ఇంటిముఖం పట్టిన టాప్ ఇండియన్ ప్లేయర్స్... ఓటమిపై సింధు కీలక వ్యాఖ్యలు!

ఎన్నో ఆశలు పెట్టుకున్న పారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు గురువారం బ్యాడ్ డే అనే చెప్పుకోవాలి

Update: 2024-08-02 06:14 GMT

ఎన్నో ఆశలు పెట్టుకున్న పారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు గురువారం బ్యాడ్ డే అనే చెప్పుకోవాలి. ఈ సందర్భంగా వరుసగా బ్యాడ్ న్యూస్ లు పారిస్ నుంచి భారత్ కు టెలీకాస్ట్ అయ్యాయి. ప్రధానంగా ఎన్నో ఆశలు పెట్టుకున్న ఇద్దరు తెలుగు తేజాలు అడియాశలు చేసిన పరిస్థితి. కచ్చితంగా ఈ సారి ఏదో ఒక పతకం తెస్తారని ఆశలు పెట్టుకున్న వేళ అవి గురువారం పారిస్ వేదికగా కూలిపోయాయి!

అవును... రియో, టోక్యో ఒలింపిక్స్ లో వరుసగా రజతం, కాంస్యం సాధించిన సింధు పై భారత్ ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఈసారి పారిస్ నుంచి కూడా ఏదో ఓ పతకం ఢిల్లీకి చేరడం ఖాయమనే కామెంట్లు వినిపించాయి. అయితే... ఆ ఆశలన్నీ గురువారం ఆవిరైపోయాయి. క్వార్టర్స్ కి కూడా చేరకుండానే పీవీ సింధు ఇంటిముఖం పట్టింది. చైనా అమ్మాయి హే బిన్ జియావో చేతిలో సింధు పరాజయం పాలైంది.

ఈ మ్యాచ్ లో ఆరంభంలో ఏకంగా 1-5తో వెనుకబడ్డ సింధు... బ్రేక్ టైం కి 10-11 వద్ద ఉంది. అయితే... ఆ తర్వాత సింధుకు హే బిన్ జియావో ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు.. పుంజుకునే పరిస్థితి కల్పించలేదు! దీంతో... 19-21, 14-21 తో చైనా అమ్మాయి చేతిలో సింధు పరాయజం పాలైంది. ఇక్కడ మనించాల్సిన విషయం ఏమిటంటే.. టోక్యోలో ఈ చైనా అమ్మాయిని ఓడించే సింధు కాంస్యం గెలుచుకుంది.

ఓటమిపై సింధు కీలక వ్యాఖ్యలు!:

ఈ సందర్భంగా స్పందించిన సింధు... డిఫెన్స్ లో తప్పులు చేయడం వల్ల ఓటమిపాలినట్లు వెల్లడించింది. విజయం కోసం శతవిధాలా ప్రయత్నించినట్లు తెలిపింది. అయితే... ఈ ఓటమికి తానేమీ పశ్చాత్తాప పడటం లేదు కానీ.. పోరాడుతూనే ఉంటానని వెల్లడించీంది. ఇదే క్రమంలో.. ఇక్కడ విజయం సాధించడం అంత సులువేం కాదని, ప్రతీ పాయింట్ ను కాపాడుకోవడం కష్టమే అని చెప్పుకొచ్చింది!

ఇదే సమయంలో వచ్చే ఒలింపిక్స్ గురించి ఇప్పుడే మాట్లాడటం అనవసరం అని చెప్పిన సింధు... ప్రస్తుతం కొద్ది రోజులు రెస్ట్ తీసుకుని, తిరిగి బరిలోకి దిగనున్నట్లు వెల్లడించింది. ఈ ఒలింపిక్స్ లో పతకం సాధించాలనే లక్ష్యంతోనే అడుగుపెట్టినా.. దురదృష్టవశాత్తు ఓడిపోయినట్లు తెలిపింది! అయితే... తాను మాత్రం గెలుపు కోసం తీవ్రంగా శ్రమించినట్లు వెల్లడించింది.

ఆంధ్ర కుర్రాడికి చుక్కెదురు!:

మరోపక్క... వరల్డ్ బ్యాడ్మింటన్ లో వేగంగా టాప్ ప్లేస్ కి చేరుకుని ఒలింపిక్స్ లో కచ్చితంగా దేశానికి ఏదో ఓ పతకం తెస్తాడన్నట్లు కనిపించిన ఆంధ్ర కుర్రాడు సాత్విక్ సాయిరాజ్ కు పారిస్ లో చుక్కెదురైంది. చిరాగ్ శెట్టితో కలిసి ఆడిన పురుషుల డబుల్స్ క్వార్టర్స్ లో ఒలింపిక్స్ నుంచి నిష్క్రమించాడు. గురువారం మలేషియా ద్వయంతో జరిగిన పోరులో ఈ సాత్విక్ - చిరాగ్ జంట 21-13, 14-21, 16-21తో ఓటమి పాలయ్యారు.

తెలంగాణ అమ్మాయికీ పంచ్ తప్పలేదు!

పారిస్ ఒలింపిక్స్ లో స్టార్ బాక్సర్ తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ కు షాక్ తప్పలేదు. మహిళల 50 కేజీల విభాగంలో ప్రీ క్వార్టర్స్ లో నిఖత్ పై 0-5 తేడాతో చైనా అమ్మాయి వు హు విజయం సాధించింది. దీంతో... పారిస్ ఒలింపిక్స్ లో నిఖత్ పతక ఆశలు ఆవిరైపోయాయి.

Tags:    

Similar News