పారా ఒలంపిక్స్ లో ఒకే రోజులో 7 పతకాలు
అంచనాలకు మించి అదరగొట్టేస్తున్నారు మన దివ్యాంగ క్రీడాకారులు.
అంచనాలకు మించి అదరగొట్టేస్తున్నారు మన దివ్యాంగ క్రీడాకారులు. ఇప్పటికే పలువురు క్రీడాకారులు పతకాలతో తమ సత్తా చాటగా.. తాజాగా రోజులో ఏకంగా 7 పతకాల్ని సాధించటం ద్వారా భారత సత్తాను చాటారు. ఈ ఏడు పతకాల్లో రెండు స్వర్ణం కావటం విశేషం. మిగిలిన ఐదు పతకాల విషయానికి వస్తే ఇందులో మూడు రజతాలు.. రెండు కాంస్యాలు కావటం విశేషం.
తొలిసారి పారాలింపిక్స్ లో ఆడుతున్న షట్లర్ నితేశ్ కుమార్ బంగారుపతకంతో అదరగొట్టేశారు. మూడేళ్ల క్రితం టోక్యో పారాలింపిక్స్ లో స్వర్ణాన్ని సొంతం చేసుకున్న జావెలిన్ త్రోయర్ సుమిత్ అంటిల్ తన మేజిక్ ను మరోసారి రిపీట్ చేశారు. దీంతో దేవేంద్ర ఝుఝూరియా.. అవని లేఖరా తర్వాత పారాలింపిక్స్ లో రెండు స్వర్ణ పతకాల్ని గెలిచిన మూడో భారత ప్లేయర్ గా సుమిత్ అంటిల్ గుర్తింపు పొందారు. మొత్తంగా పారిస్ పారాలింపిక్స్ లో ఇప్పటివరకు భారత్ 3 స్వర్ణాలు.. 5 రజతాలు.. 6 కాంస్యాలతో కలిపి మొత్తం 14 పతకాల్ని సొంతం చేసుకుంది. పతకాల పట్టికలో 14వ స్థానంలో నిలిచింది.
సోమవారం పతకాల్ని సొంతం చేసుకున్న వారి విషయానికి వస్తే..
- జావెలిన్ త్రో ఎఫ్64 కేటగిరీలో డిఫెండింగ్ ఛాంపియన్ సుమిత్ అంటిల్ తన పసిడి పతకాన్ని నిలుపుకున్నారు.
- డిస్కస్ త్రోలో ఎఫ్56 కేటగిరీలో భారత అథ్లెట్ యోగేశ్ కథునియా రజతాన్ని సొంతం చేసుకున్నారు.
- పురుషుల బ్యాడ్మింటన్ సింగిల్స్ ఎస్ఎల్ 3 కేటగిరీలో నితేశ్ కుమార్ ఛాంపియన్ గా అవతరించి స్వర్ణాన్ని సొంతం చేసుకున్నారు. బ్రిటన్ కు చెందిన డేనియల్ బెథెల్ తో జరిగిన ఫైనల్ పోరులో సత్తా చాటారు.
- పురుషుల బ్యాడ్మింటన్ సింగిల్స్ ఎస్ఎల్4 కేటడిరీలో ఐఏఎస్ అధికారి సుహాస్ యతిరాజ్ రజత పతకాన్ని సాధించారు. గత టోక్యో పారాలింపిక్స్ లోనూ రన్నరప్ గా నిలిచిన సుహాస్ ఈసారీ రెండో స్థానంలో నిలిచారు.
- మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్ ఎస్ యు5 కేటగిరీలో తులసిమతి రజతాన్ని సొంతం చేసుకున్నారు.
- ఇదే కేటగిరిలో మనీషా రామదాస్ కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్నారు.
- అర్చరీ మిక్స్ డ్ కాంపౌండ్ టీం విభాగంలో శీతల్ దేవి - రాకేశ్ కుమార్ జంట కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది.