.consent-eea { display:none; } .consent-ccpa{ display:none; } .amp-geo-group-eea .consent-eea { display:block; } .amp-geo-group-ccpa .consent-ccpa { display:block; }

టీ20 ప్రపంచకప్ విజేతగా భారత్ నిలిచిన వేళ.. టాప్ 5 మూమెంట్స్!

ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న (పదమూడేళ్లుగా) రోజు వచ్చేయటం.. పోటాపోటీగా సాగిన ఫైనల్ పోరులో.. అన్ని విభాగాల్లో తన అధిక్యతను ప్రదర్శించిన టీమిండియా

Update: 2024-06-30 05:16 GMT

గంభీరంగా ఉండే పలువురు చిన్న పిల్లల మాదిరి మారిపోవటమే కాదు.. ప్రపంచ కప్ ను సగర్వంగా అందుకునే వేళలో.. రోహిత్ శర్మలాంటి జంట్మిల్ మెన్ రోబోలా వేదిక వద్దకు నడిచి వచ్చిన తీరు చూస్తే చాలు.. టీ20 వరల్డ్ కప్ టోర్నీని సొంతం చేసుకున్న టీమిండియా ఆటగాళ్ల మూడ్ ఎలా ఉందన్న విషయాన్ని ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న (పదమూడేళ్లుగా) రోజు వచ్చేయటం.. పోటాపోటీగా సాగిన ఫైనల్ పోరులో.. అన్ని విభాగాల్లో తన అధిక్యతను ప్రదర్శించిన టీమిండియా.. తనకు ప్రపంచ విజేతగా నిలిచే సత్తా ఉందన్న విషయాన్ని సగర్వంగా నిరూపించిన వేళలో.. అరుదైన ఐదు ఘటనల గురించి ప్రస్తావించాల్సిందే.

1. రోబోలా నడిచి వచ్చిన రోహిత్

భారత్ విశ్వవిజేతగా నిలిచిన వేళ.. రోహిత్ సేన ఆనందానికి హద్దుల్లేవు. ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న జట్టు సభ్యుల ఆనందం ఒక ఎత్తు అయితే.. టీ20 వరల్డ్ కప్ ను చేతపట్టుకునేందుకు వేదిక మీదకు వెళ్లే వేళలో.. టీమిండియా కెప్టెన్ అనూహ్యంగా వ్యవహరించారు. రోబో మాదిరి నడుచుకుంటూ వెళ్లిన ఆయన తీరు అందరిని ఆకర్షించటమే కాదు.. దీన్ని చూసిన ప్రతి ఒక్కరి పెదాల మీదా చిరునవ్వులు చిందించాయి. రోహిత్ వ్యవహరించిన తీరు అందరిని ఆకట్టుకుంటోంది. ఒక ప్రత్యేకమైన సందర్భాన్ని అంతే ప్రత్యేకంగా సెలబ్రేట్ చేస్తున్నట్లుగా రోహిత్ తీరు ఉందని చెప్పాలి.

Read more!

2. కన్నీళ్లు పెట్టారు.. కన్నీళ్లు పెట్టించారు

టీ20 ప్రపంచ కప్ టోర్నీని భారత్ సొంతం చేసుకున్న సందర్బంలో ఫైనల్ మ్యాచ్ జరిగిన స్టేడియం మొత్తం తీవ్ర భావోద్వేగానికి గురైంది. వాళ్లు.. వీళ్లు అన్న తేడా లేకుండా టీమిండియా జట్టు సభ్యులంతా కన్నీళ్లు పెట్టేసుకున్నారు. ఎంతో కాలంగా తమను ఊరించి.. ఊరించి చంపిన వరల్డ్ కప్ చివరకు తమ చేతికి వచ్చేయటంతో.. వారంతా తీవ్రమైన ఎమోషన్ కు గురయ్యారు. అందరి కంటా ఆనందంతో కన్నీళ్లు కారాయి.

ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఆనందంతో టీమిండియా ఆటగాళ్లు.. వారిని అభిమానించి.. వారికి అండగా నిలిచిన అభిమానులు సైతం తీవ్రమైన భావోద్వేగానికి గురయ్యారు.వారిని లైవ్ లో చూస్తున్న కోట్లాది మంది క్రికెట్ అభిమానులు సైతం ఎమోషన్ తో కన్నీళ్లు పెట్టేసుకున్న పరిస్థితి. ఇదిలా ఉంటే.. ప్రత్యర్థి దక్షిణాఫ్రికా జట్టు సభ్యులంతా ఓటమి వేదనతో కన్నీళ్లు పెట్టేసుకున్నారు. దీంతో.. గెలిచిన జట్టు.. ఓడిన జట్టు రెండు జట్లు తమ భావోద్వేగాన్ని కన్నీళ్ల రూపంలో చాటటం విశేషంగా చెప్పాలి.

3. చెదరని ద్రవిడ్ సైతం కదిలిపోయారు

తాను టీమిండియా జట్టు సభ్యుడిగా వ్యవహరించిన వేళలో.. తానో వాల్ మాదిరి వ్యవహరించే వారు ప్రముఖ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్. ముఖంపై ఎలాంటి భావాల్ని కనిపించకుండా ఉండే ఆయన.. తన తీరుకు భిన్నంగా తీవ్రమైన ఎమోషన్ ను ప్రదర్శించారు. ఫైనల్ పోరులో విజయం సాధించిన తర్వాత హార్థిక్ పాండ్య ద్రవిడ్ ను హత్తుకొని కన్నీళ్లు పెట్టుకుంటే.. ద్రవిడ్ సైతం అంతేలా స్పందించారు. అంతేకాదు.. ద్రవిడ్ తన భావోద్వేగాల్ని కంట్రోల్ చేసుకోకుండా కోట్లాది మంది టీవీలు వీక్షిస్తున్నారన్న ఆలోచన లేకుండా తమకు నచ్చినట్లుగా వ్యవహరించారు. మిగిలిన వారి సంగతి ఎలా ఉన్నా.. రాహుల్ ద్రవిడ్ రియాక్షన్ మాత్రం సమ్ థింగ్ స్పెషల్ గా చెప్పక తప్పదు.

4. చరిత్రలో నిలిచిపోయే క్యాచ్

టీ20 ప్రపంచ కప్ ఫైనల్ పోరులో టీమిండియా సభ్యుడు సూర్యకుమార్ అందుకున్న చిరస్మరణీయమైన క్యాచ్ క్రికెట్ ఆట ఉన్నంతవరకు నిలిచిపోతుంది. మ్యాచ్ కు కీలకమైన ఈ క్యాచ్ ను ఎంతో క్లిష్టతను ఎదుర్కొంటూనే.. మిస్ కాకుండా పట్టేసి.. వికెట్ ను ఒడుపుగా పడగొట్టిన వైనం అందరిని విపరీతంగా ఆకట్టుకుంటోంది. 2007 టీ20 ప్రపంచ కప్ లో శ్రీశాంత్ క్యాచ్.. 2011 వన్డే ప్రపంచ కప్ టోర్నీలో ధోని కొట్టిన సిక్సర్ కు తీసిపోని రీతిలో సూర్యకుమార్ అద్భత క్యాచ్ ఉందని చెప్పాలి.

మ్యాచ్ విజేతగా మాత్రమే కాదు టోర్నీ విజేతగా నిలిచే చివరి ఓవర్ కు సౌతాఫ్రికాతో పాటు టీమిండియా సభ్యులు సైతం ఎంతో ఉత్కంటతో ఉన్నారు. చివరి ఓవర్ లో 16 పరుగులు అవసరం కాగా.. వాటిని సాధించే పట్టుదలతో సౌతాఫ్రికా.. ఎలాగైనా అన్ని పరుగులు చేయకుండా నిరోదించాలన్న పట్టుదలతో టీమిండియా సభ్యులున్నారు. ఇలాంటి వేళలో హార్దిక్ వేసిన తొలి బంతిని మిల్లర్ గాల్లోకి లేపాడు. అది సిక్సర్ వెళ్లేలా కనిపించింది. అయితే.. బౌండరీ దాటి బయటపడి ఉంటే ఫలితం మరోలా ఉండేది.

