పాక్ కోచ్ పక్కదారిమాటలు... ఆరు నెలల సహవాస ఫలితమా?

ఆరు నెలలు సావాసం చేస్తే వారు వీరు అవుతారని అంటుంటారు. చాలా సందర్భాల్లో ఇది నిజమేమో అనిపిస్తుంటుంది.

Update: 2023-10-15 08:16 GMT

ఆరు నెలలు సావాసం చేస్తే వారు వీరు అవుతారని అంటుంటారు. చాలా సందర్భాల్లో ఇది నిజమేమో అనిపిస్తుంటుంది. సైంటిఫిక్ గా కూడా ఇందుకు అవకాశం లేకపోలేదనే మాటలు వినబడుతుంటాయి. ఈ నేపథ్యంలో శ్రీలంక పై రికార్డ్ చేజింగ్ చేసి ఓడించిన పాకిస్థాన్ లాంటి బ్యాంటింగ్ ఆర్డర్ ఉన్న టీం ని టీం ఇండియా బౌలర్లు పసికూనలుగా మార్చినట్లు జరిగిన తాజా మ్యాచ్ పై మికీ ఆర్థర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కాదు కాదు అక్కసు వెళ్లగక్కాడు!

అవును... ఒక బిడ్డ తప్పు చేశాడంటే ఆ నేరం వారి తల్లితండ్రులది, అదే విధంగా ఒక పౌరుడు తప్పుచేశాడంటే ఆ నేరం పోలీసులది అని ఏదో సినిమాలో పోలీస్ ఆఫీసర్ చెప్పిన డైలాగ్ గుర్తుకు వచ్చేలా... పాకిస్థాన్ ఓడిపోవడంతో రగిలిపోతున్నాడు ఆ దేశ కోచ్ మికీ ఆర్ధర్! సరే రగిలితే రగిలాడు... వారి ఓటమికి ఇండియా క్రికెట్ అభిమానులు కూడా ఒక కారణం అన్నట్లుగా ఓ పులుపెక్కిపోతున్నాడు!

తాజాగా అహ్మదాబాద్ లో జరిగిన ఇండియా – పాకిస్థాన్ వరల్డ్ కప్ వన్ డే ఇంటర్నేషనల్ మ్యాచ్ లో పాక్‌ ను చిత్తు చేసిన భారత్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోకి దూసుకెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో సుమారు 1.10లక్షల మంది ప్రేక్షకులు ప్రత్యక్షంగా వీక్షించిన ఈ మ్యాచ్‌ సరికొత్త రికార్డులనూ సృష్టించింది. వీరిలో సుమారు 99 శాతం అభిమానులు బ్లూ జెర్సీలతోనే కనిపించారు.

ఈ నేపథ్యంలో మ్యాచ్‌ లో ఓటమి అనంతరం పాక్‌ కోచ్‌ మికీ ఆర్థర్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ మ్యాచ్‌ ను చూస్తుంటే ఐసీసీ ఈవెంట్‌ జరిగినట్లు లేదని.. బీసీసీఐ ఈవెంట్‌ వాతావరణం కనిపించిందని వ్యాఖ్యానించాడు. ఈ మ్యాచ్‌ సందర్భంగా ఒక్కసారి కూడా పాకిస్థాన్‌ జట్టుకు అనుకూలంగా మద్దతు లభించలేదని చెప్పుకోచ్చాడు. ఇదే క్రమంలో... ఇది కూడా తమ జట్టు ఓటమికి ఓ కారణం కావచ్చని చెప్పుకొచ్చాడు.

దీంతో... ఈ కామెంట్లపై మిగిలిన వారికంటే ముందు పాక్ మాజీలు స్పందించారు. ఇందులో భాగంగా... పాక్‌ మాజీ పేసర్ వసీం అక్రం విమర్శలు గుప్పించాడు. అతడు ఎందుకు ఇలాంటి స్టేట్‌ మెంట్‌ ఇచ్చాడో అర్థం కావడం లేదని.. కుల్‌ దీప్‌ లేదా ఇతర భారత బౌలర్ల బౌలింగ్‌ ను ఎదుర్కొనేందుకు పాక్ వద్ద ప్రణాళికలు ఏంటనేది తాము వినాలనుకుంటున్నామని అన్నారు.

అనంతరం... గెలుపోటములు సహజమే కానీ, ఎందుకు ఓడిపోయామనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉందని, ఆ తర్వాత సరిదిద్దుకోవాలని అక్రం తనదైన శైలిలో సూచించాడు. ఇదే సమయంలో వసీం అక్రం వ్యాఖ్యలకు మద్దతుగా మరో మాజీ ఆటగాడు మొయిన్‌ ఖాన్‌ కూడా స్పందించాడు. భావోద్వేగ వ్యాఖ్యలు చేయడం వల్ల సానుభూతి పొందాలని చూస్తున్నట్లుంది.. కోచింగ్‌ వృత్తిపై దృష్టిసారిస్తే బాగుంటుంది అని తెలిపారు.

Tags:    

Similar News