రికార్డులే రికార్డులు: వెస్టిండీస్ పై కొహ్లీ... పాక్ పై వార్నర్!

ఈ సమయంలో కొహ్లీ సరసన వార్నర్ చేరాడు! ఇదే సమయంలో... ఓ ప్రపంచకప్‌ మ్యాచ్‌ లో సెంచరీలు చేసిన నాలుగో ఓపెనింగ్‌ జోడీగా వార్నర్‌ - మార్ష్‌ నిలిచారు.

Update: 2023-10-21 03:43 GMT

పాత ఆస్ట్రేలియా టీం మళ్లీ కనిపించింది! అసలు ఇది కదా ఆస్ట్రేలియా అంటే అనే కామెంట్లు వినిపించాయి! గిల్ క్రిస్ట్, మ్యాథ్యూ హెడెన్ లు ఓపెనింగ్ కి వచ్చి.. బంతిని ఎవరు గట్టిగా కొడతారు అనే పోటీ పెట్టుకున్నట్లుగా ఆడేవారు! ఎవరు కొట్టిన సిక్స్ ఎక్కువ దూరం వెళ్తుంది.. ఎవరు కొట్టిన ఫోర్ ఎక్కువ సౌడ్ వస్తుంది.. వంటి పొటీలు పెట్టుకున్నట్లుగా చెలరేగేవారు. ఈ వరల్డ్ కప్ లో ఒడిదుడుకులతో ప్రారంభమైన ఆసీస్... ఇది కదా ఆసిస్ అనే మ్యాచ్ ఒకటి ఆడింది! తాజాగా పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో ఆ ఫెర్ఫార్మెన్స్ చుపించింది.

అవును... చినస్వామీ స్టేడియంలో పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఓపెనర్లు వార్నర్‌, మార్ష్‌.. సిక్సర్లతో హోరెత్తించారు. ఇద్దరూ తలో తొమ్మిది సిక్స్ లు కొట్టారంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. ఫలితంగా ఇద్దరూ బాదిన ఫోర్లూ, సిక్సర్లే చెరో వందేసి పరుగులు తెచ్చాయి. అనంతరం జంపా, స్టాయినిస్‌ లు తమ బౌలింగ్ తో బెదిరించారు. ఇలా మొదట పరుగుల మోత మోగించి.. అనంతరం బంతితో బెంబేలెత్తించి ఘన విజయం నమోదు చేసింది.

టాస్‌ ఓడి బ్యాటింగ్‌ కు దిగిన ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌ ను వార్నర్ – మిచెల్ మార్ష్ లు ఊహించని రీతిలో మొదలుపెట్టారు. 10 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న వార్నర్... ఇక వెనుదిరిగి చూడలేదు! వార్నర్‌, మార్ష్‌ తొలి వికెట్‌ కు 259 పరుగులు జోడించారు. పేసర్‌, స్పిన్నర్‌ అనే తారతమ్యాలేమీ లేకుండా ఈ ఇద్దరూ పాక్ బౌలర్లపై ప్రతాపం చూపించారు.

ఇలా సాగిన వీరి దండయాత్ర... వార్నర్‌ 85 బంతుల్లో, ఆ వెంటనే మార్ష్‌ 100 బంతుల్లో శతకాలు అందుకున్నారు. సెంచరీ తర్వాత పుష్ప సినిమాలో "తగ్గేదేలే" అనే సంజ్ఞ చేసిన వార్నర్‌.. అనంతరం విరుచుకుపడిపోయాడు. వార్నర్ ను ఔట్ చేయడం సంగతి అలా ఉంచితే... బౌండరీ కొట్టని బాల్ వేయడమే లక్ష్యంగా పాక్ బౌలర్స్ ప్రయత్నించారన్నా అతిశయోక్తి కాదేమో! ఫలితంగా... నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 367 పరుగులు చేసింది ఆస్ట్రేలియా.

368 పరుగుల లక్ష్యంతో భారీ ఛేదనకు దిగిన పాక్‌ తొలుత దూకుడుగానే ఆడింది. ఓపెనర్లు తొలి వికెట్ కు 134 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. షఫీక్‌ (64), ఇమాముల్‌ (70), రిజ్వాన్‌ (46) మాత్రమే రాణించారు. ఫలితంగా 45.3 ఓవర్లలో పాకిస్థాన్ 305 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా 62 పరుగులతో పాక్ పై ఆస్ట్రేలియా విక్టరీ సాధించింది. "మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌" అవార్డ్ డేవిడ్‌ వార్నర్‌ (163: 124 బంతుల్లో 14×4, 9×6) కి దక్కింది.

రికార్డులే రికార్డులు:

ఈ మ్యాచ్ లో వరుస రికార్డులు నెలకొన్నాయి. ముఖ్యంగా వార్నర్ చేసిన సెంచరీ, మిచెల్ మార్ష్ తో కలిపి నమొదు చేసిన భాగస్వామ్యం, బాదిన సిక్సర్లు వెరసి సరికొత్త రికార్డులు క్రియేట్ అయ్యాయి. ఇందులో భాగంగా... ప్రపంచకప్‌ ల్లో వార్నర్‌ సాధించిన శతకాల సంఖ్య 5కి చేరగా... టోర్నీలో అత్యధిక సెంచరీలు చేసిన ఆసీస్‌ ఆటగాడిగా రికీ పాంటింగ్‌ ను సమం చేశాడు. ఈ జబితాలో రోహిత్‌ (7), సచిన్‌ (6) మొదటి రెండు స్థానాల్లోనూ ఉన్నారు!

తొలి వికెట్‌ కు వార్నర్‌, మార్ష్‌ నెలకొల్పిన భాగస్వామ్యం 259 పరుగులు... ప్రపంచకప్‌ లో రెండో అత్యుత్తమ ఓపెనింగ్‌ పార్ట్ నర్ షిప్. ఫస్ట్ ప్లేస్ లో 2011లో 282 పరుగులతో శ్రీలంక బ్యాటర్స్ దిల్షాన్‌- తరంగ పేరు మీద ఉంది! ఈ మ్యాచ్‌ లో ఆస్ట్రేలియా బ్యాటర్స్ మొత్తం 19 సిక్సర్లు బాదారు. ఇది కూడా రికార్డే. కాకపొతే ఈ రికార్డ్ గతంలోనూ ఆస్ట్రేలియా పేరుమీదే ఉంది. 2013లో భారత్‌ పై 19 సికర్ల రికార్డుతో ఇది సమం!

ఇక, వన్డేల్లో పాకిస్థాన్‌ పై వరుసగా 4 శతకాలు సాధించిన ఆటగాడిగా వార్నర్‌ రికార్డ్ సృష్టించాడు. ఈ ఫార్మాట్లో ఓ ప్రత్యర్థిపై వరుసగా అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో కోహ్లి అగ్రస్థానంలో ఉన్నాడు. కొహ్లీ వెస్టిండీస్‌ పై వరుసగా 4 సెంచరీలు చేశాడు. ఈ సమయంలో కొహ్లీ సరసన వార్నర్ చేరాడు! ఇదే సమయంలో... ఓ ప్రపంచకప్‌ మ్యాచ్‌ లో సెంచరీలు చేసిన నాలుగో ఓపెనింగ్‌ జోడీగా వార్నర్‌ - మార్ష్‌ నిలిచారు.

Tags:    

Similar News