కానీ.. వైడ్ లాంగాఫ్ నుంచి మెరుపు వేగంతో దూసుకొచ్చిన సూర్య ఒక్క ఉదుటున బంతిని అందుకున్నాడు.కానీ నియంత్రణ కోల్పోయి బౌండరీ గీత దాటాడు. అయితే.. అంతలోనే బంతిని గాల్లోకి విసిరాడు. తిరిగి బౌండరీ గీత బయటకువచ్చిన అతను.. బంతిని ఒడుపుగా పట్టుకొని వికెట్ తీశాడు. ఈ అద్భుత క్యాచ్ మొత్తం నాలుగైదు సెకన్ల కు మించి ఉండదు.కానీ.. దీన్ని చూసిన ఏ అభిమాని సైతం తన జీవిత కాలంలో మర్చిపోలేరు. అంతటి అద్భుత క్యాచ్ ను పట్టిన సూర్య కుమార్ చరిత్రలో నిలిచిపోతారు. అంతేకాదు.. జట్టును టీ20 ప్రపంచకప్ విజేతగా అవతరించటంలోనూ కీలక భూమిక పోషించారు.

5. అంచనాలు నిల్.. అదగొట్టేసి ఫుల్ హ్యాపీ

క్రికెట్ ను ఒక క్రీడలా కాకుండా ఒక మతంలా ఫీలయ్యే దేశంగా భారత్ అందరికి తెలిసిందే. ఈ దేశంలో మతాలకు.. కులాలకు.. ప్రాంతాలకు అతీతంగా అందరిని ఏకం చేసేది క్రికెట్ మాత్రమే. అలాంటి ఈ క్రీడకు సంబంధించిన ఏదైనా భారీ టోర్నీ జరుగుతున్న వేళలో అభిమానుల్లో అంచనాలు భారీగా ఉంటాయి. టీ20, వన్డే, టెస్టు ఇలా ఫార్మాట్ ఏదైనా.. ఫలితం మాత్రం గెలవాలన్నట్లుగా ఉంటారు క్రికెట్ అభిమానులు.

ఇక.. ప్రపంచ కప్ లాంటి టోర్నీల వేళ.. టీమిండియా మీద అంచనాలు భారీగా ఉంటాయి. ఈ తీరుకు భిన్నంగా తాజాగా ముగిసిన టీ20 వరల్డ్ కప్ నిలిచిందని చెప్పాలి.పెద్దగా అంచనాలు లేకుండా ఈ టోర్నీలోకి అడుగుపెట్టింది టీమిండియా. టోర్నీ ఆరంభంలో కాస్తంత తడబడినప్పటికీ.. ఆ తర్వాత అంచనాలకు మించిన ప్రదర్శనతో ఏకంగా కప్పు కొట్టేసిన రోహిత్ సేన అదరగొట్టేసిందని చెప్పాలి.

వెస్టిండీస్.. అమెరికాలు సంయుక్తంగా అతిధ్యం ఇచ్చిన ప్రపంచకప్ టోర్నీ ఆరంభంలో అభిమానులు పెద్దగా పట్టించుకోలేదు. దీనికి కారణం.. మనకు అనుకూలంగా లేని టైమింగ్.. తక్కువ స్కోర్లు.. వర్షం లాంటి కారణాలతో దీనిపై పెద్దగా ఆసక్తి వ్యక్తం కాలేదు. గ్రూప్ దశ వరకు టిమిండియా మ్యాచ్ లకు ఆశించినంత ఆదరణ కూడా లేకుండాపోయింది. సహజంగా ఎప్పుడు.. ఎక్కడైనా సరే భారత్ - పాక్ మధ్య మ్యాచ్ జరిగితే ఉండే యూఫోరియా ఈసారి మాత్రం కనిపించలేదు.అలాంటిది చివరకు వచ్చేసరికి అందరికి కప్పు ఈసారైనా సొంతం చేసుకుంటామా? అన్న ఆసక్తి వ్యక్తమైంది. కట్ చేస్తే.. మొదట్లో ఎవరికి పట్టని టీ20 ప్రపంచ కప్ చివరకు మనకే దక్కటంతో సగటు అభిమాని సంతోషానికి హద్దుల్లేకుండా చేసింది.

Tags:    

Similar News