గోట్ గోల్ నంబర్ '900'.. ఈ 'గోల్' ను ఎవరూ చేరుకోలేరు..

ఎందుకంటే.. టెస్టుల్లో 800 వికెట్ల రికార్డును ఎవరూ ఎలా అందుకోలేరో.. ఇప్పుడు ఫుట్ బాల్ లో అతడు సాధించిన 900వ గోల్ నూ ఎవరూ చేరుకోలేరు.

Update: 2024-09-06 19:30 GMT

అతడు దేశానికి ప్రపంచ కప్ సాధించిపెట్టలేకపోవచ్చు.. లీగ్ లలోనే రాణిస్తుండవచ్చు.. వయసు మీదపడినా జట్టును వీడకుండా ఉన్నాడని విమర్శించవచ్చు.. కానీ, అతడు ప్రపంచ ఫుట్ బాల్ కు రారాజు కాదంటే మాత్రం ఎవరూ నమ్మరు. ఎందుకంటే.. టెస్టుల్లో 800 వికెట్ల రికార్డును ఎవరూ ఎలా అందుకోలేరో.. ఇప్పుడు ఫుట్ బాల్ లో అతడు సాధించిన 900వ గోల్ నూ ఎవరూ చేరుకోలేరు. ఇదంతా చెబుతున్నది ఎవరి గురించో అందరికీ అర్థమైపోయి ఉంటుంది.

అతడే దిగ్గజం?

ఫుట్ బాల్ చరిత్రలో గోట్ (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్) అంటే అందరూ చెప్పే మాట బ్రెజిల్ స్టార పీలే. ఇక డిగో మారడోనా, లయోనల్ మెస్సీ.. సరేసరి. వీరూ దిగ్గజాలే. కానీ, వీరిని మించినవాడు క్రిస్టియానో రొనాల్డొ అని చెప్పాలి. ఇప్పుడీ పోర్చుగల్ వీరుడు 900వ గోల్ కొట్టాడు. ఈ ఘనత సాధించిన తొలి ఫుట్ బాలర్ ఇతడే కావడం గమనార్హం. బహుశా చివరి ఫుట్ బాలర్ కూడా అనుకోవాలేమో? లేదంటే మరో 15 ఏళ్లయినా ఈ రికార్డు అలాగే ఉంటుందని భావించాలేమో?

యూనియన్ ఆఫ్ యూరోపియన్ ఫుట్ బాల్ అసోసియేషన్ (యూఈఎఫ్ఏ) నేషన్స్ లీగ్ లో క్రొయేషియాతో జరిగిన మ్యాచ్ లో రొనాల్డో గోల్ చేశాడు. ఇది అతడికి 900వ గోల్ కావడం విశేషం. అయితే, సహచరుడు, అర్జెంటీనాకు రెండేళ్ల కిందట ప్రపంచ కప్ అందించిన మెస్సీ కంటే రొనాల్డో 58 గోల్స్ ఎక్కువలో ఉన్నాడు. మెస్సీ 842 గోల్స్ వద్ద ఉన్నాడు. పీలే 765 గోల్స్ తో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.

తదుపరి గోల్ ‘వెయ్యి’

39 ఏళ్ల రొనాల్డొ 2002లో అంతర్జాతీయ ఫుట్ బాల్ లోకి వచ్చాడు. వచ్చే ఫిబ్రవరితో 40వ ఏట ప్రవేశిస్తాడు. అంతర్జాతీయ కెరీర్ నుంచి రిటైర్ అవుతాడనే కథనాలు కొన్నాళ్లుగా వస్తున్నాయి. అయితే, ఇప్పట్లో రిటైర్మెంట్ ప్లాన్లు లేవంటున్నాడు. అంతేకాదు.. తన లక్ష్యం వెయ్యి గోల్స్ అంటున్నాడు. 900కి చేరుతానని ముందే ఊహించానని చెప్పాడు.

Tags:    

Similar News