వరల్డ్ కప్ లో ఆలస్యం.. అయినా అదిరే ఆట
భారత్ ఏకైక వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచ కప్ తుది అంకానికి వచ్చింది. మరొక్క పది రోజుల్లో ప్రపంచ విజేత ఎవరో తేలిపోతుంది.
భారత్ ఏకైక వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచ కప్ తుది అంకానికి వచ్చింది. మరొక్క పది రోజుల్లో ప్రపంచ విజేత ఎవరో తేలిపోతుంది. ఇక ఇప్పటికే మూడు జట్లు సెమీ ఫైనల్స్ దశకు చేరుకున్నాయి. మరొక్క జట్టు ఏదనేది తేలాల్సి ఉంది. ఇందుకోసం న్యూజిలాండ్, పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్ రేసులో ఉన్నాయి. ఇప్పటికైతే వేటి అవకాశాలనూ కొట్టి పారేయలేం. మంగళవారం నాటి ఆస్ట్రేలియా-అఫ్ఘానిస్థాన్ మ్యాచ్ దీనికి నిదర్శనం.
లేట్ ఎంట్రీ.. దుమ్మురేపే ఆట
టీమిండియా పేసర్ మొహమ్మద్ షమీ.. ఈ ప్రపంచ కప్ లో ఎలాంటి ప్రదర్శన చేస్తున్నాడో అందరికీ తెలిసిందే. న్యూజిలాండ్ తో మ్యాచ్ లో తప్పనిసరై అతడిని జట్టులోకి తీసుకుంటే ఏకంగా ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. నాడు గనుక షమీ లేకుంటే టీమిండియా గెలుస్తుందని చెప్పలేని పరిస్థితి. ఆ వెంటనే ఇంగ్లండ్ తో జరిగిన మ్యాచ్ లోనూ అతడు నాలుగు వికెట్లతో చెలరేగాడు. ఆపై శ్రీలంక పైనా ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. మొన్న దక్షిణాఫ్రికాపై రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. మొత్తమ్మీద నాలుగు మ్యాచ్ ల్లోనే 16 వికెట్లు తీశాడంటే అతడే స్థాయిలో ఆడుతున్నాడో తెలిసిపోతోంది. కానీ, షమీ.. ప్రపంచ కప్ లో టీమిండియా ఆడిన మొదటి నాలుగు మ్యాచ్ లలో లేడనే సంగతి తెలుసా? ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా గాయం, మూడో పేసర్ గా శార్దూల్ ఠాకూర్ ను నమ్మలేని పరిస్థితుల్లో షమీని తుది జట్టులోకి తీసుకున్నారు.
ఫఖడ్ గా నిలిచాడు జమాన్..
పాకిస్థాన్ తరఫున వన్డేలో డబుల్ సెంచరీ చేసిన ఏకైక క్రికెటర్ ఫఖర్ జమాన్. అలా చెబితే ఎవరికీ గుర్తుండదు.. 2017 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో సెంచరీతో భారత్ పై పాకిస్థాన్ గెలుపునకు కారణమైన బ్యాట్స్ మన్ ఫఖర్ జమాన్ అంటే అందరికీ గుర్తుంటుంది. ఇంకా చెప్పాలంటే మొన్న బెంగళూరులో న్యూజిలాండ్ తో మ్యాచ్ లో సిక్సులతో చెలరేగి జట్టును గెలిపించిన (డక్ వర్త్ లూయీస్ ప్రకారం అయినప్పటికీ) జమాన్ అంతకుముందు బంగ్లాదేశ్ తో మ్యాచ్ లోనూ 81 పరుగులు చేశాడు. పాకిస్థాన్ ఇంకా సెమీస్ రేసులో ఉందంటే జమానే కారణం. కానీ, అతడు ప్రపంచ కప్ లో ఇప్పటికి ఆడింది మూడు మ్యాచ్ లే. గత సిరీస్ లలో విఫలం కావడంతో జమాన్ ను తుది జట్టులోకి తీసుకోలేదు. అయితే, మరో ఓపెనర్ ఇమాముల్ హక్ వైఫల్యంతో జమాన్ కు చోటుదక్కింది.
లబుషేన్ ఎంపిక భలే చిత్రం
ఆస్ట్రేలియా నాలుగో నంబరు బ్యాట్స్ మన్ మార్నస్ లబుషేన్ అసలు ప్రపంచ కప్ జట్టుకే (15 మంది సభ్యుల) ఎంపికవలేదు. ఇంకా చెప్పాలంటే 17 మంది సభ్యుల ప్రాబబుల్స్ లోనే లేడు. యాషెస్ సిరీస్ లో వైఫల్యంతో అతడిని జట్టు నుంచి తప్పించారు. కానీ, ట్రావిస్ హెడ్ గాయపడడం, అదే సమయంలో దక్షిణాప్రికాతో వన్డే సిరీస్ లో లబుషేన్ రాణించడంతో ప్రపంచ కప్ జట్టులోకి తీసుకున్నారు. లబుషేన్ కోసం స్పిన్నర్ ను పక్కనపెట్టారు. చివరకు అతడే ఈ ప్రపంచ కప్ లో ఆస్ట్రేలియా బ్యాటింగ్ కు మూలంగా మారాడు. రెండు అర్ధ సెంచరీలతో పాటు రెండు మూడు కీలక ఇన్నింగ్స్ ఆడాడు.