మంచి ‘మను’సున్న డబుల్లెట్.. సింధు రక్షణకు ఫేక్ ప్రొఫైల్

సమాజంలోని ప్రముఖులపై సోషల్ మీడియా వేదికగా బురదజల్లడం కొందరికి ఓ అలవాటుగా మారింది.

Update: 2024-07-31 07:55 GMT

సమాజంలోని ప్రముఖులపై సోషల్ మీడియా వేదికగా బురదజల్లడం కొందరికి ఓ అలవాటుగా మారింది. వారిలోని భావోద్వేగాలను వారి ఆలోచనా ధోరణిని బయటపెట్టే ఇలాంటి ఉదంతాలు ఎన్నో..? సోషల్ మీడియా ఎంతగా అందుబాటులోకి వస్తే అంతగా మారుతోంది ఈ దాడి.. దీనికి దేశం పేరును చాటే క్రీడాకారులు, సినిమా స్టార్ల వంటి కళాకారులు, ప్రజా సేవను ఎంచుకున్న రాజకీయ నాయకులు ఇలా ఎవరూ మినహాయింపు కాదని స్పష్టమవుతోంది. ఇలానే తెలుగు స్టార్ షట్లర్ పూసర్ల వెంకట సింధు (పీవీ సింధు) కూడా ఓ దశలో ఇబ్బందిని ఎదుర్కొన్నారు. అయితే, అప్పట్లో ఆమెను రక్షించేందుకు భారత దేశ సంచలన బుల్లెట్ మన బాకర్ రంగంలోకి దిగిందట.

సింధు సాధించిన ఘనతల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే, ఆమెను ఆ మధ్య సోషల్ మీడియాలో కొందరు టార్గెట్ చేశారు. అయినా ఇలాంటివి పట్టించుకోకుండా ముందుకుసాగింది సింధు. అయితే, మను బాకర్‌ చూస్తూ ఊరుకోలేదట. సింధు కోసం ఫేక్ ప్రొఫైల్‌ ను క్రియేట్‌ చేసి.. అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న వారి నుంచి సింధును రక్షించినట్లు చెప్పుకొచ్చింది. తద్వారా అడ్డుకునే ప్రయత్నాలు చేసినట్లు వివరించింది. ఈ విషయం ప్రస్తుతం ఒలింపిక్స్ లో ఉన్న సింధుకు తెలిసింది. దీంతో నీ ‘మంచి మనసుకు థ్యాంక్స్. రెండు ఒలింపిక్‌ పతకాల క్లబ్‌ లోకి నీకు స్వాగతం. మేం కూడా నీ మార్గంలోనే ఉన్నాం’’ అని అభినందించింది.

కాగా, భారత క్రీడా చరిత్రలో గొప్ప క్రీడాకారుల గురించి తెలుసుకునేందుకు తాను ప్రయత్నం చేసినట్లు మను తెలిపింది. సింధు, ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్‌ చోప్రా గురించి తనకు బాగా తెలుసని వివరించింది. వారి శ్రమను అభినందించలేకుండా ఉండలేమని.. అందుకే సింధుకు రక్షణగా నిలిచినట్లు పేర్కొంది.

ఒలింపిక్స్ లో వరుసగా రెండు పతకాలు (2016లో రజతం, 2020లో కాంస్యం) నెగ్గిన పీవీ సింధు.. మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్ పోటీల్లో బుధవారం క్రిస్టిన్‌తో తలపడనుంది. గెలిస్తే క్వార్టర్స్‌ కు చేరుతుంది. మరోవైపు ఈ ఒలింపిక్స్ లో రెండు కాస్యాలు నెగ్గింది మను బాకర్. స్వతంత్ర భారతంలో.. ఒకే ఒలింపిక్స్‌ లో రెండు పతకాలు గెలిచిన తొలి అథ్లెట్‌ ఆమెనే.

ఎల్ఐసీ, బజాజ్ కు మను నోటీసులు

భారత జీవిత బీమా సంస్థ, బజాజ్ ఫుడ్స్స, ఫిట్ జీ సంస్థలకు మను బాకర్ నోటీసులిచ్చింది. ఈ సంస్థలు అనుమతి లేకుండా తన ఫొటోలు, వీడియోలు ఉపయోగిస్తున్నట్లు తెలిసి ఈ నిర్ణయం తీసుకుంది. ఆయా సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని పేర్కొంది. అయితే, ఇవే కాక మొత్తం 24 సంస్థలు మను ఫొటోలను వినియోగించినట్లు సమాచారం. మరి ప్రభుత్వ రంగ సంస్థ ఎల్ఐసీనే వదలని మను.. మిగతా సంస్థలను ఎందుకు ఉపేక్షిస్తుందో చూడాలి.

Tags:    

Similar News