల ప్రపంచ కప్ చరిత్రలో అత్యంత చెత్త రికార్డ్ సృష్టించాడు. ఈ వరల్డ్ కప్ లో ఏకంగా 500 లకు పైగా పరుగులు సమర్పించుకున్నాడు. ఈ ప్రపంచకప్ లో లీగ్ దశ పోటీల్లో ఆడిన 9 మ్యాచ్ లో హరీస్ రవూఫ్ 16 వికెట్లు తీసి 533 పరుగులు ఇచ్చాడు.
దీంతో వన్డే ప్రపంచకప్ లో ఒక ఎడిషన్ లో 500కు పైగా పరుగులు సమర్పించుకున్న నాలుగో బౌలర్ గా నిలిచాడు. ఈ టైపు రికార్డ్ ఇంతకుముందు ఇంగ్లండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ పేరు మీద ఉండేది. 2019 వన్డే ప్రపంచకప్ లో ఆదిల్ రషీద్ 526 పరుగులిచ్చాడు. అయితే తాజా వరల్డ్ కప్ లో హరీస్ రవూఫ్ 533 పరుగులు ఇచ్చి ఆ రికార్డును చెరిపేశాడు.
ఇక తాజాగా ఇంగ్లండ్ తో జరిగిన మ్యాచ్ లో హరీస్ రవూఫ్ 10 ఓవర్లూ బౌలింగ్ చేసి 3 వికెట్లు తీసి 64 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ మ్యాచ్ లో మహమ్మద్ వసీం 10 ఓవర్లూ బౌలింగ్ చేసి 2 వికెట్లు తీసి 72 పరుగులు సమర్పించుకోగా... షహీన్ షా సైతం 10 ఓవర్లలో 2 వికెట్లు తీసి 72 పరుగులు సమర్పించుకున్నాడు. అయితే ఓవరాల్ రికార్డ్ మాత్రం హరీస్ రవూఫ్ పేరునే ఉంది!
ఇక అంతక ముందు మ్యాచ్ లలోనూ ఇదే తరహాలో పరుగులు సమర్పించుకున్న హరీస్ రవూఫ్... నెదర్లాండ్స్ పై 43, శ్రీలంకపై 64, భారత్ పై 43, ఆస్ట్రేలియాపై 83, అఫ్ఘానిస్థాన్ పై 53, సౌతాఫ్రికాపై 62, బంగ్లాదేశ్ పై 36, న్యూజిలాండ్ పై 85 పరుగులు సమర్పించుకున్నాడు. ఇతని చెత్త రికార్డుల పరంపర అక్కడితో ఆగిపోయిందనుకుంటే పొరపాటే.
ఒక ప్రపంచకప్ ఎడిషన్ లో అత్యధిక సిక్సులు ఇచ్చిన బౌలర్ గా కూడా హరీస్ రవూఫ్ రికార్డును మూటగట్టుకున్నాడు. ఇందులో భాగంగా ఈ టోర్నీ లో ఆడిన 9 మ్యాచ్ ల్లో ఏకంగా 16 సిక్స్ లు సమర్పించుకున్నాడు. దీంతో 2015 వన్డే ప్రపంచకప్ లో 15 సిక్స్ లు ఇచ్చిన జింబాబ్వే బౌలర్ తినాషే పణ్యంగారా రికార్డును హరీస్ రవూఫ్ అధిగమించాడు.
ఇలా ఒకే ఎడిషన్ లో భారీ పరుగులు, అత్యధిక సిక్సులు ఇచ్చిన బౌలర్ గా రవూఫ్ నిలిచాడు. కాగా... ఈ ప్రపంచకప్ లో సౌతాఫ్రికా నుంచి క్వింటన్ డికాక్ (591), న్యూజిలాండ్ నుంచి రచిన్ రవీంద్ర (565), ఇండియా నుంచి విరాట్ కోహ్లీ (543) 500కు పైగా పరుగులు చేసిన జాబితాలో నిలిచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రవూఫ్ మాత్రం 500 పరుగులు ఇచ్చిన జాబితాలో నిలిచాడు.